Silver: 2026లో వెండి ధర పెరుగుతుందా.. తగ్గుతుందా..? అసలు వాస్తవాలు తెలుసుకోండి..
గత కొన్ని నెలలుగా వెండి ధరలు అసాధారణంగా దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది ఏకంగా 120 శాతం పెరిగి కిలో వెండి ఏకంగా రూ.2 లక్షలు దాటి 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. పారిశ్రామిక, సౌరశక్తి రంగాలలో పెరుగుతున్న డిమాండ్, పెట్టుబడి సాధనంగా వెండి ఆదరణ దీనికి కారణం. వచ్చే ఏడాది వెండి రేట్ ఎంత పెరుగుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా వెండి మాత్రం అనూహ్యంగా దూసుకుపోతోంది. ఈ ఏడాది వెండి ధర ఏకంగా 120 శాతం వరకు పెరగడం మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే కిలో వెండి ధర రూ. 2 లక్షలు దాటగా వచ్చే ఏడాది నాటికి ఈ ధర రూ. 2.5 లక్షలకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
46 ఏళ్ల రికార్డు బద్దలు
ఈ సంవత్సరం వెండి ధర దాదాపు 120 శాతం పెరిగింది. డిసెంబర్ 12 నాటికి దేశీయ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ. 2 లక్షలకు పైగా చేరింది. 1979 తర్వాత వెండి ధర ఇంత పెద్ద మొత్తంలో పెరగడం ఇదే మొదటిసారి. ఇది 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.
వచ్చే ఏడాది రూ. 2.5 లక్షలు?
విశ్లేషకుల అంచనాల ప్రకారం.. భవిష్యత్తులో కూడా వెండి ధర పెరుగుతూనే ఉంటుంది. రాబోయే సంవత్సరంలో వెండి ధర కిలోకు రూ. 2,40,000 నుండి రూ. 2,50,000 వరకు పెరగవచ్చు. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే వచ్చే ఏడాది సుమారు 25 శాతం పెరిగే అవకాశం ఉంది.
డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలు:
వెండి ధర ఇంత భారీగా పెరగడానికి కారణం పారిశ్రామిక, పెట్టుబడి రంగాలలో ఈ లోహానికి డిమాండ్ విపరీతంగా పెరగడమే..
పారిశ్రామిక వినియోగం: పారిశ్రామిక ప్రపంచంలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సాంకేతిక రంగాలలో వెండిని పెద్ద మొత్తంలో ఉపయోగిస్తున్నారు.
పెట్టుబడి దృష్టి: ప్రజలు ఇప్పుడు బంగారంతో పాటు వెండిని కూడా ఒక ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు.
సౌరశక్తి రంగం: సౌరశక్తి రంగంలో వెండి డిమాండ్ గత నాలుగు సంవత్సరాలలో నాలుగు రెట్లు పెరిగింది. 2020లో సౌరశక్తి రంగంలో వెండి డిమాండ్ 94.4 మిలియన్ ఔన్సులుగా ఉండగా.. 2024 నాటికి ఆ డిమాండ్ 243.7 మిలియన్ ఔన్సులకు పెరిగింది.
పారిశ్రామిక, సౌరశక్తి రంగాలలో వెండి వినియోగం పెరుగుతుండటంతో భవిష్యత్తులో ఈ విలువైన లోహం ధర మరింత పెరిగి రూ. 2.5 లక్షల మార్కును దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








