Congress vs BRS: బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా.. మణుగూరులో ఏం జరిగిందంటే..
మణుగూరులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మణుగూరు మంటలు కాకరేపుతున్నాయి. మణుగూరు పార్టీ కార్యాలయం దహనం చేసిన ఘటన పెనుదుమారంగా మారింది. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి జెండా ఎగరేయడంతో.. పాలిటిక్స్ మరింత వేడెక్కాయి.. దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు.

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్.. భగ్గుమన్న రాజకీయ మంటలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని BRS కార్యాలయంపై దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఫర్నిచర్‌కు నిప్పుపెట్టారు. అడ్డుపడ్డ గులాబీ దండుతో ఘర్షణకు దిగారు. ప్రస్తుతం పోలీస్ పహారాలో ఉంది మణుగూరు పట్టణం. అసలు గొడవేంటి, ఎక్కడ మొదలైంది.. ఎందుకు రాజుకుంది? ఇప్పుడు మంటల్లో చిక్కుకున్న ఈ భవనం గతంలో కాంగ్రెస్ కార్యాలయంగా ఉండేది.2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రేగా కాంతారావు ఆ తర్వాత పార్టీ మారారు. దీంతో కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారని ఆరోపిస్తూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ.. ఈ కార్యాలయంపై గత కొద్ది సంవత్సరాలుగా వివాదం నడుస్తూ వస్తోంది..
ఈ క్రమంలోనే.. ఇవాళ మరో అడుగు ముందుకేసి భవనాన్ని స్వాధీనం చేసుకుని, కాంగ్రెస్ జెండా ఎగురవేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరు గాయపడ్డారు కూడా. పైసాపైసా కూడబెట్టుకుని తమ పార్టీ కార్యకర్తలు కట్టుకున్న కార్యాలయానికి బీఆర్‌ఎస్ రంగులు ఎలా వేస్తారనేది కాంగ్రెస్ ప్రశ్న..
దాడిని ఖండించిన కేటీఆర్..
ఇదిలా ఉంటే, మణుగూరులో పార్టీ ఆఫీస్‌పై దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఘటనపై రేగా కాంతారావుతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయిందని, కాంగ్రెస్ అరాచకాలకు భయపడాల్సిన అవసరం లేదని మణుగూరు బీఆర్‌ఎస్ శ్రేణులకు భరోసానిచ్చారు.
రేగా వర్సెస్ పాయం..
కాంగ్రెస్సే ఈ పనికి పాల్పడిందంటున్న రేగా కాంతారావు పేర్కొనగా.. తమ ఆఫీస్‌ని కబ్జాచేశారంటూ పాయం వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఆఫీస్ తమదే అనడానికి ఆధారాలు ఉన్నాయని పాయం పేర్కొన్నారు. ఆధారాలు ఉంటే చూపించాలని రేగా కాంతారావు సవాల్ విసిరారు. దీంతో మణుగూరు రాజకీయం రణరంగంగా మారింది.
ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది మణుగూరు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించి, పోలీసులు భారీగా మోహరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
