అత్తమామల సాహసం.. భార్యకొడుకును చూసేందుకు వచ్చి కటకటాల పాలు!
అక్రమంగా దేశంలోకి ప్రవేశించి హైదరాబాద్‌లో నివాసం ఉంటోన్న పాకిస్థాన్ యువకుడు ఫయాజ్ అహ్మద్ (24)ను బహదూర్‌పుర పోలీసులు గురువారం (ఆగస్టు 31) అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని శంగల్ జిల్లాకు చెందిన ఫైజ్ మహమ్మద్‌ను అరెస్టు చేసినట్లు శుక్రవారం (సెప్టెంబర్ 1) నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ..

హైదరాబాద్, సెప్టెంబర్ 2: అక్రమంగా దేశంలోకి ప్రవేశించి హైదరాబాద్‌లో నివాసం ఉంటోన్న పాకిస్థాన్ యువకుడు ఫయాజ్ అహ్మద్ (24)ను బహదూర్‌పుర పోలీసులు గురువారం (ఆగస్టు 31) అరెస్ట్ చేశారు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని శంగల్ జిల్లాకు చెందిన ఫైజ్ మహమ్మద్‌ను అరెస్టు చేసినట్లు శుక్రవారం (సెప్టెంబర్ 1) నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ జోన్) పి సాయి చైతన్య తెలిపారు. పురానాపూల్ డీసీపీ కార్యాలయంలో ఫలక్‌నుమా ఏసీపీ సుధాకర్, బహదూర్‌పుర ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్, డీఐ శ్రీశైలం, ఎస్సై బిక్షంలతో డీసీపీ పి.సాయిచైతన్య మీడియాకు వివరాలు వెల్లడించారు.
వీసా లేకుండా నేపాల్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. హైదరాబాద్‌లోని కిషన్ బాగ్ ప్రాంతంలోని అతని భార్య పుట్టింటిలో గత 10 నెలలుగా నివాసం ఉంటున్నాడు. కరాచీలో డెనిమ్ క్లాతింగ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఫైజ్ 2018లో షార్జాలోని డెసర్ట్ స్టూడియో గార్మెంట్స్ కంపెనీలో చేరాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని అసద్‌బాబా నగర్‌కు చెందిన నేహాఫాతిమా(29) అనే యువతి 2019లో షార్జాలోని బట్టల షాపులో పనిచేసేందుకు వెళ్లింది. అక్కడ ఫాతిమా, ఫయాజ్‌లకు పరిచయం, అది ప్రేమగా మారడం జరిగిపోయింది. ఇలా వారు 2020 ఫిబ్రవరి వరకు షార్జాలోనే ఒకే ఇంట్లో కలసి ఉన్నారు. ఫాతిమా గర్భం దాల్చడంతో వారి వివాహం కూడా అక్కడే జరిగింది. వీరి మూడేళ్ల కుమారుడిని హైదరాబాద్‌లోని ఫాతిమా సవతితల్లి వద్ద వదిలేసి దుబాయ్ వెళ్లి2022 అగస్టులో తిరిగి వచ్చింది. తొలుత ఫాతిమాను పాకిస్థాన్ తీసుకెళ్లేందుకు ఫయాజ్ అహ్మద్ విఫలయత్నం చేశాడు. దీంతో అతన్నే నగరానికి తీసుకురావడానికి ఫాతిమా స్కెచ్ వేసింది.
భారత్‌లో ఉండేందుకు నకిలీ ఐడీ ప్రూఫ్ ఇప్పిస్తానని అత్తమామలు హామీ ఇవ్వడంతో భార్య, కుమారుడిని కలవడానికి హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమయ్యాడు. టూరిస్ట్ వీసాపై పాక్ నుంచి గతేడాది నవంబరు 13న నేపాల్ చేరిన ఫయాజ్ అక్కడికి వచ్చిన అత్తమామలు, భార్యతో కలసి హైదరాబాద్‌కు వచ్చాడు. దేశ పౌరుడిగా గుర్తింపు పొందడానికి తన బావమరిది మహ్మద్‌గౌస్ బర్త్ సర్టిఫికెట్ తీసుకుని ఈ ఏడాది మార్చిలో ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాడు. ఈ సమాచారం బహదూర్‌పుర పోలీసులకు అందడంతో పోలీసులు గురువారం ఫయాజ్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి గడువు తీరిన పాకిస్థాన్ పాస్‌పోర్టు, పాక్ గుర్తింపుకార్డు, పాకిస్థాన్-నేపాల్ విమాన టిక్కెట్లతో పాటు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వ్యక్తి అత్తమామలు పరారీలో ఉన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
