Telangana: మంత్రి గంగులకు చెందిన గ్రానైట్ కంపెనీల్లో సోదాలు.. ఈడీ సంచలన ప్రకటన..
తెలంగాణ మంత్రి గుంగుల కమలాకర్‌కు చెందిన గ్రానైట్స్ కంపెనీల్లో సోదాలపై ఈడీ విస్తుబోయే ప్రకటన చేసింది. పనామా లీక్స్ కేస్ ప్రధాన నిందితుడికి..

తెలంగాణ మంత్రి గుంగుల కమలాకర్‌కు చెందిన గ్రానైట్స్ కంపెనీల్లో సోదాలపై ఈడీ విస్తుబోయే ప్రకటన చేసింది. పనామా లీక్స్ కేస్ ప్రధాన నిందితుడికి గంగుల గ్రానైట్ కంపెనీకి మధ్య లింక్స్ కనిపిస్తున్నాయంది. కొంతమంది రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్స్‌కి విదేశాల్లో ఆస్తులున్నాయని 2016లో ప్రకటించి సంచలనం సృష్టించింది పనామా లీక్స్. ఆ కేసులో ప్రధాన నిందితుడు లిహ్‌నోకి, గంగులకు చెందిన శ్వేతా గ్రానైట్స్‌కి మధ్య కోట్లలో లావాదేవీలు జరిగాయి. అయితే ఈ లావాదేవీలకు సదరు గ్రానైట్ సంస్థలు ఉద్యోగుల పేరుతో బినామీ ఖాతాలు తెరిచి మరీ ఈ అక్రమాలకు పాల్పడ్డట్లు ఈడీ ప్రకటించింది.
శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, వెంకటేశ్వర గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ షిప్పింగ్ సంస్థల్లో సోదాలు చేసిన ఈడీకి తవ్విన కొద్దీ గ్రానైట్స్ గుట్టు బయటపడుతోంది. ఏకంగా గంగులకు చెందిన కంపెనీలో కోటీ 8లక్షల హవాలా క్యాష్ పట్టుకుంది ఈడీ. అంతేకాదు.. పదేళ్ల లెక్కాపత్రాలు చూస్తే అంతా డొల్లగానే ఉన్నట్లు గుర్తించింది దర్యాప్తు సంస్థ. ఎగుమతులకు చెల్లించిన రాయల్టీ పదిశాతం ఉంటే.. కంపెనీలు చేసిన గ్రానైట్ ఎగుమతులు వందశాతం ఉన్నాయని గుర్తించింది. అంటే.. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి.. హాంకాంగ్, చైనాకు గ్రానైట్ ఎగుమతులు చేశాయి సదరు గ్రానైట్ సంస్థలు. రైళ్ల ద్వారా ఓడరేవులకు విస్తృతంగా గ్రానైట్ తరలించినట్లు గుర్తించారు. అంతేకాదు.. సరైన పత్రాలు లేకుండానే చైనా నుంచి రుణాల రూపంలో డబ్బు బదిలీ చేసినట్లు గుర్తించారు ఈడీ అధికారులు. ఎగుమతుల ద్వారా కాకుండా మరో మార్గాల్లోనూ ఆదాయం చూపించినట్లు గుర్తించారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..