BJP: భారీ ప్లాన్‌తో దూసుకొస్తున్న తెలంగాణ బీజేపీ.. రెండు రోజులపాటు హైదరాబాద్‌లోనే 300 మంది జాతీయ నేతలు..
BJP Target 2023: జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. తుక్కుగూడ సభను మించిన రీతిలో 10 లక్షల మంది జనాన్ని ఈ సభకు సమీకరిస్తామని బీజేపీ ప్రకటించింది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ(BJP) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా జూలై 3న హైదరాబాద్‌లో బీజేపీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశంలో భాగంగా.. వచ్చే నెల 2, 3 తేదీల్లో బీజేపీ ముఖ్య నేతలంతా హైదరాబాద్‌లోనే ఉంటారు. రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకునేందుకు ఇదే సరైన సమయమని కమలం పార్టీ భావిస్తోంది. అందుకే భారీ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సదస్సులో ప్రధాని మోదీ(PM Modi), అమిత్‌షా సహా కీలక నేతలు ప్రసంగిస్తారు. ఈ సభ కోసం పరేడ్ గ్రౌండ్‌ను బీజేపీ శ్రేణులు పరిశీలిస్తున్నాయి. లక్షల మందితో నిర్వహించాలని భావిస్తున్న బీజేపీ.. జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఇప్పటికే ప్రత్యేక కార్యాలయాన్ని బీజేపీ ప్రారంభించింది. బీజేపీ కార్యవర్గ సమావేశాలతో, పార్టీ శ్రేణుల్లో జోష్ వస్తందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ నేతలకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవలే ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు బిసి మోర్చా అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ను నామినేట్ చేసింది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే రెండు రోజుల పాటు జాతీయ స్థాయి నాయకులు మకాం వేయబోతున్నారు. ఈ సమయంలో తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టార్గెట్ తెలంగాణగా రూపొందిస్తున్న వ్యూహంలో భాగంగా పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు జాతీయ కార్యవర్గ సమావేశానికి హైదరాబాద్‌ను వేదికగా ఎంపిక చేసింది. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు సహ 300 మంది నాయకులు హాజరుకానున్నారు. సమావేశాలు జరిగే ప్రాంగణాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ముఖ్యనేతలు పరిశీలించారు. ఏర్పాట్లు, సదుపాయాలను అక్కడి సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల ముగిసిన తర్వాత జూలై 3 ఆదివారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. తుక్కుగూడలో నిర్వహించిన అమిత్ షా సభకు మించిన రీతిలో హైదరాబాద్ సభ ఉంటుందని బండి సంజయ్ ప్రకటించారు. సభా ప్రాంగణాన్ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
ఈ సమావేశాల కోసం అయ్యే ఖర్చును కార్యకర్తలు, నాయకుల నుంచి సమీకరించాలని బీజేపీ నిర్ణయించింది. పోలింగ్ స్థాయి నుంచి కార్యకర్తలను దీనిలో భాగస్వామ్యం చేస్తామని బండి సంజయ్ తెలిపారు.
కొవిడ్ తర్వాత తొలి పూర్తిస్థాయి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశమిది. బీజేపీ అధ్యక్షుడు JP నడ్డా ప్రస్తుత పదవీకాలంలో జరుగుతున్న చివరి జాతీయ కార్యవర్గం సమావేశం ఇది.