హుజురాబాద్ గడ్డ మీద బూడిద పంచాయితీ.. అంజనేయుడి సాక్షిగా తేల్చుకుందాం రా అంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయం రోజు రోజుకు హీటెక్కుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు సైతం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు.

హుజురాబాద్ గడ్డ మీద బూడిద పంచాయితీ.. అంజనేయుడి సాక్షిగా తేల్చుకుందాం రా అంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్..!
Huzurabad Politics
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jun 25, 2024 | 10:49 AM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయం రోజు రోజుకు హీటెక్కుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతలు సైతం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై అవినీతి ఆరోపణలతో ఎదురుదాడికి దిగారు. ఇవాళ చెల్పూర్ హనుమాన్ ఆలయం దగ్గరికి రావాలని సవాల్ విసిరారు హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ప్రణవ్. టెంపుల్ దగ్గరకు వస్తే అవినీతి ఏంటో నిరూపిస్తామంటూ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సై అంటూ కాసేపట్లో టెంపుల్‌ దగ్గరకు వస్తున్నట్లు ప్రకటించారు.

నిబంధనలకు విరుద్దంగా రవాణా అవుతున్న బూడిద పంచాయితీ కాస్తా దేవుని వద్దకు చేర్చేలా చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల మధ్య జరుగుతున్న యాష్ సప్లై వ్యవహారం రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ లక్ష్యంగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వందల కోట్ల స్కామ్ అంటూ ఆయన ఏకంగా బూడిద రవాణా చేసే లారీలను అడ్డుకుని ఆరోపణలకు దిగారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు.

ఈ నోటీసుల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి మీడియా ముందు సవాల్ విసిరారు. ఎలాంటి అవినీతికి పాల్పడలేదని జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేస్తావా అని ప్రశ్నించారు. మంత్రి పొన్నంపై ప్రభాకర్ పై కౌశిక్ రెడ్డి విసిరిన ఈ సవాల్ పై హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితెల ప్రణవ్ కౌంటర్ అటాక్‌కు దిగారు. కౌశిక్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన ప్రణవ్, చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని ప్రతి సవాల్ విసిరారు. మంగళవారం చెల్పూర్ అంజన్న సన్నిధికి రావాలని ప్రణవ్ విసిరిన ఈ సవాలును స్వీకరించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెల్పూరుకు వచ్చేందుకు సిద్దమయ్యారు.

రాత్రికి రాత్రే వెలిసిన ఫ్లెక్సీలు…

మరికొన్ని గంటల్లో చెల్పూర్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రమాణాలకు సిద్దమవుతున్న క్రమంలో ఆలయ సమీపంలోని రహదారిపై ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో మహబూబాబాద్ కాల్పుల అంశాన్ని ఈ ఫ్లెక్సీల ద్వారా తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున కరీంనగర్ లో జరిగిన లాఠీఛార్జి ఘటనకు సంబంధించిన ఫోటోలను వేసి కౌశిక్ రెడ్డి నోటి దూల ఫలితమంటూ ముద్రించారు. తెల్లవారేసరికి హుజురాబాద్, జమ్మికుంట రహదారిపై వెలిసిన ఈ ఫ్లెక్సీలు సంచలనం కలిగిస్తున్నాయి.

స్వీట్ వార్నింగ్ ఇచ్చిన పోలీసులు…

మరోవైపు పోలీసులు సైతం రాత్రికి రాత్రే తమ వ్యూహాన్ని మార్చేశారు. అంజనేయ స్వామి ఆలయం వద్దకు ఇరు పార్టీల నాయకులు చేరుకుని ఉద్రిక్తత నెలకొనే వరకు వేచి చూడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇరు పార్టీల నాయకుల సవాళ్ల నేపథ్యంలో పోలీసులు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నాయకులు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని కూడా హెచ్చరించినట్టుగా సమాచారం. ఇరు పార్టీల నాయకులు సంయమనం పాటించకుండా అంజన్న ఆలయం వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తే క్రిమినల్ కేసులు పెట్టడంలో వెనకాడేది లేదని స్పష్టం చేసినట్టుగా సమాచారం.

ఏది ఏమైనా రామగుండం ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ నుండి ఖమ్మం జిల్లా మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకు తరలి వెళ్తున్న బూడిద అవినీతి చుట్టే రాజకీయం చేస్తున్న ఇరు పార్టీల నాయకులు ఆ ఊబిలో చిక్కుకపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..