AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: ఫార్ములా-ఈ రేస్‌ కేసులో దూకుడు.. ఓవైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ.. కేటీఆర్‌ విచారణకు హాజరవుతారా…?

ఫార్ములా–ఈ రేసు వ్యవహారంలో మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ, ఈడీ దూకుడు పెంచింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సమన్లు జారీ చేసింది. జనవరి 6వ తేదీన హాజరు కావాలంటూ ఏసీబీ, జనవరి 7వ తేదీన విచారణకు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ఆదేశించింది. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్‌ రెడ్డిలకు కూడా సమన్లు జారీ చేసింది.

KTR: ఫార్ములా-ఈ రేస్‌ కేసులో దూకుడు.. ఓవైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ.. కేటీఆర్‌ విచారణకు హాజరవుతారా...?
Ktr In Formula E Race Case
Balaraju Goud
|

Updated on: Jan 04, 2025 | 7:57 AM

Share

కమ్ముకొస్తున్న ఈ-రేసు కేసు.. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఎటూ కదలనివ్వకుండా చెక్ పెట్టేస్తోంది. ఒకవైపు నుంచి ఏసీబీ.. మరోవైపు నుంచి ఈడీ తరుముకొస్తున్నాయి. అరెస్టుకు అరడుగు దూరంలో నిలబడ్డారా అనే సందేహాల నడుమ మొన్న క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు కాస్త రిలీఫ్‌ ఇవ్వగా… తాజాగా విచారణకు రావాలంటూ ఏసీబీ నోటీసులివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆ మర్నాడే ఈడీ విచారణ ఉండనే ఉంది. దీంతో ఇప్పుడందరి చూపు ఫార్ములా ఈ-రేస్‌ కేసు వైపే. మరి కేటీఆర్‌ విచారణకు హాజరవుతారా…? ఆయన లీగల్‌ టీమ్‌ ఏమంటోంది…? అన్నది ఇప్పుడు హట్‌టాపిక్‌గా మారింది.

తెలంగాణలో ఫార్ములా ఈ-రేస్‌ కేసు సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చుట్టూ ఎంక్వైరీలు మోహరిస్తున్నాయి. ఓవైపు ఏసీబీ.. మరోవైపు ఈడీ దూకుడుమీదున్నాయి. విచారణ గడువులు దూసుకొస్తున్నాయి. ఒక్కరోజు వ్యవధిలోనే ఏసీబీ, ఈడీ విచారణకు రావాలంటూ నోటీసులివ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసులతో కేటీఆర్‌ ఫ్యూచర్‌పై సస్పెన్స్ కొనసాగుతుండటం చర్చనీయాంశమైంది.

తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మొన్ననే వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్‌ చేసింది తెలంగాణ హైకోర్టు. ఇంతలోనే కేటీఆర్‌ను ఏ1గా చేర్చిన ఏసీబీ… విచారణకు రావాలంటూ లేటెస్ట్‌గా నోటీసులివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈనెల ఆరో తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది.

ప్రాథమిక విచారణ జరపకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్న కేటీఆర్‌ వాదన కూడా అర్థరహితమంటోంది ఏసీబీ. ఫార్ములా-ఈ కేసు వెనుక రాజకీయ కక్షసాధింపులున్నాయన్న ఆరోపణల్ని కూడా కొట్టిపారేస్తోంది. అటు.. కేటీఆర్‌పై ఫిర్యాదు చేసిన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నుంచి వాంగ్మూలం తీసుకుని సిద్ధంగా ఉంచుకుంది ఏసీబీ. విచారణకు సంబంధించిన క్వశ్చనరీని సిద్ధం చేస్తోంది.

ఇటు ఈడీ కూడా కాచుకు కూర్చింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ని ఆధారంగా చేసుకుని.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేటీఆర్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌. ఈనెల 7న అంటే… ఏసీబీ విచారణకు పిలిచిన తర్వాత రోజే ఈడీ విచారణకు కేటీఆర్‌ హాజరుకావాల్సి ఉంటుంది. మరోవైపు ఇదే కేసులో జనవరి 2న ఐఏఎస్‌ అధికారి అరవింద్‌, జనవరి 3న HDMA రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌ BLN రెడ్డి ఈడీ విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే ఈడీ విచారణకు వారు గైర్హాజరయ్యారు. గడువు కావాలని కోరారు. దీంతో కేటీఆర్‌ విచారణ మర్నాడు బీఎల్‌ఎన్‌ రెడ్డిని, ఆ తర్వాతి రోజు అర్వింద్‌కుమార్‌ను విచారించనున్నారు ఈడీ అధికారులు.

మొత్తంగా… ఓవైపు ఏసీబీ విచారణ ఇలా స్పీడందుకోగానే.. ఈడీ కూడా సిద్ధమంటోంది. జనవరి 6న ఏసీబీ విచారణకు… ఆ తర్వాతి రోజున ఈడీ విచారణకు కేటీఆర్‌ హాజరుకావాల్సి ఉంది. మరి కేటీఆర్‌ విచారణకు హాజరవుతారా…? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అసలు కేసునే కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ వేసిన నేపథ్యంలో… ఆ రిజల్ట్‌ వచ్చాకే విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌ లీగల్‌ టీమ్‌ చెబుతున్నట్లు పొలిటికల్‌ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..