AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎన్నికల్లో గెలవగానే ఎలుగుబంటిగా మారిపోయిన సర్పంచ్.. ఎందుకంటే..?

గెలిచే వరకు ఓ బాధ గెలిచాక ఓ బాధ అన్నట్టుగా మారింది ఆ సర్పంచ్ పరిస్థితి. ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు నేరుగా ఆ సర్పంచే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే కథనం లోపలికి వెళ్లాల్సిందే .. ..

Telangana: ఎన్నికల్లో గెలవగానే ఎలుగుబంటిగా మారిపోయిన సర్పంచ్.. ఎందుకంటే..?
Bear Costume
Naresh Gollana
| Edited By: |

Updated on: Dec 19, 2025 | 9:43 PM

Share

సర్పంచ్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లాలో చాలా చోట్ల కోతుల బెడదను తొలగిస్తామని హామీ ఇచ్చారు కొందరు అభ్యర్థులు. ఎన్నికల్లో గెలిచిన మొదటి రోజే కోతుల ఊరి నుంచి వెళ్లగొట్టడం పక్కా అని కొందరు అయితే బాండు పేపర్ల మీదే రాసిచ్చారు. దీంతో కొందరు గెలిచిన సర్పంచ్‌లు యాక్షన్‌లోకి దిగిపోయారు. చెప్పినట్టుగానే నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కోతులను వెళ్లగొట్టేందుకు వినూత్న‌ ప్రయత్నం చేశాడు.

మూడేళ్లుగా కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల కష్టాలు తీర్చేందుకు నేరుగా ఆయనే రంగంలోకి దిగాడు. కోతులను తరిమికొట్టేందుకు గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. గత ఏడాది గ్రామమంతా ఏకమై చందాలు వేసుకుని మరీ బోనులు ఏర్పాటు చేశారు. కొన్ని కోతులు పడ్డా.. పూర్తిస్థాయిలో ఆ ఇబ్బంది తొలగలేదు. దీంతో ఈ కోతుల బెడదను తప్పించడమే.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రధాన డిమాండ్‌గా తెర మీద ఉంచారు గ్రామస్థులు. ఎవరు గెలిచినా కోతులను వెంటనే వెళ్లగొట్టాలని ఆ ఒక్కటే మేము కోరకునేది అంటూ స్పష్టం చేశారు. అందుకు సరే అని ఊ కొట్టాడు అభ్యర్థి కుమ్మరి రంజిత్. విజయం సాధించడంతో ఆయన కోతులను తరిమేందుకు ఏకంగా ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామంలో తిరిగాడు. అలా ఎలుగుబంటి కనిపించడంతో కోతులు పరారయ్యాయి. ఊరంతా తిరుగుతూ గల్లీ గల్లీలోని కోతులను ఊరి నుంచి తరిమేశాడు. ఇలా వినూత్న ఆలోచనతో కోతుల బెడదను తగ్గించిన యువ సర్పంచ్‌ను గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు. అయితే మళ్లీ కోతులు వస్తే ఈ పాచిక పారకపోతే మరో కొత్త అవతారం ఎత్తేందుకు సైతం సిద్దమంటున్నాడు ఈ నయా సర్పంచ్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..