Telangana: ఆరో తరగతి విద్యార్ధి ఆత్మహత్యాయత్నం.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
తోటి విద్యార్ధుల ర్యాగింగ్ కారణంగా ఆరో తరగతి బాలుడు నిండు ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. పాఠశాలలోని ఇతర విద్యార్ధులు తనను వేధిస్తున్నారని పాఠశాలలోని టీచర్లకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రెచ్చిపోయిన విద్యార్ధులు బాలుడిని మరింత బాధపెట్టారు. దీంతో పసిమనసు ఎంతగాయమైందో ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు..
మహబూబాబాద్, డిసెంబర్ 8: కాలేజీలు, యూనివర్సిటీలకు పరిమితమైన ర్యాగింగ్ భూతం ఇప్పుడు స్కూళ్లకు చేరింది. తోటి విద్యార్ధులు ర్యాంగింగ్ చేయడంతో టీచర్లకు తెలిపాడు. వారు పట్టించుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆరో తరగతి విద్యార్ధి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ షాకింగ్ ఘటన మహబూబాబాద్‌లోని గూడూరు బాలుర ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో శనివారం (డిసెంబర్ 7) చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి బంధువులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు.. అదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్ విద్యార్థి (12)ని టార్గెట్ చేశారు. ఆశ్రమ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు తాము చెప్పిన పనులు చేయాలంటూ ఆరో తరగతి విద్యార్థిని తరచూ వేధించసాగారు. ఆ బాధను తట్టుకోలేక తీవ్ర మనస్తాపం చెందిన ఆ విద్యార్థి ఎలర్జీ నివారణకు వాడే ఔషధం తాగాడు. గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎస్సై గిరిధర్‌రెడ్డి దవాఖానకు చేరుకుని విచారించగా సీనియర్లు వేధిస్తున్నారని బాధిత విద్యార్థి తెలిపాడు. టెన్త్ విద్యార్థులు వేధిస్తున్న విషయం వార్డెనుకు తెలిపినా పట్టించుకోలేదని బాధిత విద్యార్థి తెలిపాడు. తనకేం చేయాలో.. ఎవరికి చెప్పాలో తెలియక ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులకు వివరించాడు. ప్రస్తుతం వైద్యులు బాలుడికి చికిత్స అందిస్తు్న్నారు. విద్యార్ధి ఆరోగ్య పరిస్థితి మరో 24 గంటల తర్వాతగానీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు ఆశ్రమ పాఠశాలకు వెళ్లి అక్కడి విద్యార్థులను విచారించారు. హాస్టల్‌లో పురుగుల అన్నం పెడుతున్నారని, వసతులు సరిగాలేవని, నిద్రిస్తున్న సమయంలో సీనియర్ విద్యార్థులు తమ దుప్పట్లను తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని గూడూరు ఎస్‌ఐ గిరిధర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. దీనిపై గిరిజనాభివృద్ధి శాఖ ఉపసంచాలకుడు మాలోత్ సైదానాయక్ మాట్లాడుతూ గూడూరు గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.