Ball Tampering: సాండ్‌పేపర్ వివాదంలో అసలు నిజం బయటకు రాదా? ప్యాట్ కమిన్స్‌కు బెన్ స్టోక్స్ మద్దతు
Ball Tampering: 2018 సాండ్‌పేపర్‌గేట్ వివాదం ఉస్మాన్ ఖవాజా ఆత్మకథతో మరోసారి చర్చలోకి వచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌పై వస్తున్న ఆరోపణలు, అతడి ఖండనపై బెన్ స్టోక్స్ స్పందించాడు. కమిన్స్ ఎదుర్కొంటున్న వ్యక్తిగత ఒత్తిడిపై సానుభూతి తెలిపాడు. ఈ వివాదం పూర్తి నిజం ఎప్పటికీ బయటపడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.

Ball Tampering: ఎనిమిదేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథలో చేసిన వ్యాఖ్యలతో మొదలైన చర్చ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియా కెప్టెన్‌కు మద్దతుగా మాట్లాడాడు. కమిన్స్‌తో పాటు ఈ వివాదంలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది కుటుంబాలు కూడా ఒత్తిడికి గురవుతున్నాయని అభిప్రాయపడ్డాడు. మార్క్ వుడ్‌తో కలిసి నిర్వహిస్తున్న దట్స్ నాట్ క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో బెన్ స్టోక్స్ ఈ అంశంపై మాట్లాడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించడం సహజంగానే ఒత్తిడితో కూడుకున్న పని అని, అయితే ప్రస్తుతం కమిన్స్ ఎదుర్కొంటున్న పరిస్థితి అంతకంటే భిన్నమని చెప్పాడు. ప్రజల ముందు ఎదురయ్యే విమర్శలతో పాటు ఇంట్లో, వ్యక్తిగత జీవితంలోనూ ఇలాంటి వివాదాల ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. జీవిత భాగస్వామి భావోద్వేగాలను కూడా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొన్నాడు. గతంలో తాను కూడా మీడియా ఒత్తిడిని ఎదుర్కొన్న అనుభవం ఉందని, అందుకే కమిన్స్ పరిస్థితిపై సానుభూతి ఉందని స్టోక్స్ వివరించాడు.
ఆస్ట్రేలియాలో క్రికెట్ యుద్ధం
ఆస్ట్రేలియా క్రికెట్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని స్టోక్స్ మార్వెల్ సినిమా ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’తో పోల్చాడు. ఆ సినిమాలో ఒకరిపై మరొకరు పోరాడినట్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించాడు. 2018లో వివాదం జరిగినప్పుడు తీసుకున్న నిర్ణయాలు, అప్పటి నిర్వహణ వ్యవహారాలు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయని చెప్పాడు. అప్పట్లో క్రికెట్ ఆస్ట్రేలియా బాధ్యతల్లో ఉన్న జేమ్స్ సదర్లాండ్, డేవిడ్ పీవర్ వంటి పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు కొత్త నాయకత్వం, ప్రస్తుత ఆటగాళ్లు సమాధానం చెప్పాల్సి వస్తోందని అభిప్రాయపడ్డాడు. ఈ పరిణామాల వల్ల తప్పు చేయని వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఖవాజా పుస్తకంతో మళ్లీ మొదలైన వివాదం
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా తన సబ్ర్ ఆత్మకథలో 2018 బాల్ ట్యాంపరింగ్ ఘటనపై కీలక విషయాలు వెల్లడించాడు. సౌతాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులో బంతిని రఫ్ చేసేందుకు ఇసుక కాగితం వాడిన విషయం జట్టులో చాలామందికి తెలుసని తన పుస్తకంలో పేర్కొన్నాడు. అంతేకాదు, ఈ ఘటనకు జట్టు మొత్తం బాధ్యత తీసుకోవాలని తాను అప్పట్లో సూచించినట్లు వివరించాడు. ఈ వ్యాఖ్యలను డేవిడ్ వార్నర్ సమర్థించగా, ప్యాట్ కమిన్స్ మాత్రం తీవ్రంగా ఖండించాడు. ఖవాజా చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పని, తాను శాండ్ పేపర్ మైదానంలోకి తీసుకెళ్తున్న విషయం తెలియదని స్పష్టం చేశాడు. ఈ వివాదంపై ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమ అనుభవాలు పంచుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
సాండ్‌పేపర్‌గేట్ అంటే ఏమిటి?
2018లో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ బంతిని ఇసుక కాగితంతో రుద్దుతూ కెమెరాకు చిక్కాడు. ఈ ఘటన బయటపడటంతో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకుంది. స్మిత్, వార్నర్‌పై ఏడాది నిషేధం విధించగా.. బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం పడింది. ఈ ఘటనను క్రికెట్ ప్రపంచం ‘సాండ్‌పేపర్‌గేట్’గా పిలుస్తోంది. 2021లోనూ బాన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలతో ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఇప్పుడు ఖవాజా ఆత్మకథతో మరోసారి వివాదం రాజుకుంది.
నిజం ఎప్పటికీ బయటకు రాదా?
బాల్ ట్యాంపరింగ్ ఘటనలో అసలు ఏం జరిగిందనే పూర్తి నిజం భవిష్యత్తులోనూ బయటకు వచ్చే అవకాశం లేదని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. ఈ వ్యవహారంపై తనకంటూ ఒక అభిప్రాయం ఉందని, అయితే మరిన్ని ఊహాగానాలకు తాను కారణం కావాలనుకోవడం లేదని చెప్పాడు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అప్పటి నిర్వహణలో ఉన్నవారు, వారి కుటుంబాలు ఇప్పటికే చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారని పేర్కొన్నాడు. ఈ అంశంపై చర్చకు ఇప్పటికైనా ముగింపు పలకాలని సూచించాడు. వివాదాన్ని మళ్లీ మళ్లీ ప్రస్తావించడం వల్ల అనవసరంగా ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయని స్టోక్స్ హెచ్చరించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
