మహేంద్ర సింగ్ ధోని
మహేంద్ర సింగ్ ధోని.. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ అందించిన ఏకైక కెప్టెన్. మహీని ముద్దుగా ఫ్యాన్స్ మిస్టర్ కూల్ అని పిలుస్తారు. ధోని బ్యాటింగ్ కంటే.. అతడు చేసే స్టంపింగ్‌కే ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పొచ్చు. స్టంప్స్ వెనుక ధోని ఉన్నాడంటే.. ప్రత్యర్ధి బ్యాటర్లలో గుండెల్లో గుబులు పుట్టాల్సిందే. అలాగే మిస్టర్ కూల్ వికెట్ల వెనుక తీసుకునే నిర్ణయాలు.. ప్రత్యర్ధి పరాభవాన్ని శాసిస్తాయి. ఇంకా చెప్పాలంటే.. డీఆర్ఎస్.. డెసిషన్ రివ్యూ సిస్టమ్‌ను ఏకంగా ధోని రివ్యూ సిస్టంగా లిఖించుకున్నాడు ఈ మిస్టర్ కూల్. అంపైరలైనా అప్పుడప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు గానీ.. ధోని నిర్ణయాలు మాత్రం ఎప్పుడూ పర్ఫెక్టే. 2007లో సారధిగా టీమిండియా పగ్గాలు చేపట్టిన ధోని.. క్రికెట్ చరిత్రలో అద్భుతమైన కెప్టెన్లలో ఒకరిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇదిలా ఉంటే.. 2010, జూలై 4న ధోని, సాక్షి సింగ్‌ల వివాహం డెహ్రాడున్‌లో జరిగింది. వీరికి జీవా ధోని కుమార్తె.
డిసెంబర్ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. ఆ తర్వాత 2005లో శ్రీలంకతో తన తొలి టెస్ట్ ఆడాడు. 2007లో రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ అనంతరం.. టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు ధోని. ఆ సమయంలో అతడు తీసుకున్న పలు నిర్ణయాలు సంచలనంగా కూడా మారాయి. కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న వెంటనే.. మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లోనే శ్రీలంక, న్యూజిలాండ్‌లపై టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. అలాగే ధోని సారధ్యంలోనే టీమిండియా 2007 ఐసీసీ ప్రపంచ టీ20 ఛాంపియన్‌గా నిలిచింది. అతడి నేతృత్వంలో టీమిండియా 2007-08 సీ.బీ. సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.
2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోని 91 పరుగులతో అజేయంగా నిలవడమే కాదు.. ఆఖర్లో అతడు కొట్టిన సిక్స్.. ఇప్పటికీ యావత్ భారతదేశానికి గుర్తిండిపోతుంది. 2013 జూన్‌లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించడంతో.. ధోనీ మూడు ఐసీసీ పరిమిత ఓవర్ల ట్రోఫీలు(ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ ట్వీంటీ 20) గెలుచుకున్న మొదటి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. 2008లో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్న ధోని.. న్యూజిలాండ్, వెస్టిండీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2008, 2010, 2013లో టీమిండియాకు విజయాలను అందించాడు. 2009లో ధోనీ మొదటిసారిగా భారత్‌ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి తీసుకెళ్లాడు. 2013లో అతడి సారథ్యంలోనే టీమిండియా.. సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత ఒక టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో, ధోని సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ 2010, 2014 సీజన్లలో కప్పు కొట్టింది. కాగా, 2014 డిసెంబర్ 30న ధోని టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. ఆగష్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు ధోని.