Telangana: నిజామాబాద్‌లోకి ఎంటరైన డేంజరస్ చెడ్డీ గ్యాంగ్.. సీసీ కెమెరాలకు చిక్కిన ముఠా సభ్యులు.. వీడియో
కంటేశ్వర్, హౌసింగ్ బోర్డ్ ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ ముఠా సంచరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ముఠా కోసం గాలిస్తున్నారు. గతంలోనూ చెడ్డీ గ్యాంగ్ నిజామాబాద్‌లో కలకలం రేపింది.

Cheddi Gang Hulchul In Nizamabad: తెలంగాణ నిజామాబాద్‌లో మళ్లీ అలజడి మొదలైంది. వెరీ డేంజరస్ చెడ్డీ గ్యాంగ్ నగరంలోకి ఎంటరైంది. శివారు ప్రాంతాలే టార్గెట్‌గా రెచ్చిపోతోంది డేంజరస్ గ్యాంగ్. ఒంటిపై చెడ్డీ, ముఖానికి మాస్క్, చేతిలో ఆయుధం పట్టుకుని తిరుగుతోన్న ముఠా దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. అర్ధరాత్రి నిజామాబాద్ వీధుల్లో తిరుగుతోన్న చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు బయటికి రావడంతో ప్రజలు హడలిపోతున్నారు. కంటేశ్వర్, హౌసింగ్ బోర్డ్ ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ ముఠా సంచరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ముఠా కోసం గాలిస్తున్నారు. గతంలోనూ చెడ్డీ గ్యాంగ్ నిజామాబాద్‌లో కలకలం రేపింది. కత్తులతో తిరుగుతూ దోపిడీలకు పాల్పడింది. ఓ బ్యాంక్‌ను కూడా లూటీ చేశారు. ఈ కేసులో నిందితులు ఇప్పటికీ దొరకలేదు.
ఇప్పుడు మళ్లీ చెడ్డీ గ్యాంగ్ ఎంట్రీ ఇవ్వడంతో జనం భయంతో వణికిపోతున్నారు. అయితే, రాత్రిపూట ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్టు కన్పిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు పోలీసులు. అలాగే, ప్రతీ కాలనీలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు, చెడ్డీ గ్యాంగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. పట్టుకునే ప్రయత్నం, ఎదురించే ప్రయత్నం చేస్తే మారణాయుధాలతో అత్యంత దారుణంగా ఎటాక్ చేస్తారని హెచ్చరిస్తున్నారు.
చూడ్డానికే కాదు, వినడానికే వణుకు పుట్టించేలా చెడ్డీ గ్యాంగ్స్ ఘోరాలు ఉంటాయ్. అడ్డొస్తే ఎంతకైనా తెగించే ఈ ముఠాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..