FASTag: పండక్కి ఊరెళ్తున్నారా? వాహనాల ఫాస్టాగ్ చెక్ చేసుకోండి.. లేదంటే తిప్పలు తప్పవు
సంక్రాంతి పండుగ అంటే మూడు రోజుల ముచ్చటైన పండుగ. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ పండుగను అంబరాన్నంటేలా నిర్వహిస్తారు. సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెలకు బాట పడుతుంటారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వేలాది కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలకు వెళుతుంటాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు జర జాగ్రత్త..! హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే..
నల్లగొండ, జనవరి 11: సంక్రాంతి పండుగ అంటే మూడు రోజుల ముచ్చటైన పండుగ. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ పండుగను అంబరాన్నంటేలా నిర్వహిస్తారు. సంక్రాంతికి పట్టణాల నుంచి పల్లెలకు బాట పడుతుంటారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి వేలాది కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలకు వెళుతుంటాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు జర జాగ్రత్త..! హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు ఇది చెక్ చేసుకోండి..
సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకొనేందుకు ఇప్పటికే పట్టణాల నుంచి తమ స్వగ్రామాలకు బాటపట్టారు. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సిద్ధమవుతారు. హైదరాబాద్ నుంచి పోరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు లక్షలాది వాహనాలు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి మీదుగా వెళుతుంటాయి. తమ వాహనం ఫాస్టాగ్‌ను సరిచూసుకోకుంటే ఇబ్బంది పడే ప్రమాదముంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి మొత్తం 273 కిలోమీటర్లు ఉండగా.. తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పంతంగి, కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. గత ఏడాది సంక్రాంతి పండుగకు పంతంగి టోల్‌ప్లాజా మీదుగా రోజుకు 60 వేల వాహనాలు వెళ్లగా, ఈసారి 65-70 వేల వరకు రాకపోకలు సాగిస్తాయని టోల్‌ప్లాజా నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం…
వాహనాలకు ఏర్పాటు చేసుకున్న ఫాస్టాగ్ సంబంధించిన అకౌంట్‌లో సరిపడా నగదు లేకపోతే బ్లాక్ లిస్ట్ లో పడిపోతుంది. నగదు అయిపోతే వెంటనే రీఛార్జి చేసుకుంటే సమస్యలు ఉండవు. తీరా టోల్‌ప్లాజా దగ్గరికి వచ్చాక రీఛార్జి చేసుకుంటే యాక్టివేట్ కావడానికి 15 నిమిషాల వరకు సమయం పడుతుంది. నెట్‌వర్క్ సమస్య ఉంటే ఇంకా ఆలస్యమవుతుంది. వాహనానికి ఉండే ఫాస్టాగ్ సక్రమంగా ఉంటే అర నిమిషంలోపే టోల్‌ప్లాజాను దాటవచ్చు.
ఫాస్టాగ్‌ను కేవైసీ చేయించడం..
ఫాస్టాగ్‌ను కేవైసీ చేయించకపోతే కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. షోరూమ్‌లో కారు కొనుగోలు చేసినప్పుడు ఛాసిస్ నంబరుపై ఫాస్టాగ్‌ను ఇస్తారు. వాహనం రిజిస్ట్రేషన్ అయ్యాక ఫాస్టాగ్‌ను ఒకసారి అప్‌డేట్ చేసుకోవాలి. ఫాస్టాగ్ తీసుకొని ఎక్కువకాలం గడిస్తే కేవైసీ అడుగుతుంది. ఆధార్, పాన్, ఆర్‌సీతో అప్‌డేట్ చేసుకోవచ్చు. లేకపోతే బ్లాక్‌లిస్టులో పడే ప్రమాదం ఉంది.
ఫాస్టాగ్ అప్ డేట్ చేసుకోవడం…
ఫాస్టాగ్ కంపెనీలు కూడా మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బ్లాక్‌లిస్టులో పెడతాయి. ఒకవేళ అప్పటికప్పుడు గుర్తించినా ఫాస్టాగ్ అప్‌డేట్ కావడానికి 24 గంటలు పడుతుందని చెబుతున్నారు.
అత్యవసర సమయాల్లో 1033 నంబర్…
సంక్రాంతి పండుగకు వెళ్లే వాహనదారులు అత్యవసర సమయాల్లో 1033 నంబరుకు ప్రయాణికులు ఫోన్ చేయాలి. ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్సు, యాక్సిడెంట్లు జరిగి దెబ్బతిన్న వాహనాలను పక్కకు తరలించేందుకు క్రేన్‌ను ఏర్పాటు చేసినట్లు జీఎమ్మార్ సంస్థ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.