Telangana: రైస్ మిల్ తరుగు మోసాలపై రైతన్న నిరసన.. ఎర్రని ఎండలో రోడ్డుపై పడుకుని..

అసలే.. అకాల వర్షాలు అన్నదాతను ఆగమాగం చేశాయి. అధికారుల కొర్రీలతోనూ అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఇప్పుడు.. రైస్‌ మిల్లర్స్‌ తరుగు దోపిడీపై రోడ్డెక్కారు మెదక్‌ జిల్లా రైతులు..

Telangana: రైస్ మిల్ తరుగు మోసాలపై  రైతన్న నిరసన.. ఎర్రని ఎండలో రోడ్డుపై పడుకుని..
Farmers Protest
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 29, 2023 | 8:01 AM

తెలంగాణలో రైతులకు కష్టాలు ఏ మాత్రం తప్పటం లేదు. అకాల వర్షాలతో ఆగమైన రైతన్నను మరికొన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసనలు కొనసాగుతుండగానే.. మరోవైపు మిల్లర్ల తీరుతోనూ రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు రైతులు. రైస్ మిల్ యజమానులు తరుగు పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ.. రోడ్డుపై బైఠాయించారు.

రైస్ మిల్లర్స్‌ తీరును వ్యతిరేకిస్తూ ఎర్రని ఎండలో రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు.  రైస్ మిల్లర్స్‌ దోపిడీ నశించాలంటూ నినదించారు అన్నదాతలు. రైస్‌ మిల్లర్స్‌ ఏ విధంగా తరుగు దోపిడీ చేస్తున్నారో రశీదులతో వివరించారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి రైస్ మిల్లర్స్‌ మోసాల నుండి రైతులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. ఇక.. రైతుల ధర్నాతో మెదక్- హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

మరోవైపు రైతుల ధర్నాకు మద్దతు తెలిపారు టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్. అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆంజనేయులుగౌడ్‌.. రైస్‌ మిల్లర్స్‌ దోపిడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాకు 18 కిలోలు తరుగు తీయడమేంటని ప్రశ్నించారు. ఇలాంటి రూల్‌ ఇంకెక్కడైనా ఉందా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం, మంత్రులు, అధికారులు.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా  మాట్లాడుతున్నారన్నారు. 18 కిలోలు తరుగు తీసిన రైస్‌ మిల్లులను సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్‌ నేత ఆంజనేయులుగౌడ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..