BJP Executive Meeting: హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. ఇంతకీ కమలనాథుల వ్యూహం ఇదేనా..?

భాగ్యనగరం వేదికగా జరుగుతున్న జాతీయ కార్యవర్గం సమావేశాలను స్వాట్‌ అనాలసిస్‌కు బీజేపీ ఉపయోగించుకోనుంది. తన బలాలు, బలహీనతలతో పాటు అవకాశాలు, ముప్పులను కూడా బీజేపీ విశ్లేషించనుంది. ఎన్నికలు, పార్టీ విస్తరణ, మోదీ పాలనను జనాల్లోకి తీసుకెళ్లడం ప్రధానాంశాలుగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.

BJP Executive Meeting: హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. ఇంతకీ కమలనాథుల వ్యూహం ఇదేనా..?
Bjp
Shaik Madarsaheb

|

Jul 02, 2022 | 1:23 PM

BJP Executive Meeting in Hyderabad: ఇప్పుడు అందరిచూపు హైదరాబాద్ వైపే ఉంది. దీనికి ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా ఆపార్టీ అగ్రనేతలంతా తరలివస్తున్నారు. రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ అతిథ్యం ఇవ్వడంతోపాటు ఇదే తరుణంలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటిస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ బ్యానర్లు, హోర్డింగ్‌లు, తోరణాలతో భాగ్యనగరం నిండిపోయింది. ఓ రకంగా ఆ రెండు పార్టీల ప్రదర్శనకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. భాగ్యనగరం వేదికగా జరుగుతున్న జాతీయ కార్యవర్గం సమావేశాలను స్వాట్‌ అనాలసిస్‌కు బీజేపీ ఉపయోగించుకోనుంది. తన బలాలు, బలహీనతలతో పాటు అవకాశాలు, ముప్పులను కూడా బీజేపీ విశ్లేషించనుంది. ఎన్నికలు, పార్టీ విస్తరణ, మోదీ పాలనను జనాల్లోకి తీసుకెళ్లడం ప్రధానాంశాలుగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతోపాటు మోడీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర, అటు దేశ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అసలు బీజేపీ వ్యూహం ఏంటీ అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. దక్షిణాదిలో బీజేపీ పాగా, ముఖ్యంగా తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకోవడం, 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు, పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ చర్చించనుంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చాటుకోవడం, అదేవిధంగా కేసీఆర్ జాతీయ పార్టీ యోచన, ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో తాము తెలంగాణ గల్లిలో నిలబడి రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపాలనేది కమలనాథుల వ్యూహంగా తెలుస్తోంది. తద్వార కేసీఆర్‌ను రాష్ట్రానికే పరిమితం చేయాలన్న వ్యూహం బీజేపీ పెద్దల ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ సంకల్ప సభతో తెలంగాణలో రాచరిక పాలనను ఎండగట్టి  ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి అనుకూలంగా ఉన్న పరిస్థితులను మరింత మెరుగుపర్చుకోవాలని కమలానాథులు ఉవ్విళ్లూరుతున్నారు.

కీలక అంశాలపై చర్చ..

హైదరాబాద్‌ నోవాటెల్‌ కేంద్రంగా సాగుతున్న ఈ సమావేశాల్లో భాగంగా ఈ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జాతీయ కార్యవర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, అజెండాను ఖరారు చేసేందుకు ఆఫీసర్‌ బేరర్స్‌ భేటీ అయ్యారు. నేటి సమావేశంతో పాటు, రేపు ఉదయం సెషన్‌, మధ్యాహ్నం సెషన్‌ అజెండాను ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. ఎవరు ఏ అంశంపై మాట్లాడాలనేది ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కీలక నేతలు వివిధ అంశాలపై మాట్లాడనున్నారు.

తొలి రోజు సమావేశాల్లో నేడు పరిపాలన, అంతర్జాతీయ వ్యవహారాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, ఇతర అంతర్జాతీయ వ్యవహారాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. ద్రవోల్బణం, ధరల పెరుగుదల వంటి విషయాలపై కూడా చర్చిస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. రేపటి ఉదయం సమావేశం పూర్తిగా పార్టీ బలోపేతం, హ్యాట్రిక్‌ కొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహం, ఏయే రాష్ట్రాల్లో లబ్ది పొందవచ్చు, ఎక్కడా బలపడేందుకు అవకాశముందనే విషయాలపై లోతుగా చర్చ జరగనుంది.

భవిష్యత్‌లో ప్లస్‌ అయ్యే రాష్ట్రాలేంటి, మైనస్‌ అయ్యే రాష్ట్రాలేంటి అనే విషయాలపై బీజేపీ అగ్రనేతలు చర్చించనున్నారు. తొలి రోజు సమావేశాల ప్రారంభం, మొత్తం కార్యక్రమాల నిర్వహణ అంతా కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చేతుల మీదుగా సాగనుంది. నడ్డా ప్రారంభోపన్యాస్యంతో సమావేశాలు మొదలవుతాయి. పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ చర్చ జరిగాక రేపు మధ్యాహ్నం లంచ్‌ తర్వాత ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షా ప్రసంగాలు ఉండనున్నాయి. చర్చించిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన చర్యల గురించి పార్టీ నేతలకు అగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారు.

జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ప్రధాని మోదీ హైదరాబాద్‌ రానున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత ఆయన హెలికాప్టర్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలకు వేదికగా నిలుస్తున్న HICC ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రధాని రాక సందర్భంగా ప్రత్యేకంగా హెలీపాడ్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు. హెలికాప్టర్‌ దిగి ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సొరంగ మార్గం ద్వారా నోవాటెల్‌ హోటల్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లోని ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకొని ఆయన సరిగ్గా 4 గంటలకు సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu