Telangana: డిపోల్లోనే బస్సులు.. ఎక్కడికక్కడ నిరసనలు.. కొనసాగుతున్న తెలంగాణ బంద్..
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీల మద్దతుతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో అధిక ఛార్జీలతో ప్రయాణిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో బీసీ సంఘాల బంద్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుకు కాంగ్రెస్ సహా అన్ని పార్టీల మద్దతు తెలిపాయి. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. బస్ డిపోల ముందు బీసీ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు నిరసకు దిగారు. ఇప్పటికే విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. బంద్‌కు వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా మద్దతు తెలిపాయి. అయితే అత్యవసర సర్వీసులకు మాత్రం బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దని.. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎమ్మెల్యేలు సైతం పలుచోట్లు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుటమాజీ మంత్రి జోగు రామన్న బైఠాయించారు. ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. నిర్మల్ జిల్లా భైంసా డిపో ముందు బీసీ నాయకులతో పాటు వివిధ పార్టీల నాయకులు నిరసన తెలిపారు. అటు ఖమ్మంలోనూ బంద్ కొనసాగుతోంది.
మరోవైపు ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండగ సమయం కావడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూల్ చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




