Warangal: రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య కేసులో వెలుగులోకి సంచలనాలు.. నిందితుడు ఎవరో తెలుసా..?

వరంగల్ జిల్లాలో సంచలన సృష్టించిన రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య కేసును మట్టెవాడ పోలీసులు ఛేదించారు. హంతకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Warangal: రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య కేసులో వెలుగులోకి సంచలనాలు..  నిందితుడు ఎవరో తెలుసా..?
Murder Mystery In Warangal
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Dec 08, 2024 | 10:21 AM

వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఒంటిపై ఉన్న బంగారం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు మాజీ సర్పంచ్, ఓ యూట్యూబ్ ఛానల్ స్ట్రింగర్‌గా పనిచేసిన వ్యక్తగా తేల్చారు. కేవలం తనకు ఐదు లక్షల రూపాయలు అప్పు ఇవ్వనందుకే హతమార్చి అతని ఒంటిపై ఉన్న బంగారమంతా దోచుకున్నాడని నిర్ధారించారు. ఆ కంత్రీగాడిని అరెస్టు చేసిన పోలీసులు అతడు దోచుకున్న బంగారమంతా రికవరీ చేసి రిమాండ్ కు పంపారు.

డిసెంబర్ 2వ తేదీన ఈ దారుణ హత్య ఒక్కసారిగా ఓరుగల్లు ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత కిరాతకంగా రాజా మోహన్ అనే రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ హత్య చేసిన ఉన్మాది పోలీసులు కూడా షాక్ అయ్యేలా చేశాడు. ఆ ఘటన చూసి నగరమంతా షేక్ అయ్యింది. అత్యంత పాశవికంగా హతమార్చాడు కిరాతకుడు. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌ను పెంపుడు కుక్కలను కట్టేసే గొలుసులు, తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టి చంపేశాడు. చనిపోయిన తరువాత ఆ డెడ్ బాడీని కారులో ఎక్కించుకుని నగరమంతా తిరిగి చివరకు రంగంపేటలో జనసంచారం లేని ప్రాంతంలో వదిలి వెళ్లాడు.

మరుసటి రోజు కారులో డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసుల సమాచారం అందించడంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. హంతకుడు ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జక్కుల శ్రీనివాస్‌గా గుర్తించారు. అతను గతంలో ఓ యూట్యూబ్ ఛానల్‌లో స్ట్రింగర్‌గా పని చేశాడు. మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్‌గా కూడా రెండు పర్యాయాలు పని చేశాడు. ప్రస్తుతం హనుమకొండలోని రెవెన్యూ కాలనీలో ఓ మహిళ తో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అయితే శ్రీనివాస్‌కు డబ్బు అవసరం ఉండటంతో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ రాజమోహన్‌ను ఐదు లక్షల రూపాయలు అప్పు కావాలని కోరాడు. రెండు నెలల నుండి అప్పు కోసం వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో డబ్బు లేదని రాజమోహన్ తిరస్కరించడంతో అతని ఒంటిపై ఉన్న బంగారం దోచుకోవాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే మర్డర్‌కు పక్కా ప్లాన్ వేసిన జక్కుల శ్రీనివాస్ అతికిరాతకంగా రాజమోహన్ ను హతమార్చాడు.

రెవెన్యూ కాలనీలోని తన ఇంటికి రాజమోహన్‌ను తీసుకెళ్లిన తర్వాత ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత అతికిరాతకంగా కొట్టి చంపాడు. గొలుసులు తాళ్లతో కట్టేసి, డెడ్ బాడీని మూటగట్టి తన కారులో వేసుకొని నగరమంతా తిరిగాడు. ఒక దశలో కెనాల్‌లో వేద్దామని వెళ్ళాడు. కానీ అక్కడ జనసంచారం ఉండడంతో ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అక్కడి నుండి నేరుగా రంగంపేటకు చేరుకుని కారు తో సహా డెడ్ బాడీని రోడ్డు పక్కన పార్కింగ్ చేసి దిగి ఆటోలో వెళ్లిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి, కేసును ఛేదించారు.

సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుని పట్టుకున్న మట్టేవాడ పోలీసులు కేవలం బంగారం కోసమే హతమార్చినట్లు గుర్తించారు. నిందితుడు గతంలో గ్రామ సర్పంచ్‌గా పని చేశాడని, జల్సాలకు అలవాటుపడి ఇలా తప్పుదారి పట్టాడని పోలీసులు తెలిపారు. చాలామందిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఇతని నైజం అని పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి మూడు ఉంగరాలు, ఒక బ్రాస్లెట్, ఒక చైన్ తో సహా మొత్తం ఎనిమిది తులాల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు రిమాండ్‌కు పంపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..