సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే ట్విస్టులు.. విడిపోయిన ఆ నలుగురిని ఫేస్‌బుక్ దగ్గర చేసింది.. ఈ స్టోరీ మీకోసమే

విధి ఆడిన వింత నాటకంలో విడిపోయారు. తల్లిదండ్రులను‌ కోల్పోయి చెట్టుకొకరు పుట్టకొకరుగా చేరారు. మూడు దశాబ్దాల తరువాత అదే విధి ఆడిన నాటకంలో..

సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే ట్విస్టులు.. విడిపోయిన ఆ నలుగురిని ఫేస్‌బుక్ దగ్గర చేసింది.. ఈ స్టోరీ మీకోసమే
Facebook
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 03, 2021 | 7:31 PM

విధి ఆడిన వింత నాటకంలో విడిపోయారు. తల్లిదండ్రులను‌ కోల్పోయి చెట్టుకొకరు పుట్టకొకరుగా చేరారు. మూడు దశాబ్దాల తరువాత అదే విధి ఆడిన నాటకంలో అంతే వింతగా దగ్గరయ్యారు. ముప్పై ఏళ్లుగా అనాథగా గడిపిన అన్న.. అందరు ఉన్నా ఒంటరిగా పెరిగిన చెల్లి.. మా తమ్ముడు చెల్లిని జీవితంలో ఒక్కసారైనా చూడలన్నా ఆశతో బతికిన మరో అన్న ఇలా అంతా ఒక్కటయ్యారు. వీరందరిని కలిపింది ఎవరో కాదు ఫేస్‌బుక్. అవును ఆ ఫేస్‌బుక్ కలిపిన బంధమే ఈ కుటుంబం. భార్య పిల్లలకు ఇన్నాళ్లు తను అనాథను అని చెప్పుకున్న భర్త సడన్‌గా తనకు ఓ కుటుంబం ఉందని చెప్పడంతో ఆ కుటుంబం ఆశ్చర్యానికి లోనవుతోంది. మా అన్నయ్యలు తిరిగొస్తున్నారని తెలియగానే ఆనందంతో‌ ఉబ్బితబ్బివుతోంది ముగ్గురు అన్నదమ్ముల ముద్దుల చెల్లి. ఫేస్‌బుక్ కలిపిన ఆ కుటుంబాన్ని ఒక్కసారి మనమూ పలకరించి వద్దాం పదండి‌.

Facebook

ఫేస్‌బుక్ కలిపింది అందరిని.. అవును ఇక్కడ కనిపిస్తున్న అందరిని ఫేస్‌బుకే ఒక్కటి చేసింది. అలా ఇలా కాదు ముప్పై ఏళ్ల క్రితం దూరమైన ఈ కుటుంబాన్ని.. ఆత్మీయుల అనుబంధాలను ఒక్కటి చేసింది. ముగ్గురు అన్నదమ్ములు.. వారికో ముద్దుల చెల్లి. సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం ఇదే ఊరిలో ఆటాపాటల మధ్య హాయిగా గడిపింది ఈ కుటుంబం. అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆ కుటుంబం అనాథగా మారింది‌. కుటుంబ సభ్యులు నలుగురు పిల్లలను తలా ఒకరు తీసుకెళ్లిపోయారు. కానీ ఆ తర్వాత బంధువులు వేధింపులకు గురిచేయడంతో ఆ బాధ భరించలేక నలుగురూ ఇంట్లోంచి తలోదిక్కున పారిపోయారు. సీన్ కట్ చేస్తే ఇదిగో ఇలా ముప్పై ఏళ్ల తరువాత ముచ్చటగా అంతా ఒక్కటయ్యారు.

30 ఏళ్ల తరువాత…

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నంనూర్‌కు చెందిన శంకరమ్మ, శంకరయ్యల సంతానం గురువయ్య , లక్ష్మణ్‌, సతీశ్‌, రమాదేవి. 1991లో అనారోగ్యంతో భార్యభర్తలు శంకరయ్య, శంకరమ్మలు చనిపోయారు. ఒక్కసారిగా ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. గురువయ్యను లక్షేట్టిపేటలోని బాబాయ్ వరుస అయ్యే వ్యక్తి దత్తత తీసుకున్నాడు‌. చిన్నోడు సతీశ్‌‌ను జన్నారంకు చెందిన మామ వరుస అయ్యే సాంబరి అంజన్న దత్తత తీసుకున్నాడు. మిగిలిన ఇద్దరు ఇంటి దగ్గరే ఉండిపోయారు. కానీ గురువయ్యను చేరదీసిన కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురి చేయడంతో గురువయ్య పారిపోయాడు. లక్షేట్టిపేట నుంచి పారిపోయిన గురువయ్య వరంగల్‌ చేరి.. కొన్నేళ్లపాటు హోటళ్లలో పనిచేశాడు. ఆ తరువాత హుస్నాబాద్‌కు చేరుకుని వంటమాస్టర్‌గా స్థిరపడ్డాడు. చిన్నోడు సతీష్‌ను దత్తత తీసుకున్న కుటుంబ సభ్యులు ఉన్నత చదువులు చదివించడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించి హైదరబాద్‌లో సెటిల్ అయ్యాడు. సీన్ కట్ చేస్తే సతీష్ ఫేస్‌బుక్‌లో తన ఇంటిపేరుతో సెర్చ్ చేస్తుండగా ఓ పేరు తన కుటుంబ సభ్యుడిలా అనిపించింది.. తీరా ఆ అకౌంట్ ఐడీలోని ఫోటో చూశాక తన పెద్ద అన్నయ్య అని తేలింది. ఇంకేముంది సతీష్ ఆనందానికి అవధులు లేవు.

కుటుంబం నుండి విడిపోయే ముందు పెద్దవాడైన గురవయ్య వయసు 15 ఏళ్లు మాత్రమే. మిగతా ముగ్గురి వయసు 10 ఏళ్లలోపే. ఇప్పుడు వాళ్లందరికి పెళ్లిలు కూడా అయ్యాయి. పిల్లాపాపలతో ఇప్పుడిలా అంతా ఒక్కటయ్యారు. ఫేస్‌బుక్ కలిపిన బంధంతో మళ్లీ తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు అన్నదమ్ములు గురువయ్య, లక్ష్మణ్. అన్నయ్యను ఇన్నాళ్ల తరువాత చూడగలిగానని.. జీవితానికి ఈ భాగ్యం చాలంటున్నాడు తమ్ముడు సతీష్. మూడు దశాబ్దాల తర్వాత అంతా ఒకచోటుకు చేరడంతో గురువయ్య కుటుంబంలో అవధుల్లేని ఆనందం వెల్లివిరిసింది. ఇన్నాళ్లు తను అనాథను అని చెప్పిన తన తండ్రి గురువయ్య.. తనకు ఓ కుటుంబం ఉందని బాబాయ్, పిన్ని, చిన్ననానామ్మ, చిన్నతాతయ్యలను పరిచయం చేయడంతో ఉప్పొంగిపోతోంది గురువయ్య కూతురు. తమ్ముడు సతీష్, చెల్లి రమ్యను‌ కలిసేందుకు హైదరబాద్‌కు బయలుదేరుతున్నట్టు గురువయ్య చెప్పుకొచ్చాడు. టెక్నాలజీ మంచి చేస్తుంది బంగారు భవిష్యత్‌ను ఇస్తుందంటే ఇదేనేమో.. ఫేస్‌బుక్ బంధాలు, అనుబంధాలు వర్దిల్లాలి‌ అంటున్నారు గురువయ్య ఆత్మీయులు.

(నరేష్, టీవీ9 తెలుగు రిపోర్టర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా)

Read Also: కోవిద్ పాండమిక్ తో రెండు తెలుగు రాష్ట్రాల యువతలో పెరిగిన డిప్రెషన్.. ఓ అధ్యయనంలో వెల్లడి

టీ20 క్రికెట్‌లో సునామీ.. 10 సిక్సర్లు.. 26 బంతుల్లో 124 పరుగులు.. మాజీ ఆర్సీబీ ప్లేయర్ విధ్వంసం!

దేశ వ్యాప్తంగా బలవంతపు మత మార్పిడులకు ఓ వర్గం యత్నం..ఢిల్లీ, యూపీలలో ఈడీ సోదాలు

కరోనా ఎఫెక్ట్..! ఇండియాలో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ బాధితులు.. మహిళలు ఈ విషయాలు తెలుసుకోండి..