హైవేలపై ప్రమాదాలకు చెక్.. హైదరాబాద్-విజయవాడ రూట్‌లో 60 అండర్‌పాస్ బ్రిడ్జిలు!
గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల మీద రక్తపాతం ఆగడం లేదు. చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రాణనష్టంగా మారుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి అయితే రోజూ యాక్సిడెంట్లకు కేంద్రబిందువుగా మారిపోయింది. ఈ పెరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఎన్‌హెచ్‌ఏఐ చివరకు సీరియస్ చర్యలకు పూనుకుంది.

నాలుగు వరుసల జాతీయ రహదారిని తొందరపాటు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య నిర్మించినప్పుడు జరిగిన సాంకేతిక లోపాలే నేటి ప్రమాదాలకు మూలాలు అన్న విషయం స్పష్టమైంది. అనేక చోట్ల రోడ్డు మలుపులు అర్ధంలేకుండా తిరిగిన తీరు, జంక్షన్లలో సరైన క్రాస్ మువ్మెంట్ లేకపోవడం, పాదచారులు, టు వీలర్లకు సేఫ్ రూట్స్ లేకపోవడం పెద్ద సమస్యలయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆరు వరుసల విస్తరణలో తప్పిదాలు రిపీట్ కాకుండా ఎన్‌హెచ్‌ఏఐ కొత్త పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా జంక్షన్ల వద్ద ప్రమాదాలు తగ్గించేందుకు భారీగా అండర్‌పాస్‌లను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మొత్తం దాదాపు 231 కిలోమీటర్ల విస్తరణ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డీపీఆర్‌ను ఐకాన్స్ సంస్థ రెడీ చేసి సమర్పించింది.
ఈ ప్రాజెక్ట్‌లో సుమారు 60 అండర్‌పాస్‌లను ప్రతీ 2–3 కిలోమీటర్లకోటి ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అదనంగా 17 వెహిక్యులర్ అండర్‌పాసెస్, 35 లైట్ వెహిక్యులర్ అండర్‌పాసెస్, 8 చిన్న అండర్‌పాసెస్, 10 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు కూడా రానున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే ప్రమాదాలకు పేరొందిన బ్లాక్‌స్పాట్‌ల వద్ద నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి వల్ల ప్రమాదాలకు చెక్ పెట్టడమే కాకుండా.. ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేసి.. త్వరగా గమ్యాస్థానాలు చేరుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




