తెలంగాణ నిరుద్యోగులకు హైకోర్టు షాక్.. ఆ పరీక్షనుకూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ
గతేడాది నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 రాత పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. రాత పరీక్షల నిర్వహణలో అవకతవకల కారణంగా ఈ పరీక్షను కోర్టు రద్దు చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను మళ్లీ ప్రకటించి, పరీక్షను నిర్వహించాలని కోర్టు..
హైదరాబాద్, ఆగస్టు 30: గతేడాది నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 రాత పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. రాత పరీక్షల నిర్వహణలో అవకతవకల కారణంగా ఈ పరీక్షను కోర్టు రద్దు చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను మళ్లీ ప్రకటించి, పరీక్షను నిర్వహించాలని కోర్టు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన పిటిషన్‌ను అనుమతిస్తూ తుది తీర్పు వెలువరించింది.
అసలింతకీ ఏం జరిగిందంటే..
సింగరేణిలో మొత్తం 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులను భర్తీకి గానూ గతేడాది సెప్టెంబర్ 4వ తేదీన రాత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 79,898 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ పరీక్ష నిర్వహణ సమయంలో మాస్ కాపీయింగ్, ఇతర అవకతవకలు జరిగాయని పేర్కొంటూ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. రామగుండంకు చెందిన అభిలాష్ తోపాటు పలువురు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన కోర్టు తీర్పు వెలువడేంత వరకూ ఫలితాలు వెల్లడించరాదని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. దీంతో సింగరేణి ఆన్సర్ కీ విడుదల చేయలేదు. తాజాగా మరో మారు ఈ పిటిషన్‌పై విచారించిన కోర్టు పరీక్షను సవ్యంగా నిర్వహించలేదని భావించింది. దీంతో పరీక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. అన్ని జాగ్రత్తలతో, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మరోమారు నిర్వహించాలని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పరీక్ష అనంతరం ప్రాథమిక ఆన్సర్ కీపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది ఆన్సర్ కీ విడుదల చేయాలని జస్టిస్ మాధవీదేవి పేర్కొన్నారు. అలాగే స్టే ఎత్తివేయాలంటూ దాఖలైన మధ్యంతర అప్లికేషన్లను సైతం న్యాయస్ధానం కొట్టివేసింది.
కాగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే టీఎస్పీయస్సీ పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం లేపింది. ఈ క్రమంలో సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 రాత పరీక్ష కూడా రద్దుకావడంతో నిరుద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.