AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ధోని వారసుడు దొరికేశాడోచ్.. టీమిండియా నెక్స్ట్ ఫినిషర్ ఇతడే.. ఎంట్రీ ఎప్పుడంటే?

Team India: ప్రస్తుతం టీమ్ ఇండియాలో వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఒక పక్కా ఫినిషర్ అవసరం ఉంది. ఐపీఎల్ 2026లో చెన్నై తరపున కార్తీక్ గనుక మెరిస్తే, త్వరలోనే భారత జట్టులో నీలి రంగు జెర్సీలో చూడటం ఖాయమని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు.

Team India: ధోని వారసుడు దొరికేశాడోచ్.. టీమిండియా నెక్స్ట్ ఫినిషర్ ఇతడే.. ఎంట్రీ ఎప్పుడంటే?
Kartik Sharma Csk Ipl 2026
Venkata Chari
|

Updated on: Dec 19, 2025 | 2:04 PM

Share

భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం ఎవరికైనా ఒక పెద్ద సవాలు. ఫినిషర్‌గా, మెరుపు వేగంతో వికెట్ కీపింగ్ చేస్తూ మ్యాచ్‌లను గెలిపించే ధోనీ లాంటి ఆటగాడి కోసం భారత్ ఎప్పటి నుంచో వెతుకుతోంది. అయితే, తాజాగా ఐపీఎల్ 2026 వేలంలో జరిగిన ఒక సంఘటన చూస్తుంటే.. భారత్‌కు ఆ ‘నెక్స్ట్ ధోనీ’ దొరికేశాడన్న చర్చ మొదలైంది. ఆ సంచలన ఆటగాడే కార్తీక్ శర్మ (Kartik Sharma).

ఐపీఎల్ వేలంలో ఊహించని ధర.. రికార్డుల వేట!

అబుదాబిలో జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ శర్మ హాట్ టాపిక్ అయ్యాడు. కేవలం రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన ఇతని కోసం ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఏకంగా రూ. 14.20 కోట్లు వెచ్చించి ఇతనిని దక్కించుకుంది.

అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్: ఐపీఎల్ చరిత్రలో ప్రశాంత్ వీర్‌తో కలిసి అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా) కార్తీక్ శర్మ రికార్డు సృష్టించాడు.

ఇవి కూడా చదవండి

ధోనీ వారసుడిగా: చెన్నై జట్టు ధోనీ వారసుడి కోసం చూస్తున్న తరుణంలో, కార్తీక్ శర్మను ఎంచుకోవడం వెనుక ధోనీ హస్తం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

కార్తీక్ శర్మ ప్రయాణం: కన్నీళ్లు తెప్పించే కష్టాలు

కార్తీక్ శర్మ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కార్తీక్ కోసం అతని తల్లిదండ్రులు ఆస్తులను కూడా విక్రయించారు. కార్తీక్ శిక్షణ కోసం అతని తండ్రి వ్యవసాయ భూమిని అమ్మేశారు. అతని తల్లి తన బంగారు నగలను సైతం తాకట్టు పెట్టి కుమారుడి క్రీడా కలలకు మద్దతుగా నిలిచారు. ఒకానొక దశలో దేశవాళీ టోర్నమెంట్‌ల సమయంలో డబ్బులు లేక కార్తీక్ మరియు అతని తండ్రి నైట్ షెల్టర్లలో నిద్రించిన రోజులు కూడా ఉన్నాయి.

ఆట తీరు – ఎందుకు ధోనీతో పోలిక?

ధోనీకి ఉన్న కొన్ని లక్షణాలు కార్తీక్ శర్మలో ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దేశవాళీ క్రికెట్‌లో (Syed Mushtaq Ali Trophy) 164కు పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు. అలాగే, వికెట్ల వెనుక చురుకుగా ఉంటూనే, బ్యాటింగ్‌లో ఒత్తిడిని దరిచేరనీయకుండా మ్యాచ్‌ను ముగించే సత్తా ఇతని సొంతం. క్లీన్ హిట్టింగ్‌తో బంతిని మైదానం వెలుపలికి పంపడంలో ఇతడు దిట్ట.

టీమ్ ఇండియాలో ఎంట్రీ ఎప్పుడు?

ప్రస్తుతం టీమ్ ఇండియాలో వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఒక పక్కా ఫినిషర్ అవసరం ఉంది. ఐపీఎల్ 2026లో చెన్నై తరపున కార్తీక్ గనుక మెరిస్తే, త్వరలోనే భారత జట్టులో నీలి రంగు జెర్సీలో చూడటం ఖాయమని క్రికెట్ పండితులు జోస్యం చెబుతున్నారు.

కష్టాల కడలిని దాటి వచ్చిన ఈ యువకెరటం, ఐపీఎల్ వేదికగా తన సత్తా చాటి భారత క్రికెట్‌లో ధోనీ వారసుడిగా ఎదుగుతాడని కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..