AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila – TRS : నాపై కామెంట్స్‌‌ చేసినవారిని వదిలేస్తారా?.. స్పీకర్ పోచారంకు షర్మిల విజ్ఞప్తి..

రాజకీయాల్లో భాష పలు రకాలు. రెచ్చగొట్టే ముచ్చట్లు కొన్నయితే... అవతలి వ్యక్తిని డీమోరలైజ్‌ చేసేవి మరికొన్ని. తప్పదనుకున్న చోట తప్పదేమో... కానీ మాట్టాడిన చోటల్లా అలాంటి వ్యాఖ్యలే చేస్తే.. మంటలు రేగుతాయి. హద్దుదాటితే సెగలు పుట్టుకొస్తాయ్‌. ఇప్పుడు అలాంటి మంగళారం ముచ్చట్లే.. తెలంగాణ పాలిటిక్స్‌లో పొగలు కక్కేలా చేస్తున్నాయ్‌.

YS Sharmila - TRS : నాపై కామెంట్స్‌‌ చేసినవారిని వదిలేస్తారా?.. స్పీకర్ పోచారంకు షర్మిల విజ్ఞప్తి..
Ys Sharmila Responds
Sanjay Kasula
|

Updated on: Sep 14, 2022 | 7:07 AM

Share

గతంలో మాదిరి అధికార పార్టీ వైపు నుంచి కౌంటర్లు మాత్రం రాలేదు. దానికి బదులుగా, కంప్లయింట్లు మొదలయ్యాయి. అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదులిచ్చే దాకా వెళ్లింది వ్యవహారం. అంతేకాదు, మంత్రి సైతం డీజీపీకి ఫిర్యాదు చేయడంతో పరిస్థితి తీవ్రత ఏపాటిదో అర్థం మవుతోంది.  వైఎస్ఆర్టీపీ( YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై టీఆర్ఎస్(TRS) ఎమ్మెల్యేలు స్పీకర్‌కు కంప్లైంట్ చేయడం కలకలం రేపింది. అనుచిత వ్యాఖ్యలు చేస్తోన్న షర్మిలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో స్పీకర్‌ స్పందించారు. స్పీకర్‌ రియాక్షన్‌తో షర్మిల కూడా రియాక్టయ్యారు. తనపై చర్యలు తీసుకునే ముందు ఒక తల్లిని అవమానించిన మంత్రి నిరంజన్‌రెడ్డిపై యాక్షన్‌ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రచ్చకు కారణం ఇదే..

ప్రజాప్రస్థానం పేరిట,, తెలంగాణ మొత్తం చుట్టేందుకు పాదయాత్రగా బయల్దేరిన వైఎస్‌ఆర్‌ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. ఏ ఇలాఖాకు వెళితే ఆ ఇలాఖాలో.. స్థానిక అధికార పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అధికార పార్టీ తీరును కడిగిపారేస్తున్నారు రాజన్నబిడ్డ. అయితే, ఇప్పటి దాకా ఆమె విమర్శల వేడి పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, గతవారం ఆమె పాదయాత్ర వనపర్తి జిల్లాలో ప్రవేశించింది మొదలు.. హీట్‌ మొదలైంది. స్థానిక నేత, రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ ఆమె చేసిన విమర్శలు తీవ్ర స్థాయిలో రచ్చకు కారణమవుతున్నాయి. అంతేకాదు, రాష్ట్ర ప్రభుత్వంపైనా, కేసీఆర్‌పై ఆమె చేస్తున్న విమర్శలు రాజకీయంగా మంటలు పుట్టించాయి. ఇదేం భాష, ఇదేం తీరు అంటూ గులాబీ దళం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఇంతటితో ఆగని వైఎస్‌ షర్మిల…మంత్రిని మరింత స్ట్రాంగ్‌ కామెంట్స్‌తోనే టార్గెట్‌ చేశారు. గతంలో తనపై, ఆయన చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుని మరీ.. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు అసెంబ్లీని తాకాయి.

కౌంటర్లు.. రివర్స్ కౌంటర్లు..

షర్మిల చేసిన ఈ ఒక్క కామెంట్‌.. రచ్చ రేపుతోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. షర్మిలపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అటు, నిరంజన్‌ రెడ్డి కూడా డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. షర్మిల విమర్శలకు అదే స్థాయిలో కౌంటరిచ్చిన నిరంజన్‌ రెడ్డి.. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోబోమనీ.. ఒక్కమాటకు వందమాటలతో సమాధానం చెప్పగలమని హెచ్చరించారు. ఆత్మ‌విశ్వాసంతో చీల్చి చెండాడుతామ‌ంటూ స్ట్రాంగ్‌ వార్నింగే ఇచ్చారు మంత్రి. రాజన్న బిడ్డవైతే మునుగోడు ఉప ఎన్నికలో పోటిచేసి… సత్తా ఏంటో నిరూపించుకో అంటూ.. షర్మిలకు సవాల్‌ విసిరారు. తాను 22 ఏళ్లు తెలంగాణ ఉద్యమ జెండా మోశానని.. రాష్ట్రం ఏర్పడ్డాక వనపర్తి జిల్లాలో లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాననీ కౌంటరిచ్చారు నిరంజన్‌.

గొడవకు అసలు కారణం ఇదే..

షర్మిల వర్సెస్‌ నిరంజన్‌రెడ్డి ఎపిసోడ్‌ కొత్తదేం కాదు. చాన్నాళ్ల క్రితమే ఈ ఇద్దరి మధ్యా లడాయి మొదలైంది. ఉద్యోగ నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. చాన్నాళ్ల క్రితమే ప్రతీ మంగళవారం ఒక్కో ప్రాంతంలో నిరసన దీక్షలకు దిగారు షర్మిల. ఆ సమయంలో ఆమెను ఉద్దేశించి.. మంత్రి నిరంజన్‌ చేసిన వ్యాఖ్యలు ఈ గొడవకు బీజం వేశాయి. మంత్రి ఈ వ్యాఖ్యలు చేసి చాన్నాళ్లయ్యింది. వాటిపై అప్పుడు షర్మిల పెద్దగా స్పందించలేదు. తన వ్యాఖ్యలపై మంత్రిగారు అపాలజీ కూడా చెప్పేశారు గానీ.. షర్మిల నుంచి ఎక్స్‌పెక్ట్‌ చేసినంత రియాక్షన్‌ మాత్రం రాలేదు.

కోపాన్ని దిగమింగుకున్నట్టే కనిపించి..

అయితే, మంత్రి నిరంజన్‌ రెడ్డి చేసిన కామెంట్స్‌ను.. రాజన్న బిడ్డ మర్చిపోలేదన్న విషయం తాజా ఎపిసోడ్‌తో బహిర్గతమైంది. అప్పుడెప్పుడో మొదలైన ప్రజాప్రస్థానం పాదయాత్ర.. వనపర్తి ఏరియాలోకి ఎంటరయ్యే దాకా.. తన కోపాన్ని ఆమె దిగమింగుకున్నట్టే కనిపిస్తోంది. మంత్రి సొంత ఇలాఖాలోకి ఎంటరయ్యాక… ఇవ్వాల్సిన కౌంటర్లు ఈ రేంజ్‌లో ఇచ్చి పడేశారన్న మాట.

షర్మిల విషయంలో కౌంటర్లు ఇచ్చే సంప్రదాయాన్ని పక్కన పెట్టి.. కంప్లయింట్‌ కల్చర్‌కు తెరలేపింది అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ. ఆమెపై నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. షర్మిలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారనీ… నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. నేతల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని ఆక్షేపించారు. ప్రివిలేజ్ నిబంధనల ప్రకారం షర్మిలపై చర్యలు తీసుకోవాలని కోరారు

కంప్లయింట్లకూ బెదిరేది లేదంటూ..

అయితే, షర్మిల మాత్రం.. ఎలాంటి కంప్లయింట్లకూ బెదిరేది లేదంటున్నారు. తన మీద కాదు.. ముందు నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకోండంటూ.. స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తనపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై ట్విట్టర్‌ వేదికగా స్పందించిన షర్మిల.. ఒక మహిళను, మరదలంటూ కించపరిచి , తన తోటివారిని మంత్రి నిరంజన్ రెడ్డి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు స్పీకర్ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సంస్కారహీనుడైన నిరంజన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.

స్పీకర్‌ ఎవరి పక్షం వహిస్తారు? షర్మిలను ప్రివిలేజ్‌ కమిటీ ముందుకు రప్పిస్తారా? షర్మిలపై ప్రివిలేజ్‌ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారా? లేక మందలించి వదిలేస్తారా? అన్నది పొలిటికల్‌గా ఆసక్తి రేపుతున్న అంశం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం