Bandi Sanjay: అసెంబ్లీ అంటే అంత చులకనా? అసెంబ్లీ ప్రతిష్టను దెబ్బతీస్తారా?.. నిలదీసిన బండి సంజయ్

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌లపై సెటైర్లు వేశారు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌. అసెంబ్లీలో రెండు పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరును కరీంనగర్‌లో నిర్వహిస్తున్న ప్రజాహిత యాత్రలో విమర్శించారు. ప్రజాహిత యాత్రలో భాగంగా 4వ రోజు యాత్ర చేస్తున్న బండి సంజయ్ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో మీడియాతో మాట్లాడారు.

Bandi Sanjay: అసెంబ్లీ అంటే అంత చులకనా? అసెంబ్లీ ప్రతిష్టను దెబ్బతీస్తారా?.. నిలదీసిన బండి సంజయ్
Bandi Sanjay Kumar
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Balaraju Goud

Updated on: Feb 14, 2024 | 7:07 PM

మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని విజిలెన్స్ నివేదిక స్ఫష్టం చేస్తున్నా ఎందుకు చర్య తీసుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, సబ్ కాంట్రాక్ట్ సంస్థ చేసిన నాసిరకం పనుల వల్లే నివేదికలే చెబుతున్నాయన్నారు. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ నల్లగొండలో సభ నిర్వహించడమేంటన్నారు. నల్లగొండ సభ ప్రెస్ మీట్‌ను తలపించిందే తప్ప చెప్పుకోవడానికేమీ లేదన్నారు. ఒకరేమో అసెంబ్లీకి ముఖం చాటేసి సభ పేరుతో డ్రామాలాడుతుంటే.. ఇంకొకాయనేమో ఏకంగా అసెంబ్లీనే వాయిదా వేసి మంత్రులు, ఎమ్మెల్యేలను వెంట బెట్టుకుని వెళుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ అంటే అంత చులకనా? అసెంబ్లీ ప్రతిష్టను దెబ్బతీస్తారా?’’ అంటూ మండిపడ్డారు.

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌లపై సెటైర్లు వేశారు కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌. అసెంబ్లీలో రెండు పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరును కరీంనగర్‌లో నిర్వహిస్తున్న ప్రజాహిత యాత్రలో విమర్శించారు. ప్రజాహిత యాత్రలో భాగంగా 4వ రోజు యాత్ర చేస్తున్న బండి సంజయ్ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేసి కేసీఆర్ నల్లగొండలో సభ పెడితే, ఏకంగా అసెంబ్లీని వాయిదా వేసి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కాళేశ్వరం వెళ్లారని మండిపడ్డారు. ఇప్పటికే కాళేశ్వరంను ఇంతకు ముందే మంత్రులు సందర్శించారు. ఇంజనీరింగ్ నిపుణులు విచారణ జరిపి నివేదికిచ్చారు. కేంద్ర బృందం కూడా విచారణ చేసి నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ ఇచ్చిన నివేదికలో సబ్ కాంట్రాక్ట్ సంస్థ నిర్వాకంవల్లే మేడిగడ్డ పిల్లర్లు కూలిన పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేసింది. అయినా మళ్లీ కాళేశ్వరం పేరుతో డ్రామాలు చేయడమేంటి? అని బండి సంజయ్ ప్రశ్నించారు. సిబీఐ ఎందుకు విచారణ జరపడం లేదు? సదరు సబ్ కాంట్రాక్ట్ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ కుటుంబ ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తుంటే, బీఆర్ఎస్ వారికి సహకరిస్తూ కృష్ణా నీటి వాటా పేరుతో నాటకాలాడుతోందని ఆరోపించారు.

హామీలు అమలు కావాలంటే రూ.5 లక్షల నిధులు కావాలన్న బండి.. బడ్జెట్‌లో ఆ మేరకు నిధులు కేటాయించకపోవడమే పెద్ద మోసమన్నారు. ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఆలోపే ఎందుకు హామీలను అమలు చేయడం లేదు? ఎన్నికల షెడ్యూల్ సాకుతో తప్పించుకోవాలని కాంగ్రెస్ చూస్తుంటే… బీఆర్ఎస్ సహకరిస్తోందన్నారు. అందులో భాగంగానే ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ డ్రామాలాడుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ పవనాలు వీస్తున్నాయి. తెలంగాణలోనూ మెజారిటీ సీట్లను బీజేపీ గెలవబోతోందని బండి ధీమా వ్యక్తం చేశారు. ఇది తెలిసే రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని ఎద్దేవా చేశారు.

ఇక్కడున్న ట్విట్టర్ టిల్లు అసలు పేరు.. కల్వకుంట్ల అజయ్ రావు అన్న బండి సంజయ్.. ఎన్టీఆర్ వద్దకు టిక్కెట్ కోసం పోయి కేసీఆర్ ఆయన కొడుకు పేరును కేటీఆర్ గా మార్చుకున్నాయని దుయ్యబట్టారు. ట్విట్టర్ టిల్లు.. గ్రామాల వారీగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ఎందుకు చెప్పడం లేదన్నారు. గ్రామాలకు నిధులు ఇవ్వకపోవడంవల్లే సర్పంచులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రం ఏం చేసిందో మేం చెప్పుకుంటే తప్పేందన్నారు. సిరిసిల్ల జిల్లాకు కేంద్రం ఇప్పటి వరకు 7 పథకాలకే 1,408 కోట్ల 6 లక్షల రూపాయలకుపైగా ఖర్చు చేసిందని బండి సంజయ్ గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం కోసం రూ. 387 కోట్ల 4 లక్షలు, మెటీరియల్ కోసం రూ. 213 కోట్లు, మొక్కల పెంపకం కోసం రూ. 266 కోట్ల 86 లక్షలు కేటాయించమన్నారు. 2014 – 15 ఆర్దిక సంఘం నిధుల కింద రూ. 155 కోట్లు, మరుగుదొడ్ల, కిసాన్ సమ్మాన్ నిధి కింద భారీ ఎత్తున నిధులిచ్చామని గుర్తు చేశారు. దీంతోపాటు సిరిసిల్ల అసెంబ్లీకి రూ. 660 కోట్లకుపైగా నిధులిచ్చామని వివరాలు వెల్లడించారు.

రాష్ట్ర అధ్యక్షుడయ్యాక 150 రోజులపాటు 16 వందల కిలోమీటర్లు తిరిగానని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన తనకు ఓటేసిన వారి విలువ పెరిగేలా, గల్లా ఎగరేసి తిరిగేలా తెలంగాణ అంతా తిరిగి పోరాడానన్నారు. కేసీఆర్ మెడలు వంచింది మేం. బీజేపీ పోరాడితే తనపై వందకుపైగా కేసులు పెట్టారు. జైలుకు పంపారు. బీజేపీ కార్యకర్తల తలల పగలకొట్టారు. అయినా వెరవకుండా ప్రజల కోసం పోరాడినామని బండి సంజయ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోంది. 400కు పైగా ఎంపీ సీట్లు బీజేపీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ప్రజల చీత్కరించిన బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ మాకేందని ప్రశ్నించారు బండి సంజయ్. మోదీ లేని దేశాన్ని ప్రజలు ఊహించుకోవడం లేదన్నారు. రామరాజ్యం కొనసాగాలన్నా, దేశం ప్రగతి పథంలో దూసుకుపోవాలన్నా మళ్లీ మోదీ ప్రభుత్వమే ఏర్పడాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…