ఎండకాలంలో బెల్లం తింటే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు చెప్పేది వింటే నోరెళ్లబెడతారు..
బెల్లం.. ప్రకృతి మనకు ఇచ్చిన అద్భుతమైన వరం. పంచదారకు ప్రత్యామ్నాయంగా, పోషకాల గనిగా మనం బెల్లాన్ని అమితంగా ఇష్టపడతాం. అయితే మండుతున్న ఎండల్లో బెల్లం తినడం అమృతమా? లేక అనారోగ్యానికి దారితీస్తుందా? వేసవిలో బెల్లం తింటే శరీరం వేడి చేస్తుందా? అసలు ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? అనేది తెలుసుకుందాం..

ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన తీపి పదార్థం బెల్లం. పంచదారకు ప్రత్యామ్నాయంగా, ఆరోగ్యానికి వరంగా భావించే బెల్లాన్ని మనం నిత్యం వాడుతుంటాం. అయితే ఎండలు మండిపోయే వేసవి కాలంలో బెల్లం తినడం సురక్షితమేనా? దీనివల్ల శరీరానికి లాభమా లేక నష్టమా? దీనికి సంబంధించి శారదా హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రేయ్ శ్రీవాస్తవ కీలక విషయాలు వెల్లడించారు. బెల్లం కేవలం రుచికరమైనదే కాదు, ఇది పోషకాల నిధి. ఇందులో శరీరానికి అవసరమైన ఎన్నో అంశాలు ఉన్నాయి. బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నీరసంగా ఉన్నప్పుడు కొంచెం బెల్లం తింటే శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరం నుండి హానికరమైన వ్యర్థాలను తొలగించడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది.
వేసవిలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
బెల్లం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ దాని స్వభావం వేడి. అందుకే వేసవిలో దీనిని అధికంగా తీసుకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవు. బెల్లం ఎక్కువగా తినడం వల్ల శరీరంలో అంతర్గత వేడి పెరుగుతుంది. అసిడిటీ సమస్య ఉన్నవారు, తరచుగా ముక్కు నుండి రక్తం పడేవారు, సహజంగానే శరీర తత్వం వేడిగా ఉండేవారు వేసవిలో బెల్లానికి దూరంగా ఉండటం లేదా చాలా తక్కువగా తీసుకోవడం మంచిది.
వేసవిలో బెల్లం తినే సరైన పద్ధతి ఇదే
వేసవిలో కూడా బెల్లం ప్రయోజనాలను పొందాలనుకుంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
- రోజుకు 5 నుండి 10 గ్రాములకు మించి బెల్లం తినకూడదు.
- ఉదయం లేదా మధ్యాహ్నం వేళల్లో తీసుకోవడం ఉత్తమం.
- బెల్లం తిన్నప్పుడు దాని వేడిని తగ్గించడానికి మజ్జిగ, సోంపు లేదా తగినంత నీరు తీసుకోవాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.
వేసవిలో బెల్లం తినడం పూర్తిగా ప్రమాదకరం కాదు. కానీ అది అమృతమైనా సరే అతిగా తీసుకుంటే విషమే. కాబట్టి పరిమితంగా, పద్ధతిగా తీసుకుంటే ఎండకాలంలోనూ బెల్లం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
