Weight Loss: బస్సు, మెట్రోలో ప్రయాణించండి.. బరువు తగ్గండి.. ఎలా అంటే?
రోజురోజుకూ సొంతవాహనాల్లో రవాణా చేస్తున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ జామ్, కాలుష్యంతో పాటు జనాల్లో అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జనాల్లో శారీరక శ్రమ లేకపోవడం కారణంగా ఊబకాయం, షుగర్ వంటి వ్యాధుల భారీన పడుతున్నారు. ఈ క్రమంలో జనాలు ప్రజారవాణాను వినియోగించడం వల్ల ఈసమస్యల నుంచి బయటపడడంతో పాటు బరువును కూడా తగ్గించుకోవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూరోజుకూ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వర్క్ ప్రెజర్, శారీరక శ్రమ లేకపోవడం కారణంగా నగరవాసులు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటిలో ముఖ్యంగా వెన్నునొప్పి, ఊబకాయం వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. అధ్యయనాల ప్రకారం చూసుకుంటే.. నగరంలో నివసిస్తున్న జనాల్లో దశాబ్ధ కాలంలో సుమారు ఈ సమస్యలు 80శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు సొంతవాహనాలకు బదులు ప్రజా రవాణా సదుపాయాలను ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ అధ్యయనాలు ప్రకారం.. మన ఇంటి నుంచి బస్సు లేదా మెట్రో స్టేషన్ వరకు నడవడం, అలాగే దిగాక అక్కడి నుంచి గమ్యస్థానానికి నడుస్తూ వెల్లడం కారణంగా రోజుకూ సుమారు 100 నుంచి 300 క్యాలరీస్ మేర బర్న్ చేయొచ్చని దీని వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే బస్సు, లేదా మెట్రోలో నిలబడి ప్రయాణం చేయడం ద్వారా సుమారు 50 క్యాలరీల వరకు కరిగించవచ్చని చెబుతున్నారు.
భారతదేశంలో నిర్వహించిన క్రాస్ సెక్షనల్ స్టడీ-2013 ప్రకారం.. ‘అసోసియేషన్ బిట్వీన్ యాక్టివ్ ట్రావెల్ టు వర్క్ అండ్ ఓవర్‌వెయిట్, డయాబెటిస్ అనే అంశం పై చేసిన స్టడీలో సొంత వాహానాల్లో ప్రయాణించే వారిలో ఊబకాయం 50% ఉంటే.. ప్రజారవాణా ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకునే ప్రజల్లో 37.6 శాతమే ఉన్నట్టు పరిశోదకులు పేర్కొన్నారు. నడవడం, సైకిలింగ్ చేయడం, ప్రజారవాణాను ఉపయోగించడం కారణంగా ఊబకాయం, షుగర్ వంటి సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
