Telangana: కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..
ప్రేమ వివాహం చేసుకున్నారన్న కోపంతో కట్టుకున్న వాడినో లేదా తమ కుమార్తెనే తల్లిదండ్రులు దారుణంగా హింసించడం, లేదా హత్య చేసిన ఘటనలు తరచూ మనం చూస్తేనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. తన కుమార్తె ఓ దళిత యువకుడిని ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో యువతి కుటుంబ సభ్యులు ఏకంగా యువకుడి ఇంటినే తగలెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తమ కుమార్తె వేరే కులానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుందన్న కోపంతో యువతి తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇంటికి నిప్పుపెట్టిన ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి..ఈ దారుణానికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమారం మండలం దాంపూర్ గ్రామానికి చెందిన దళిత యువకుడు జంగపెల్లి సులేమాన్ అనే యువకుడు అదే గ్రామంలో నివాసం ఉంటున్న బీసీ కులానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ గత కొన్నాళ్లు ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవలే ఇద్దరూ కరీంనగర్‌లో వివాహం కూడా చేసుకున్నారు.
అయితే తమ కుమార్తె తమకు తెలియకుండా వేరే కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందని కోపం పెంచుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో యువకుడి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌లో యువకుడి ఇంటిపై పోసి నిప్పటించారు. ఈ ప్రమాదంలో యువకుడి ఇళ్లు మొత్తం మంటల్లో కాలిపోయింది. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
ఇక విషయం తెలుసుకున్న యువకుడి తండ్రి ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ప్రమాదం కారణంగా సుమారు రూ.5లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన యువతి తండ్రితో పాటు సోదరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
