31 ఏళ్ల పాశర్లపూడి ఘటనను గుర్తు చేసిన మలికిపురం లీకేజీ.. మళ్లీ అదే సీన్ రిపీట్!
అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో మరో బ్లో ఔట్ పెను సంచలనానికి దారితీసింది. అయితే బ్లో ఔట్ అనగానే మూడు దశాబ్దాల నాటి ప్రమాదం గుర్తుకొస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులోలేని రోజుల్లో అక్కడి ప్రజలకు 65 రోజుల తరువాత గాని ఉపశమనం కలగలేదు. ఇంకో మూడు రోజులు గడిస్తే అంటే జనవరి 8th నాటికి ఆనాటి పాశర్లపూడి బ్లో ఔట్ కు 31 ఏళ్ళు నిండుతాయి..

మలికిపురం, జనవరి 6: అది 1995 జనవరి 8వ తేదీ.. ఆకుపచ్చటి దుప్పటి కప్పుకున్నట్టు కనిపించే కోనసీమలో మామిడి కుదురు మండలం పాశర్లపూడిలో ఓఎన్జీసీ వాళ్ళ చమురు అన్వేషణలో భాగంగా డ్రిల్లింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో 19వ సెక్టార్ లో జరిగిన చిన్న పొరపాటు భారీ ప్రమాదానికి దారి తీసింది. ఉదయాన్నే నిద్రలేచి మంచు ఇంకా తగ్గలేదనుకుంటూనే పనుల్లోకి దిగిన కోనసీమ జనం.. ఒక భారీ శబ్దంతో రావడంతో ఉలిక్కిపడ్డారు. ఆ టైమ్ లో ఆ శబ్దమేంటో అర్థం కాక అయోమయంగా ఆకాశం వైపు చూస్తున్న జనానికి పైకెగసిన మంట కనిపించింది. మంటకూ శబ్దానికీ సంబంధం ఉండి ఉంటుందన్న అంచనాలో ఉండగానే బిగ్గరగా సైరన్ మోగింది. ప్రమాదం ముంచుకొస్తున్నదని గుర్తించిన ప్రజలు వణికిపోయారు. బ్లో ఔట్ అన్నదే కోనసీమ ప్రజలకు ఒక కొత్త అనుభవం. అంతకు ముందెన్నడూ కనీవినీ ఎరగరు.
అలా భయం భయంగా చూస్తూ ఉండగానే ఆ మంట తాకిడికి కొబ్బరి చెట్లు అంటుకొని క్షణాల్లో మాడి మసై పోతున్నాయి. బ్లో ఔట్ జరిగిన ప్రదేశం చుట్టూ ఇదే పరిస్థితి. చుట్టుపక్కల జనం ఇళ్ళు వదిలి పారిపోయారు. ఊళ్ళకు ఊళ్ళు తరలించాల్సి వచ్చింది. రాత్రి పూట కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్ళకు కూడా ఆ అగ్ని కీలలు కనబడుతూ భయపెట్టేవి. ఓఎన్జీసీ నిపుణులు ఈ బ్లో ఔట్ ను ఆర్పటానికి శతవిధాలా ప్రయత్నించి చేతులెత్తేశారు. ఇక లాభం లేదని విదేశాల నుంచి నిపుణులను రప్పించారు. అలా 65 రోజుల తరువాత గాని బ్లోఔట్ ను పూర్తిగా ఆర్పలేకపోయారు. అంటే మార్చి 15 కు గాని పరిస్థితి అదుపులోకి రాలేదు.
కోనసీమ గుండెల మీద చెరిగిపోని చేదు జ్ఞాపకంగా ఇప్పటికీ పాశర్లపూడి బ్లో అవుట్ గురించి చెప్పుకుంటూనే ఉన్నారు. అది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లో అవుట్ గా రికార్డులకెక్కింది. కానీ ఆ వీడియోలు మాత్రం లేవు. అప్పట్లో మీడియాలో వార్తలు టెక్నాలజీ లేకపోవడం వల్ల అంతంత మాత్రమే వచ్చేవి. ఇప్పుడైతే మలికిపురం బ్లో ఔట్ ను 24 గంటల మీడియా మాధ్యమాల ద్వారా అందరూ ఎప్పటికప్పుడు అక్కడేం జరుగుతున్నదో తెలుసుకోగలుగుతున్నారు. మూడు దశాబ్దాల్లో ఎంత మార్పు!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




