Delhi Triple Murder Case: ట్రిపుల్ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్.. కొడుకే హంతకుడు! అసలేం జరిగిందంటే
ఢిల్లీలో సంచలనం రేపిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అమ్మనాన్నలను కన్న కొడుకే దారుణంగా హతమార్చాడు. అసలేం జరిగిందంటే..
న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఢిల్లీలోని నెబ్ సరాయ్‌లో బుధవారం ఒకే కుటుంబంలో తల్లీదండ్రులతో పాటు వారి కూతురు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను వాకింగ్‌కు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో తల్లి, సోదరి, తండ్రీ రక్తపు మడుగులో ఉన్నారని, ఎవరో దారుణంగా హత్య చేశారని చెప్పిన కొడుకు అర్జున్ దొంగ ఏడుపుపై పోలీసుల దృష్టి నిలిచింది. అందుకు బలం చేకూరేలా వారి ఇంటి సమీపంలోని సీసీకెమెరాల్లో రికార్డైన దృశ్యాలు వారి అనుమానాన్ని నిజం చేశాయి. అవును.. ఈ కేసులో అసలు నిందితుడు కన్న కొడుకు అర్జునే. తల్లిదండ్రులను, అక్కని దారుణంగా హత్య చేసి నంగనాచి డ్రామా ఆడాడు. ఇతడి గుట్టును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. అసలేం జరిగిందంటే..
న్యూఢిల్లీలోని నెబ్‌సరాయ్‌కి చెందిన రాజేశ్‌కుమార్ (51), భార్య కోమల్(46) దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు కవిత (23), కొడుకు అర్జున్ తన్వర్ (20). డిసెంబర్ 4న రాజేశ్, కోమల్‌ల పెళ్లి రోజు. అదే రోజు అంటే బుధవారం తెల్లవారుజామున రాజేశ్, కోమల్, కవితలు ఇంట్లో కత్తిపోట్లతో రక్తపుమడుగులో మృతి చెంది కనిపించారు. మార్నింగ్వాకింగ్కు వెళ్లిన కొడుకు అర్జున్ తిరిగి వచ్చేసరికి ఇంటి మొదటి అంతస్తులో రాజేశ్డెడ్బాడీ, కోమల్, కవిత మృతదేహాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో కనిపించాయి. దీంతో అర్జున్ భయంతో కేకలు వేయడంతో ఇరుగుపొరుగు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఇది అందరికీ తెలిసిన కథ. అసలు విషయం ఏంటంటే..
అర్జున్ చదువులో అంతగా రానించేవాడుకాదు. దీంతో తండ్రి నిత్యం తిడుతుండేవాడు. ఈక్రమంలో తండ్రిపై ద్వేషం పెంచుకున్న అర్జున్.. తండ్రి తిడుతున్న సమయంలో అమ్మ, అక్క తనకు మద్దతుగా నిలవకపోవడంతో ధ్వేషం మరింత పెరిగింది. పైగా ఆస్తి మొత్తం అక్కకే రాసిస్తానని తండ్రి చెప్పడం అర్జున్ జీర్ణించుకోలేకపోయాడు. తాను ఒంటరి వాడినని ఫీలయ్యాడు. ప్లాన్ ప్రకారం.. తొలుత సోదరి నిద్రలో ఉండగా ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆతర్వాత మేడమీదకు వెళ్లి తల్లీదండ్రులను కత్తితో గొంతు కోసి చంపాడు. బుధవారం ఉదయం రక్తంతో తడిసిన తన దుస్తులను, హత్యకు వినియోగించిన కత్తిని బ్యాగ్‌లో జిమ్ సెంటర్‌కు తీసుకెళ్లి అక్కడ వాటిని పడేశాడు. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత రక్తపు మరకల, ఇతర ఆధారాలను శుభ్రం చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అర్జున్ మాటల్లో తడబాటు గుర్తించి, అనుమానంతో తమదైన శైలిలో ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. బుధవారం అర్థరాత్రి సంజయ్ వాన్ నుండి రక్తంతో తడిసిన అతని చొక్కా, తల్లిదండ్రులు, సోదరిని చంపడానికి వినియోగించిన ఆర్మీ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
ఇంతచేసిన నిందితుడు అర్జున్ చదువులో వెనుకబడినప్పటికీ.. అతను ఓ బాక్సర్ కూడా. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌లో అతడు బాక్సింగ్‌లో రజత పతకాన్ని గెలిచాడు. తండ్రి మాజీ సైనికాధికారి కావడంతో అర్జున్ గతంలో ఢిల్లీలోని ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చదువుతున్నాడు. అసూయతో దారుణానికి పాల్పడి ఇప్పుడు జైలు పాలయ్యాడు.