Medak: ఆత్మరక్షణకు వాడాల్సిన తుపాకీతో.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న పోలీసులు!
రక్షణ కోసం ఇచ్చిన తుపాకీ ఇప్పుడు ప్రాణాలను తీసే ఆయుధంగా మారుతోంది. ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు, అప్పుల బారం, ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ వంటి కారణాలతో పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తున్నాయి ... .. ..

తమ ఆత్మరక్షణ కోసం వాడాల్సిన తుపాకీని.. ప్రాణాలు తీసుకునేందుకు కొందరు పోలీసులు ఉపయోగిస్తున్నారు. రక్షణ కోసం ఇస్తున్న రివ్వాలర్లను తమపైనే ఎక్కుపెట్టుకుంటున్నారు. బలన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒత్తిడి వల్ల, పై అధికారుల వేధింపుల వల్ల.. మరికొంతమంది ఆన్ లైన్ గేమ్స్, లోన్ యాప్స్, వలలో చిక్కి తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన ఘటనలు చూస్తే.. గజ్వేల్ నియోజకవర్గంలోని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో ఇద్దరు యువ ఎస్ఐలు ఈ తరహాలో ప్రాణాలు తీసుకున్నారు. ఇక దుబ్బాక ఎస్సైగా పనిచేసిన చిట్టిబాబు తన భార్యను కాల్చి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట కలెక్టరు గన్ మెన్ పనిచేసే వ్యక్తి.. భార్యాపిల్లలను చంపి, తానూ మరణించాడు… తాజాగా కానిస్టేబుల్ సందీప్ కుమార్ కూడా పోలీస్ స్టేషన్లో ఉన్న పిస్టల్ తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసు ఉన్నతాధికారులు వేధిస్తున్నారంటూ కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసే రామకృష్ణారెడ్డి తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని చనిపోయారు. 2016, ఆగస్టు నెలలో జరిగిందీ ఘటన. పోలీసు ఉన్నతాధికారులు వేధిస్తున్నారంటూ సూసైడ్ లెటర్ రాసి మరీ ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కొందరు పోలీసు అధికారులపై వేటు కూడా పడింది. రామకృష్ణారెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లాలోని మఠంపల్లి మండలంలోని బక్కమంతులగూడెం గ్రామం. ఇక రామక్రిష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ స్థానంలో ప్రభాకర్ రెడ్డి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. గతం లోరామకృష్ణారెడ్డి ఉంటున్న ఇంట్లోనే ఉండేవారు. ఆయన సొంతూరు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామం. 2017, జూన్ నెలలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీసు రివాల్వరుతో కాల్చుకొని, ప్రాణాలు తీసుకున్నారు. తనకు భయంగా ఉందంటూ తోటి బ్యాచ్ మేట్‌కు చెప్పిన కొద్ది క్షణాల్లోనే ఆత్మహత్య చేసుకున్నారు.
ఇక కడప జిల్లాకు చెందిన జి.చిట్టిబాబు దుబ్బాకలో ఎస్ఐగా పనిచేసేవారు. ఆయన తన భార్య సరోజతో కలిసి స్థానికంగానే పోలీసు క్వార్టర్సులో నివాసముండేవారు. ఆయనపై శాఖాపరమైన విచారణతో పాటు ఏసీబీ అధికారుల విచారణ నడిచింది. అదే సమయంలో ఆయన తన భార్యను రివాల్వరుతో కాల్చాడు. తనూ కాల్చుకున్నాడు. సరోజ అక్కడికక్కడే మరణించారు. చిట్టిబాబును ఆస్పత్రిలో చేర్పించగా.. అప్పటికే పరిస్థితి విషమించి ఊపిరొదిలారు. ఇక సిద్దిపేట జిల్లా రామునిపట్లకు చెందిన నరేష్ సిద్దిపేట కలెక్టరు వద్ద గన్ మెన్‌గా పనిచేసేవారు. ఆయన ఆన్ లైన్ బెట్టింగులు వేసేవారు. అలా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు…అప్పుల పాలయ్యారు. స్కూలుకు వెళ్లిన తన కూతురు హిమశ్రీ, కొడుకు రేవంత్‌ను ఇంటికి తీసుకొచ్చాడు. తన వద్ద ఉన్న గన్‌తో భార్య చైతన్యతో పాటు పిల్లలిద్దరినీ కాల్చారు. ఆపై తానూ అదే గన్‌తో కాల్చుకొని తనువు చాలించాడు.
ఇక తాజాగా సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల కేంద్రానికి చెందిన కొటారి సందీప్ కుమార్ ఏడాది క్రితమే పోలీసు కొలువు దక్కించుకున్నాడు…తమకు ఒక భరోసా దక్కిందని అతడి కుటుంబసభ్యులు భావించారు. కానీ అప్పుల భారం పెరగడం, ఆన్ లైన్ బెట్టింగుల్లో తీవ్రంగా నష్టపోవడంతో సందీప్ ఆత్మహత్మ చేసుకున్నారు. సంగారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో ఉన్న పిస్టల్ తీసుకెళ్లారు. మహబూబ్ సాగర్ చెరువు కట్ట మీదకు వెళ్లి ప్రాణాలు తీసుకున్నారు. ఇలా పోలీసులు గన్‌తో కాల్చుకొని చనిపోవడం పోలీస్ డిపార్మెంట్ తో పాటు సాధారణ జనాల్లో కూడా పెద్ద చర్చ నడుస్తుంది.




