Prabhas: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్… సినిమా రిలీజై 13 ఏళ్లైనా తగ్గని క్రేజ్
ఆ హీరో నడకలో ఒక రాయల్టీ ఉంటుంది.. ఆయన నవ్వులో ఒక అమాయకత్వం కనిపిస్తుంది. కానీ యాక్షన్ మొదలుపెడితే మాత్రం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. తెలుగు వెండితెరపై ‘డార్లింగ్’ అని పిలిపించుకునే ఆ హీరో కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.

అయితే ఒక సినిమా మాత్రం ఆయనను కేవలం ఒక మాస్ హీరోగానే కాకుండా, క్లాస్ ప్రేక్షకులకు కూడా దగ్గర చేసింది. రొటీన్ ఫ్యాక్షనిజం కథలకు భిన్నంగా ‘ప్రేమతో గెలవడం’ అనే పాయింట్ తో వచ్చిన ఆ సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ సినిమాలో ఆ హీరో వేసిన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి, ఆయన వాడిన బుల్లెట్ బైక్ వరకు అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే రోజున థియేటర్లలో ఒక విధ్వంసం మొదలైంది. ప్రభాస్ ను ఒక పవర్ ఫుల్ బాక్సాఫీస్ కింగ్ గా నిలబెట్టిన ఆ సినిమా విశేషాలు మరోసారి గుర్తుచేసుకుందాం..
కొరటాల మేకింగ్..
రచయితగా ఎన్నో హిట్ సినిమాలకు పనిచేసిన కొరటాల శివ.. దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రభాస్ కు ఈ కథ వినిపించారు. 2013 ఫిబ్రవరి 8న విడుదలైన ‘మిర్చి’ సినిమాతో కొరటాల శివ దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ప్రభాస్ ఇమేజ్ ను పూర్తిగా మార్చేశారు. ఫ్యాక్షన్ గొడవలతో రక్తం పారే పల్లెటూరి నేపథ్యానికి ‘ప్రేమ’ను జోడించి ఆయన తీసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. “వీలైతే ప్రేమిద్దాం డార్లింగ్.. పోయేదేముంది.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు” అనే డైలాగ్ ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత పాపులర్ డైలాగ్స్ లో ఒకటిగా నిలిచిపోయింది.
‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ లుక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటి వరకు మాస్ సినిమాల్లో కాస్త రఫ్ గా కనిపించిన ప్రభాస్.. ఇందులో చాలా స్టైలిష్ గా, హ్యాండ్సమ్ గా కనిపించి ఫిదా చేశారు. ముఖ్యంగా ఫార్మల్ షర్ట్స్, జీన్స్ తో ఆయన చేసిన మేకోవర్ యూత్ లో ఒక ట్రెండ్ గా మారింది. అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రభాస్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. తండ్రీకొడుకుల అనుబంధం, స్నేహం, ప్రేమ.. ఇలా అన్ని అంశాలను సమపాళ్లలో కలిపి ప్రభాస్ అద్భుతంగా పండించారు.
ఈ సినిమా ఘనవిజయంలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు కీలక పాత్ర పోషించాయి. టైటిల్ సాంగ్ ‘మిర్చి మిర్చి మిర్చిలాంటి కుర్రాడే’ నుంచి ‘కత్తిలాంటి కుర్రాడు’, ‘పండగలా దిగివచ్చావు’ వంటి పాటలు నేటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రభాస్ ఎలివేషన్ సీన్లకు ప్రాణం పోసింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి అప్పట్లో ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
బాహుబలికి బాటలు:
‘మిర్చి’ సినిమా సాధించిన సక్సెస్ ప్రభాస్ లో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ సినిమా తర్వాతే రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ లాంటి భారీ ప్రాజెక్టు పట్టాలెక్కింది. మిర్చి ఇచ్చిన జోష్ తోనే ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారని చెప్పవచ్చు. నేటికీ ప్రభాస్ ఫ్యాన్స్ కు మిర్చి ఒక స్పెషల్ ఫిల్మ్. సోషల్ మీడియాలో ఈ సినిమా 13 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు రకరకాల పోస్టర్లు, వీడియోలతో సందడి చేస్తున్నారు. సినిమా వచ్చి 13 ఏళ్లైనా, ఇప్పటికీ టెలివిజన్ లో వస్తే ఛానల్ మార్చకుండా చూసే క్రేజ్ ఈ సినిమా సొంతం. ప్రభాస్ ని ఒక కంప్లీట్ మాస్ అండ్ క్లాస్ హీరోగా నిలబెట్టిన ఘనత ‘మిర్చి’దే అనడంలో సందేహం లేదు.
