Munugode Bypoll: అది నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి సిద్ధం.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు రాజగోపాల్ రెడ్డి సవాల్
మునుగోడులో అసలైన యుద్ధం మొదలైంది. ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చేసింది, అటు పార్టీలు కూడా అభ్యర్ధులను ఖరారు చేశాయి. పార్టీల మధ్య ఎత్తులు..
మునుగోడులో అసలైన యుద్ధం మొదలైంది. ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చేసింది, అటు పార్టీలు కూడా అభ్యర్ధులను ఖరారు చేశాయి. పార్టీల మధ్య ఎత్తులు.. పై ఎత్తులుతో నియోజకవర్గం వేడెక్కింది. ఊహించినట్టుగానే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అధికారపార్టీ టీఆర్ఎస్ టికెట్ కన్ఫామ్ చేసింది. ఇక కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి ఇప్పటికే ప్రచారంలో ఉండగా.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన దగ్గర నుంచే వ్యూహాల్లో మునిగితేలుతున్నారు. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికే మూడు పార్టీలు టికెట్ ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలాఉంటే.. కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, బీజేపీలో చేరారని వస్తున్న ఆరోపణలపై టీవీ9 వేదికగా తీవ్రంగా స్పందించారాయన. టీవీ9 వేదికగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్ సవాల్ విసిరారు. 22వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్ కోసమే రాజగోపాల్.. పార్టీ మారారు, మునుగోడు బైపోల్ తెచ్చారన్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానంగా సవాల్ విసిరారాయన. తన కొడుకు ఎండీగా ఉన్న సంస్థకు కాంపిటేషన్‌లో అనేక కాంట్రాక్ట్‌లు వస్తాయని, వాటికీ బీజేపీకి లింకేంటని ప్రశ్నించారాయన. బీజేపీలో చేరికతో తాను 22వేల కోట్ల వర్త్ కాంట్రాక్ట్‌తో లబ్ధిపొందినట్లు నిరూపిస్తే మునుగోడు బైపోల్ నుంచే తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించలేక పోతే.. ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
తాను బీజేపీలో చేరతానని మూడేళ్లుగా చెబుతున్నానని, ఆరునెలల క్రితం కాంపిటేషన్‌లో 18వేల వర్త్ కాంట్రాక్ట్ వచ్చిందని అన్నారు. దానికీ కేంద్రానికీ, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిరూపిస్తే మాత్రం మునుగోడు జోలికే వెళ్లనని సవాల్ విసిరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..