AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allipuram: నిజాం రజాకార్ల అరాచకాలకు సజీవ సాక్ష్యం అల్లీపురం.. సాయుధ పోరాట చరిత్ర పుటల్లో నిలిచిన గ్రామం..

యావత్‌ భారతదేశం స్వేచ్ఛ వాయువులు పీల్చుతున్న వేళ తెలంగాణ రాజ్యం నిజాం కబంద హస్తాల్లో నలిగిపోయింది. రజాకార్ల దురాగతాలకు అంతే లేదు. మారణహోమాలు, మానభంగాలు, గృహదహనాలు, లూటీలు - నిత్యకృత్యంగా సాగింది.

Allipuram: నిజాం రజాకార్ల అరాచకాలకు సజీవ సాక్ష్యం అల్లీపురం.. సాయుధ పోరాట చరిత్ర పుటల్లో నిలిచిన గ్రామం..
Allinagaram
Shaik Madar Saheb
|

Updated on: Sep 13, 2022 | 7:58 PM

Share

Telangana Liberation Day: నిజామ్‌ నవాబు పరిపాలన చివరి రోజుల్లో ప్రజలు నిత్యనరకం అనుభవించారు. యావత్‌ భారతదేశం స్వేచ్ఛ వాయువులు పీల్చుతున్న వేళ తెలంగాణ రాజ్యం నిజాం కబంద హస్తాల్లో నలిగిపోయింది. రజాకార్ల దురాగతాలకు అంతే లేదు. మారణహోమాలు, మానభంగాలు, గృహదహనాలు, లూటీలు – నిత్యకృత్యంగా సాగింది. జనాల్ని భయంపెట్టేందుకు వాళ్లను చంపడమే కాదు, అందర్ని ఒకే చితిపై పేర్చి నిప్పంటించిన కిరాతకులు రజాకార్లు. తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిల్చిన ఆ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర పుటల్లో నిలిచిన అల్లీపురం గ్రామంపై టీవీ9 స్పెషల్‌ స్టోరీ.

తెలంగాణ సాయుధ పోరాటంలో మధిర ప్రాంతవాసులు అకుంటిత దీక్ష, ధైర్యసాహసాలతో రజాకార్లకు ఎదురొడ్డి పోరాడారు. నల్లమల గిరిప్రసాద్, సర్దార్ జమలాపురం కేశవరావు, బొమ్మకంటి సత్యనారాయణ వంటివారి నాయకత్వంలో ఉధృతంగా సాగింది నాటి పోరాటం. దేశమంతా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న సమయంలో నిజామ్‌ ఏలుబడిలో ఉన్న ప్రాంతంలోని ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాసపడిన పరిస్థితి.

ఊళ్లకు ఊళ్లు తగులబెట్టారు రజాకార్లు. ఆస్తుల ధ్వంసం, లూటీలు యధేచ్చగా సాగాయి. ప్రజలను చిత్రహింసలకు గురి చేసి ఊచకోత కోశారు. అలాంటి సమయంలో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపిన అల్లీనగరం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. మధిర ప్రాంతంలో నాడు కమ్యునిస్టులు అనేక క్యాంపులు నిర్వహించారు. ఈ సమయంలో మధిర ప్రాంతంలో ఎదురొడ్డి పోరాడుతున్న గ్రామాలపై రజాకార్లు దమనకాండకు పాల్పడ్డారు. అల్లీనగరం గ్రామాన్ని పూర్తిగా తగులబెట్టారు.

ఇవి కూడా చదవండి

అల్లీనగరం పక్కనే ఉన్న మడుపల్లి, మీనవోలు గ్రామాల్లోని ఇళ్లు ధ్వంసం చేశారు. ఆస్తులు దోచుకున్నారు. దిక్కుతోచని స్థితిలో గ్రామ ప్రజలు పారిపోయి ఆంధ్ర సరిహద్దు మాచినేనిపాలెం వెళ్లి తలదాచుకున్నారు. రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు మధిర పరిసర ప్రాంతాల్లో నాయకులు అనేక చోట్ల క్యాంపులు నిర్వహించారు. వారిని తిప్పికొట్టేందుకు అనక గ్రామాలను ఏకం చేశారు.

మధిర తాలూకా సరిహద్దు గ్రామం మీనవోలు. ఆ గ్రామానికి బ్రిటీష్‌ సార్జంట్‌ నాయకత్వంలో రజాకార్లు కొందరు కోడి పిల్లల కోసం వచ్చారు. రైఫిల్‌, రివాల్వర్‌ ఉన్నాయి ఆ బ్రిటీష్‌ పోలీసు అధికారి దగ్గర. వాళ్లను చూసిన గ్రామస్తులు ఎదురు తిరిగారు. ఆగ్రహంతో వెంటపడిన ప్రజలను చూసి పరుగులు పెడుతూ వాళ్లు జరిపిన కాల్పుల్లో మీనవోలు గ్రామానికి చెందిన ఏడుగురు మంది మరణించారు. దీంతో మరింత ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు బ్రిటీష్‌ సార్జంట్‌ను పట్టుకొని నరికిచంపారు.

మధిర తాలూకా అల్లీనగరం, గోవిందాపురం, మడుపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాలు ఆంధ్ర మహాసభకు బలమైన కేంద్రాలు. పోరాటపటిమ కలిగిన ఈ గ్రామాల్లో రజాకార్లు దమనకాండ సృష్టించారు. ఈ గ్రామాలు నుంచి అనేకమంది కమ్యూనిస్టు దళాల్లో చేరి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

అల్లీనగరానికి సమీపంలో ఉన్న మోటమర్రి గ్రామంలోని మిలిటరీ కేంద్రంపై గెరిల్లా దాడి జరిపి ఆయుధాలు స్వాధీనం చేసుకున్న తర్వాత రజాకార్లు, సైన్యం అల్లీనగరం గ్రామం పై దాడి చేసి మొత్తం ఊరిని తగులబెట్టారు. గ్రామస్తులను భయభ్రాంతులు చేసేందుకు కొంత మందిని చంపారు. అంతే కాదు ఊరిలోని ప్రతీ ఒక్కరిని కట్టెలు తెమ్మని చెప్పి వాళ్ల కళ్ల ముందు చితిపేర్చి ఏడుగిరిని ఒకే చితిపై పెట్టి తగులబెట్టారు. నాటి ఘటనలో చనిపోయిన వారి పేరిట ఏర్పాటు చేసిన స్థూపాలు ఇప్పటికీ గ్రామంలో కనిపిస్తూనే ఉన్నాయి.

ఈ ఘటనల తర్వాత ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది. కమ్యూనిస్టు నేతలు పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం, నల్లమల గిరిప్రసాద్ వంటి నేతలు క్యాంపులు ఏర్పాటు చేసి గ్రామాలను సందర్శించి ఉద్యమానికి మరింత ఉత్తేజం తెచ్చే ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికీ ఆనాటి సంఘటనలు కళ్ళకు కట్టినట్లు ఉన్నాయంటారు గ్రామస్తులు. వారి వారసులు ఆ ఉద్యమ జ్ఞాపకాలు తలుచుకుంటూ సాయుధ పోరాట స్పూర్తిని నింపుకొని ముందుకు సాగుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..