Prakasam district: ఓర్నాయనో ఒంటరిగా ఉంటున్నారా… హంతకులున్నారు జాగ్రత్త.
ఒంటరిగా ఉంటున్న వృద్దుల్ని టార్గెట్ చేస్తోంది ఎవరు... ఇటీవల టంగుటూరులో ఒంటరిగా ఉంటున్న వ్యక్తి హత్య ఘటన మరవకముందే, తాజాగా గోగినేనివారిపాలెంలో ఒంటరిగా ఉంటున్న మరో మహిళను హత్య చేశారు దుండగులు... రెండు హత్యలు ఒకరే చేశారా... లేదా యాధృచ్చకంగా చోరీల కోసం వచ్చి వేరువేరు దొంగలు హత్యలు చేస్తున్నారా... లేక హత్యల వెనుక ఉన్మాదం ఏమైనా ఉందా...? ఇప్పుడు ఇవే ప్రకాశం జిల్లా పోలీసులను తీవ్రంగా కలచివేస్తున్న ఘటనలు... రెండు రోజుల వ్యవధిలో ప్రకాశం జిల్లాలో మిస్టరీగా మారిన రెండు వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి.

ప్రకాశం జిల్లా పొదిలి మండలం గోగినేనివారిపాలెం ఎస్‌సి కాలనీలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు 50 పులి బుల్లెమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది… ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు… ముగ్గురికీ పెళ్లిళ్లు అయ్యి వేర్వేరు ప్రాంతాల్లో కాపురం ఉంటున్నారు… ఇటీవల భర్త చనిపోవడంతో పులి బుల్లెమ్మ ఒంటరిగా ఉంటోంది… కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది… ఎప్పటిలాగే గురువారం సాయంత్రం కూలిపనుల అనంతరం ఇంటికి వచ్చింది… ఆ రోజు రాత్రి ఇంట్లో నిద్రపోయింది… శుక్రవారం తెల్లవారుజామున ఆమె ఇంకా బయటకు రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి గమనించడంతో మంచంపై బుల్లెమ్మ విగతజీవిగా పడిఉంది… వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు… ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బుల్లెమ్మ మృతదేహాన్ని పరిశీలించారు… మెడపై గాయాలున్నట్టు గుర్తించారు… ఎవరో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేసేందుకు ప్రయత్నించి ప్రతిఘటించిన బుల్లెమ్మను హతమార్చారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… బుల్లెమ్మది హత్యగా తేలడంతో హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గురువారం టంగుటూరులో మరో హత్య..
మరోవైపు ప్రకాశంజిల్లా టంగుటూరులోని పాతవడ్డిపాలెంలో దారుణం చోటు చేసుకుంది… స్థానికంగా హెడ్‌డిఎఫ్‌సి బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్న 55 ఏళ్ల వెంకటరమణయ్యను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు… ఈనెల 16వ తేది రాత్రి జరిగినట్టు భావిస్తున్న ఈ దారుణ హత్య 18వ తేది ఉదయం వెలుగులోకి వచ్చింది… సమాచారం అందుకున్న టంగుటూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
టంగుటూరుకు చెందిన వెంకటరమణయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు… స్థానికంగా ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు… భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది… కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగరీత్యా అక్కడే నివాసం ఉంటున్నాడు… ఈ పరిస్థితుల్లో టంగుటూరులోని పాతవడ్డిపాలెంలో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు వెంకటరమణయ్య… కొడుకు అప్పుడప్పుడూ ఫోన్ చేసి క్షేమసమాచారాలు తెలుసుకుంటుంటాడు… ఈ నేపధ్యంలో ఈనెల 17వ రాత్రి వెంకటరమణయ్యకు కొడుకు ఫోన్ చేశాడు… ఫోన్ మోగుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు… మళ్లీ 18వ తేది ఉదయం ఉంచి వరుసగా ఫోన్ చేస్తున్నా తండ్రి లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి గ్రామంలోని తన స్నేహితులకు ఫోన్ చేసి ఒకసారి చూసిరమ్మని పంపించాడు… తీరా వచ్చి చూస్తే వెంకటరమణయ్య రక్తపు మడుగులో పడి ఉన్నాడు… వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు… పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు… వెంకటరమణ తల, గొంతుపై కత్తి గాయాలను గుర్తించి హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఒంగోలు డిఎస్‌పి రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు.
కలకలం రేపుతున్న వరుస హత్యలు…
ప్రకాశంజిల్లాలో రెండు రోజుల వ్యవధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒంటరిగా ఉంటున్న ఇద్దరు వృద్దులను హత్య చేయడం వెనుక దొంగల హస్తం ఉందా… లేక మరేదైనా కారణాలు ఉన్నాయా… అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… ఒంటరిగా ఉన్న వృద్దులనే టార్గెట్ చేసుకోవడం వెనుక ఉన్మాదుల ప్రమేయం ఉందా అన్నకోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు… ఏదిఏమైనా ఒంటరి వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




