కేటీఆర్
కల్వకుంట్ల రామారావు (కేటీఆర్) తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తనయుడైన కేటీఆర్.. ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిథ్యంవహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో తొలిసారి సిరిసిల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ సాధన కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, 2010 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 68 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో రెండోసారి గెలిచారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి గెలుపొంది.. కేసీఆర్ కేబినెట్‌లో మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో 89 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఆయన.. 2019 సెప్టెంబర్ 8న రెండోసారి కేసీఆర్ కేబినెట్‌లో ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల బాధ్యతలు చేపట్టారు.