AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: అదనపు కట్నం కోసం భర్త దారుణం.. పెళ్లైన రెండు నెలలకే వివాహిత మృతి!

కోటి ఆశలతో సంసారమనే కొత్త జీవితంలో అడుగుపెట్టిన నవవధువుకు రెండునెలలకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. అత్తింటి సూటిపోటి మాటలు, అదనపు కట్నం కోసం శారీరక హింసలు ఎన్ని అగచాట్లు పెట్టిన పంటిబిగువున భరించింది. ఆహారం పెట్టకుండా కడుపు కాల్చినా సహించింది. చివరకు కట్టుకున్నవాడే కాలయముడై దాడి చేయడంతో మనసు ముక్కలైన ఆమె మృత్యువే శరణ్యమని భావించి తనువు చాలించింది..

Warangal: అదనపు కట్నం కోసం భర్త దారుణం.. పెళ్లైన రెండు నెలలకే వివాహిత మృతి!
Dowry Death In Telangana
Srilakshmi C
|

Updated on: Feb 28, 2024 | 9:14 AM

Share

వర్ధన్నపేట, ఫిబ్రవరి 28: కాలం మారుతోన్నా.. సాంకేతిక అభివృద్ధి చెందుతోన్న దురాచారాలు మాత్రం మాసిపోవడం లేదు. సమాజంలో ఆడవారి దుస్థితి నానాటికీ దిగజారీ పోతుంది. పెళ్లిపేరిట పుట్టినిళ్లు, మెట్టినిళ్లు అని విభజించి ఎక్కడా సరైన ఆశ్రయం, రక్షణ దొరక్కా నిత్యం ఎందరో పడతులు ప్రాణాలు వదులుతున్నారు. మరోవైపు లక్షల డబ్బు కుమ్మరించి వరుడిని కొనుక్కున్నా.. అదనపు కట్నం కావాలని వేధించే అత్తింటి ఆగడాలు వరకట్నం వేధింపులు ఆగడం లేదు. తాజాగా కోటి ఆశలతో సంసారమనే కొత్త జీవితంలో అడుగుపెట్టిన నవవధువుకు రెండునెలలకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. అత్తింటి సూటిపోటి మాటలు, అదనపు కట్నం కోసం శారీరక హింసలు ఎన్ని అగచాట్లు పెట్టిన పంటిబిగువున భరించింది. ఆహారం పెట్టకుండా కడుపు కాల్చినా సహించింది. చివరకు కట్టుకున్నవాడే కాలయముడై దాడి చేయడంతో మనసు ముక్కలైన ఆమె మృత్యువే శరణ్యమని భావించి తనువు చాలించింది. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో చోటుచేసుకున్క ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బేతి విజయ- వెంకటేశ్వర్లు దంపతుల కుమార్తె అర్చన (28). ఆమెను వరంగల్‌ జిల్లా కొత్తవాడకు చెందిన కందగట్ల విజయలక్ష్మి- వెంకటయ్య దంపతుల కుమారుడు సందీప్‌కు ఇచ్చి 2022 డిసెంబరు 18న వివాహం జరిపించారు. కట్నంగా రూ.8 లక్షలు కూడా ఇచ్చుకున్నారు. రెండు నెలలు కాపురం సవ్యంగానే సాగింది. కానీ ఆ తర్వాతే అత్తింటి వారి అసలు రూపాలు బయటపడ్డాయి. భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం అర్చనను వేధించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సందీప్‌కు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం రావడంతో కాపురం భాగ్యనగరానికి మార్చారు. అక్కడికి వెళ్లాక భర్త సందీప్‌ మరింతగా వేధించసాగాడు. అదనపు కట్నం కోసం అర్చనను శారీరకంగా, మానసికంగా హింసించాడు. ఆహారం కూడా పెట్టకుండా భార్యను నానాహింసలకు గురిచేశాడు. ఈ విషయాలన్నీ ఫోన్‌లో తరచూ తల్లిదండ్రులకు చెప్పి బాధపడేది.

ఫిబ్రవరి 24న అగ్రంపహాడ్‌ సమ్మక్క- సారలమ్మ జాతర కోసం అర్చన దంపతులు వరంగల్‌కు వచ్చారు. ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 25న రాత్రి అర్చన కుటుంబ సభ్యులకు సందీప్‌ ఫోన్‌ చేసి, ఆమెను వెంటనే తీసుకెళ్లాలని చెప్పాడు. ఆ ప్రకారంగానే 26న తల్లిదండ్రులతో వరంగల్‌ వెళ్లిన అర్చన ఆరోగ్యం అప్పటికే క్షీణించింది. అదేరోజు రాత్రి అపస్మారక స్థితికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. భర్త, అత్తమామల వేధింపుల వల్లే తమ కూతురు మృతి చెందిందంటూ అర్చన తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ విలపించారు. మృతురాలి తల్లి విజయ మంగళవారం అల్లుడు సందీప్‌ సహా అతని కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.