Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే జరభద్రం! ఇలా చేశారో దొంగలు మీ ఇంటిని దోచేస్తారు..

సంక్రాంతి పండుగకు పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. పండగకు ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ నర్సింహా కొత్తపల్లి తాజాగా సూచనలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ సీజన్‌లో దొంగల చోరీల నియంత్రణకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు..

Telangana: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే జరభద్రం! ఇలా చేశారో దొంగలు మీ ఇంటిని దోచేస్తారు..
Thieves
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 09, 2024 | 9:17 PM

సైబరాబాద్‌, జనవరి 9: సంక్రాంతి పండుగకు పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. పండగకు ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ నర్సింహా కొత్తపల్లి తాజాగా సూచనలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ సీజన్‌లో దొంగల చోరీల నియంత్రణకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామని, సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసులు ఈ కింది సూచనలు జారీ చేశారు. అవేంటంటే..

సైబరాబాద్ కమీషనరేట్లో పోలీసులు నిఘానేత్రం కింద ఇప్పటికే సీసీటీవీలను పోలీసులు ఏర్పాటు చేశారు. అలాగే ప్రజలు కూడా తమ కాలనీలు, ఇళ్లు, షాపింగ్‌ మాల్‌లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. ఎక్కువ రోజులు ఊర్లకు వెళ్లేవారు తమ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళకు తమ ఇంటిని గమనిస్తు ఉండమని చెప్పాలి. విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టకూడదు. ద్విచక్రవాహనాలు, కారులను రోడ్లపై పార్క్‌ చేయకూడదు. తమ ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి. బీరువా తాళాలను తమతోపాటే తీసుకెళ్లాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్‌ కర్టెన్‌ వేసుకోవాలి. అలాగే ఇంటి మొత్తం చీకటిగా ఉంచకుండా ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి. ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్, పాలప్యాకెట్లు అధిక సంఖ్యలో జమ అయితే.. ఆ ఇంట్లో ఎవరూ లేరనే సంకేతం దొంగలకు సులువుగా అందుతుంది. కాబట్టి అవి ఎక్కువ మొత్తంలో జమకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పని మనుషులు ఉంటే రోజూ చెత్త ఊడ్చమని చెప్పాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోకూడదు. ఇంటి పరిసరాల్లో పార్క్‌ చేసిన వాహనాలకు హాండిల్‌ లాక్‌తో పాటు వీల్‌ లాక్‌ వేయాలి. తమ ఇళ్లకు వాచ్‌మెన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో బంగారు నగలు, నగదు వంటి విలువైన వస్తువులు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం మంచిది. లేదంతే తమతోపాటే వాటిని తీసుకెళ్లాలి.

ఇళ్లకు టైమర్‌తో కూడిన లైట్లను అమర్చుకోవాలి. బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేసేవారు, వాటిని ఎల్లప్పుడూ తమతో పాటే ఉంచుకోవాలి. ఇంటి తలుపుకు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. అలాగే ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకుంటూ ఉండాలి. డీవీఆర్‌ కనపడకుండా రహస్య ప్రదేశంలో ఉంచుకోవాలి. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా మొబైల్‌ ఫోన్‌కు ఇంటర్నెట్ అనుసంధానం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఎక్కడి నుంచైనా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది. సొంత ఇల్లు ఉన్నవారు ఇంటి ప్రధాన ద్వారానికి గ్రిల్స్ అమర్చుకోవడం ద్వారా రెండంచెల భద్రత ఉంటుంది. ఇంటి బయట మోషన్ సెన్సర్ లైట్లను అమర్చుకోవాలి. సెన్సార్ పరిసరాల్లో ఏదైనా కదలిక గుర్తించగానే ఈ లైట్ ఆటోమేటిగ్గా వెలుగుతుంది. అలాగే కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలి.ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. తద్వారా పోలీసులు ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తారు. నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను, వాచ్‌మెన్‌ను నియమించుకోవాలి. స్థానిక పోలీసు స్టేషన్‌ నెంబర్‌ దగ్గరుంచుకోవడం మంచిది. తాము ఊరెళ్తున్నట్లు సోషల్ మిడియాలోపోస్టులు పెట్టకపోవడం మంచిది. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే100 డయల్‌ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్‌ నెంబర్‌ 9490617444 కు సమాచారం అందించాలి. ఈ సూచనలు అందరూ దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.