Post Office: పోస్టాఫీస్‌లో అద్భుత స్కీమ్.. బ్యాంక్ కంటే అధిక వడ్డీ.. లక్ష పెడితే 5 ఏళ్లలో ఎంత వస్తుందంటే..?
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం బ్యాంకు ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ హామీతో మీ పెట్టుబడికి పూర్తి భద్రత లభిస్తుంది. రూ.1000తో ప్రారంభించి 7.5శాతం వరకు వడ్డీతో మీ పొదుపును పెంచుకోవచ్చు. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు ఇప్పడు తెలుసుకుందాం..

సాధారణంగా పోస్టాఫీస్ అంటే ఉత్తరాలు, పార్శిల్‌ల కోసమే అనుకుంటారు. కానీ, ఆధునిక పోస్టాఫీస్ ఇప్పుడు బ్యాంకింగ్ సేవలను కూడా విస్తృతంగా అందిస్తోంది. వీటిలో రికరింగ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్, నెలవారీ ఆదాయ పథకం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వంటి అనేక పొదుపు పథకాలు ఉన్నాయి. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అందించే టైమ్ డిపాజిట్ అనేది.. బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకానికి మెరుగైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.
బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ రేట్లు
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఇది అనేక బ్యాంకులు అందించే ఎఫ్‌డీల కంటే మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ 1 సంవత్సరం TDకి 6.9 శాతం, 2 సంవత్సరాలకు 7.0శాతం, 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలకు 7.5శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ అధిక వడ్డీ రేట్ల కారణంగానే పెట్టుబడిదారులు పోస్ట్ ఆఫీస్ TD వైపు మొగ్గు చూపుతున్నారు.
పెట్టుబడిపై రాబడి లెక్క
ఉదాహరణకు, మీరు 7.5శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ పథకంలో రూ.లక్ష పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ సమయానికి వడ్డీ రూపంలో రూ.44,995 లభిస్తుంది. అంటే మీ అసలు మొత్తంతో కలిపి మీకు మొత్తం రూ.1,44,995 అందుతుంది. ఇది చాలా సాధారణ బ్యాంకులు అందించే FDల రాబడి కంటే ఎక్కువ.
కనీస పెట్టుబడి – భద్రత
ఈ TD ఖాతా తెరవడానికి కనీసం రూ.1000 ఉంటే సరిపోతుంది. గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. ఈ పథకంలో భద్రత అనేది మరో ముఖ్య ప్రయోజనం. ఇండియా పోస్ట్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది. పోస్టల్ విభాగం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల మీ అసలు, వడ్డీకి పూర్తి భద్రత లభిస్తుంది.
అందరికీ అనుకూలం
పోస్ట్ ఆఫీస్ TD పథకం ప్రతి ఒక్కరికీ సరిపోయేలా రూపొందించారు. ఇందులో తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా తమ పొదుపును ప్రారంభించవచ్చు. ఇందులో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులతో కలిసి ఉమ్మడి ఖాతా తెరవడానికి కూడా అనుమతి ఉంది. ఈ పథకంలో సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేకించి అదనపు వడ్డీ రేట్లు ఉండవు. అందరు కస్టమర్లకు ఒకే వడ్డీ రేటు వర్తిస్తుంది. ఎటువంటి రిస్క్ లేకుండా తమ ఆర్థిక లక్ష్యాలను నిర్మించుకోవాలనుకునే వారికి 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఒక ఉత్తమ ఎంపిక.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








