Kerala: ఆ సమయంలో పుట్టిన శునకాలతో యమ డేంజర్.. పెరుగుతున్న కుక్కకాటు మరణాలు.. చంపేందుకు..
వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి బెడదను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దూకుడు, రేబిస్ సోకిన వీధి కుక్కలను చంపడానికి
Dog rabies virus: కేరళలో కుక్కకాట్లు పెరుగుతున్నాయి. నాలుగు నెలల్లో వీధి కుక్కల కాటుతో రేబిస్ వ్యాధి సోకి దాదాపు 8 మందిపైగా మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రాష్ట్రమంతటా కుక్క కాట్లు పెరుగుతుండటంతో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి బెడదను అదుపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దూకుడు, రేబిస్ సోకిన వీధి కుక్కలను చంపడానికి కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టు అనుమతిని కోరనున్నట్లు మంత్రి ఎంబీ రాజేష్ సోమవారం వెల్లడించారు. దీంతోపాటు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 వరకు నెలరోజుల పాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. తిరువనంతపురంలో కుక్కల కాటుపై అధికారులతో సమీక్షించిన మంత్రి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం వీధికుక్కలను చంపే అవకాశం లేకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం -1960, యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) రూల్స్ -2001, వీధికుక్కలను చంపడం లేదా అవిటిగా మార్చాడం లాంటి వాటిని నిషేధించాయి. అంతకుముందు 2016లో కేరళలోని విజిలెంట్ గ్రూపులను సుప్రీం కోర్టు హెచ్చరించింది. కుక్కలను కాల్చివేసేందుకు తమను తాము అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నారని, ప్రజలకు చౌకగా ఎయిర్ గన్‌లను పంపిణీ చేసి అదే చేయమని వారిని ప్రోత్సహించారంటూ మండిపడింది. జంతు జీవితం కంటే మానవ జీవితం గొప్పది కాదని సుప్రీం కోర్టు అప్పట్లో వ్యాఖ్యానించింది. అయినప్పటికీ, మునిసిపల్ చట్టాల ప్రకారం నిర్దేశించిన పద్ధతులను ఉపయోగించి ప్రమాదకరమైన కుక్కలను నిర్మూలించవచ్చని కోర్టు పేర్కొంది. అయితే.. ఇప్పుడు కుక్కలను చంపేందుకు అనుమతిస్తుందా..? లేదా అనేది వేచి చూడాలి.. కాగా.. మరణించిన ఏడుగురిలో ఒకరు తప్ప మిగతా వారంతా రేబిస్ టీకాలు వేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
దూకుడుగా లాక్‌డౌన్ సమయంలో పుట్టిన కుక్కలు..
కాగా.. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పుట్టిన కుక్కలు మరింత దూకుడుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవి మనుషులతో కలిసిపోకుండా ఉండటం వల్లనే చాలా దూకుడుగా మారి రాష్ట్రంలో ఇబ్బందులను సృష్టిస్తున్నాయంటున్నారు. తీవ్రమైన వీధికుక్కల బెడద నివారణపై చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో పశుసంవర్ధక శాఖ, వెటర్నరీ యూనివర్సిటీల నిపుణులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వందలాది వీధికుక్కలు పుట్టాయి. బహిరంగ ప్రదేశాల్లో విసిరిన ఆహారాన్ని తింటూ పెరిగాయి. అయితే.. అవి అప్పటివరకు భూభాగాలను సృష్టించుకున్నాయని.. వాటి ప్రాంతాల్లోకి ప్రవేశించే వారిపై దాడి చేసే ప్రవర్తన ఈ కుక్కలలో ఎక్కువగా ఉందని నిపుణులు సూచించారు. ఇంకా బైక్‌ల వెంట పడటం, ఉన్నట్టుండి మనుషులపై దాడి చేయడం లాంటి దూకుడు స్వభావంతో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే.. దాడి చేస్తున్న కుక్కల్లో రేబిస్ లక్షణాలే ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి