తల్లి గర్భంలోనే ప్రాణాంతక వ్యాధి.. 12 ఏళ్లకు మించి బతకడన్నారు.. కట్ చేస్తే.. వేలంలో రూ. 25 కోట్లతో
Cameron Green Life Journey: "శారీరక వైకల్యం లేదా అనారోగ్యం మీ కలలకు అడ్డంకి కాకూడదు" అని కామెరూన్ గ్రీన్ నిరూపించాడు. 12 ఏళ్లకే ప్రాణాలు పోతాయన్న చోట.. నేడు ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా ఎదగడం అతని గొప్పతనానికి నిదర్శనం.

Cameron Green Life Journey: ఐపీఎల్ 2026 మినీ వేలంలో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు కామెరూన్ గ్రీన్. అబుదాబిలో జరిగిన ఈ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఏకంగా రూ. 25.20 కోట్లు వెచ్చించి గ్రీన్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా అతను సరికొత్త రికార్డును లిఖించాడు. అయితే, ఈ కోట్ల రూపాయల వెనుక గ్రీన్ పడ్డ కష్టం, అతను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
1. పుట్టుకతోనే కిడ్నీ వ్యాధి: కామెరూన్ గ్రీన్ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (Chronic Kidney Disease – CKD) తో బాధపడుతున్నారు. తల్లి గర్భంలో ఉండగానే (19 వారాల వయసులో) స్కానింగ్‌లో ఈ సమస్య బయటపడింది. గ్రీన్ కిడ్నీలు కేవలం 60 శాతం మాత్రమే పనిచేస్తాయి. ప్రస్తుతానికి అతను ఈ వ్యాధిలో ‘స్టేజ్-2’లో ఉన్నాడు.
2. వైద్యుల షాకింగ్ అంచనా: గ్రీన్ పుట్టిన సమయంలో వైద్యులు అతని తల్లిదండ్రులకు ఒక భయంకరమైన మాట చెప్పారు. అతను 12 ఏళ్లకు మించి బతకడం కష్టం అని అంచనా వేశారు. కానీ, గ్రీన్ అసాధారణమైన పట్టుదలతో ఆ అంచనాలను తలకిందులు చేశాడు. కఠినమైన ఆహార నియమాలు, తక్కువ ప్రోటీన్, ఉప్పుతో కూడిన డైట్‌ను పాటిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నాడు.
3. ఐపీఎల్ వేలంలో రికార్డుల వేట: ఐపీఎల్ 2026 వేలంలో గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు కేకేఆర్ రూ. 25.20 కోట్లకు అతన్ని దక్కించుకుంది. గ్రీన్ గతంలో తన తోటి ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ (రూ. 24.75 కోట్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం వేలంలో ఎంత పలికినా గ్రీన్‌కు రూ. 18 కోట్లు మాత్రమే దక్కుతాయి, మిగిలిన మొత్తం బీసీసీఐ సంక్షేమ నిధికి వెళ్తుంది.
4. స్ఫూర్తిదాయక ప్రయాణం: క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వ్యక్తికి కండరాల తిమ్మిర్లు (Cramps) రావడం సహజం. గ్రీన్ తన కెరీర్‌లో అనేకసార్లు ఈ సమస్యను ఎదుర్కొన్నప్పటికీ, ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియా జట్టులో కీలకమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.
“శారీరక వైకల్యం లేదా అనారోగ్యం మీ కలలకు అడ్డంకి కాకూడదు” అని కామెరూన్ గ్రీన్ నిరూపించాడు. 12 ఏళ్లకే ప్రాణాలు పోతాయన్న చోట.. నేడు ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా ఎదగడం అతని గొప్పతనానికి నిదర్శనం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




