AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీటి పారుదల రంగానికి పూర్వ వైభవం.. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాంః భట్టి విక్రమార్క

అన్నదాతలు ఉంటేనే అందరం ఉంటామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వారిని అదుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ సాగు కోసం నీటి పారుదలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

నీటి పారుదల రంగానికి పూర్వ వైభవం.. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాంః భట్టి విక్రమార్క
Vikramarka
Balaraju Goud
|

Updated on: Jul 25, 2024 | 1:35 PM

Share

అన్నదాతలు ఉంటేనే అందరం ఉంటామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వారిని అదుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వ్యవసాయ సాగు కోసం నీటి పారుదలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 34 భారీ, 39 మధ్యతరహా మొత్తం 73 నీటి పారుదల ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందన్నారు. వాటిలో 42 ప్రాజెక్టులను (10 భారీ, 32 మధ్యతరహా) పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం 24 భారీ, 7 మధ్యతరహా మొత్తం 31 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు.

గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, డిజైన్లలో లోపాలు, నాణ్యతా రహితంగా చేసిన నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేశాయన్నారు. ఈ ప్రాజెక్టు గురించి చేసిన ఆర్బాట ప్రచారంతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, కొద్ది కాలంలోనే ఈ ప్రాజెక్టు డొల్లతనం బయటపడిందని ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్రం అంతా దిగ్భ్ర్భాంతికి గురయ్యిందన్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను గుర్తించి తగిన చర్యలు సూచించేందుకు విచారణ కమిటీని నియమించామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చుపెట్టిన వేల కోట్ల ప్రజా ధనం వృధా అవ్వకుండా ప్రాజెక్టును కాపాడడానికి National Dam Safety Authority వారి సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం చివరి దశ నిర్మాణలలో ఉన్న చాలా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది. దీనివల్ల, ఎంతో ప్రజాధనం ఖర్చు అయ్యి, ప్రజా అవసరాలను తీర్చడానికి ఇవి వినియోగంలోకి రాలేదని భట్టి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులను, ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించామని తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న భారీ, మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత పదేళ్లలో జరగకపోవడం వల్ల ఆ ప్రాజెక్టుల సామర్ధ్యానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరుగలేదు. అవి అలాగే వదిలేస్తే మన జాతీయ సంపదగా భావించే ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మత్తులను తగిన సమయంలో చేపట్టడానికి నిశ్చయించామని రాష్ట్ర మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..