BJP 2nd List: శివరాత్రి తర్వాతే బీజేపీ రెండో జాబితా.. ఆశావహుల్లో టెన్షన్.. టెన్షన్

పార్లమెంట్ ఎన్నికలకు గాను అన్ని పార్టీల కంటే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల టూర్‌తో ఫుల్ జోష్‌లో ఉంది కాషాయ పార్టీ. సెకండ్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. పెండింగ్ స్థానాలపై అధిష్టానానికి క్లారిటీ వచ్చిందా..?

BJP 2nd List: శివరాత్రి తర్వాతే బీజేపీ రెండో జాబితా.. ఆశావహుల్లో టెన్షన్.. టెన్షన్
Telangana BJP
Follow us
Vidyasagar Gunti

| Edited By: Balaraju Goud

Updated on: Mar 07, 2024 | 12:24 PM

పార్లమెంట్ ఎన్నికలకు గాను అన్ని పార్టీల కంటే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల టూర్‌తో ఫుల్ జోష్‌లో ఉంది కాషాయ పార్టీ. సెకండ్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. పెండింగ్ స్థానాలపై అధిష్టానానికి క్లారిటీ వచ్చిందా..? ఎన్నికల కమిటీకి చేరిన జాబితాలో ఎవరి పేర్లున్నాయన్నదీ ఉత్కంఠగా మారింది.

ఇప్పటికే 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ.. రెండో విడుతలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. రాష్ట్ర నాయకత్వం కొన్ని పార్లమెంట్ స్థానాలకు రెండు, మూడు పేర్లతో జాబితా అధిష్టానానికి అందించింది. మరికొన్ని లోక్ సభ స్థానాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో డైలమాలో పడినట్లు తెలుస్తోంది. వరంగల్, నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి స్థానాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది. అయితే ఆ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి నేతలకు గాలం వేసి వారికి టికెట్లు కేటాయించాలని పార్టీ భావిస్తోంది. చేరికల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశముందని చర్చ జరుగుతోంది. అనుకున్న సమయంలోగా జాయినింగ్స్ పూర్తయితే మిగిలిన 8 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ లోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మొదటి జాబితాలో పలువురు సీనియర్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. మహబూబ్ నగర్ స్థానం లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు లైన్ క్లియర్‌గా ఉన్నప్పటికీ అధిష్టానం తొలి జాబితాలో ఛాన్స్ ఇవ్వలేదు. కొత్త వారికి పార్టీ అవకాశం కల్పించింది. కానీ వేరే పార్టీ నుంచి చేరిన ఒకటి రెండు రోజుల్లోనే ఇద్దరు నేతలు టికెట్ అందుకున్నారు. దీంతో మిగిలిన 8 స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? లేక పాత వారికి అవకాశం కల్పిస్తారా? అన్న ప్రశ్న అందరి మెదళ్లను తొలచివేస్తోంది.

జహీరాబాద్ స్థానాన్ని ఆశించి భంగపడిన ఆలె భాస్కర్ మెదక్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన తండ్రి ఆలె నరేంద్ర మెదక్ ఎంపీగా పనిచేశారు. దీంతో వారి కుటుంబానికి ఆ ప్రాంతానికి ఉన్న అనుబంధం కారణంగా ఆలె భాస్కర్ మెదక్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ స్థానం కోసం రఘునందన్ రావు, అంజిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా మిట్టపల్లి సురేందర్‌కు పెద్దపల్లి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. టికెట్ తనకిస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, పెద్దపల్లి టికెట్ ను సీనియర్ అయిన ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ సైతం ఆశిస్తున్నారు. అదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు తొలి జాబితాలో ఛాన్స్ దక్కలేదు. రెండో జాబితాలో అతనికే ఛాన్స్ ఇస్తారా? కొత్త వ్యక్తిని తెరపైకి తెస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

మార్చి 8వ తేదీన ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ తర్వాత ఏ క్షణాన అయినా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చేరికలను త్వరగా పూర్తి చేయాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో అన్ని స్థానాలను క్లీన్ స్విప్ చేయాలనుకుంటున్న కమలనాథుల ఈక్వేషన్స్ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…