AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Budget: కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే లక్ష్యంః భట్టి విక్రమార్క

మహిళలకు మరో గుడ్‌న్యూస్ ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. గ్రామీణ మహిళాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి పథకం తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు సాధించిన ప్రగతే, ఆ సమాజ ప్రగతికి కొలమానంగా నేను భావిస్తాను అన్న బీఆర్ అంబేద్కర్ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు.

Telangana Budget: కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయడమే లక్ష్యంః భట్టి విక్రమార్క
Bhatti Vikramarka On Women Welfare
Balaraju Goud
|

Updated on: Jul 25, 2024 | 1:17 PM

Share

మహిళలకు మరో గుడ్‌న్యూస్ ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. గ్రామీణ మహిళాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి పథకం తీసుకువస్తున్నట్లు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు సాధించిన ప్రగతే, ఆ సమాజ ప్రగతికి కొలమానంగా నేను భావిస్తాను అన్న బీఆర్ అంబేద్కర్ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు.

తెలంగాణా ప్రభుత్వం 63 లక్షల మహిళలను విజయవంతమైన వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే ధ్యేయంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసిందన్నారు. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఈ లక్ష్యం సాధిస్తామన్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్, మార్కెటింగ్ లలో మెలకువలు పెంపొందించే విధంగా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు, ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్నతరహా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తామన్నారు భట్టి విక్రమార్క. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా 5,000 గ్రామీణ సంఘాలకు, ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్ది చేకూరే విధంగా కార్యాచరణ చేపట్టి, రాబోయే 5 సంవత్సరాల్లో 25,000 సంస్థలకు విస్తరింపచేయడానికి కృషి చేస్తామన్నారు.

దీంతోపాటు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా, రుణ బీమా పథకాన్ని ఈ సంవత్సరం మార్చి నెలలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ఈ పథకం క్రింద సభ్యురాలు మరణించినపుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతుందన్నారు. దీనిని అమలు కోసం 50.41 కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు.

స్వయం సహాయక సంఘాలు

ఒకప్పుడు దేశంలో అగ్రగామిగా నిలచిన మన మహిళా స్వయం సహాయక సంఘాలు కొన్నేళ్లుగా గత ప్రభుత్వ అలసత్వంతో, నిధుల లేమితో కుంటుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థిక మంత్రి. పేద, మధ్యతరగతి మహిళాభ్యున్నతికి ఆర్థిక స్వాలంబనకు సహాయ సంఘాలు ఎంతో ఊతమిస్తాయన్నారు. వీటి పునరుద్ధరణకు ప్రతి సంవత్సరానికి కనీసం 20 వేల కోట్లకు తగ్గకుండా, వచ్చే ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ నిధులు మైక్రో, స్మాల్ ఇండిస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సహాయపడి మహిళలు పారిశ్రామికవేత్తల స్థాయికి ఎదిగేందుకు అవకాశం కల్పిస్తాయన్నారు.

ఇందిరా జీవిత బీమా పథకం

ఈ పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు మంత్రి భట్టి. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 10 లక్షల జీవిత బీమా చేయడం జరిగిందన్నారు.

అలాగే స్కూల్ యూనిఫాంలను కుట్టే పనిని స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు అప్పజెప్పాలని పాఠశాల విద్యా శాఖను, సంక్షేమ శాఖను, జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందిన అభ్యర్థనల మేరకు స్కూల్ యూనిఫాంల కుట్టు చార్జీలను జతకు 50 రూపాయల నుండి 75 రూపాయలకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. దీనివల్ల, 29,680 మహిళా సభ్యులకు సుమారు 50 కోట్ల రూపాయల లబ్ది చేకూరుతుందని మంత్రి భట్టి అంచనా వేశారు.

స్వయం సహాయక బృందాలలోని మహిళా సభ్యులు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి గాను మాదాపూర్ లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దీని ఏర్పాటుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) కు 3.20 ఎకరాల భూమిలో గల 106 దుకాణాలతో కూడిన నైట్ బజారు కాంప్లెక్స్ ను అప్పగించామన్నారు. మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించినప్పుడే వారు నిజమైన సమానతను సాధిస్తారు. పైన పేర్కొన్న పథకాలన్నీ కూడా ఈ దిశగా మహిళలను బలోపేతం చేసేవే. కాంగ్రస్ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కంకణం కట్టుకుందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్ లో 29,816 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..