Telangana: వారందరికీ రూ. లక్ష.. తెలంగాణ సర్కార్ భలే ఆలోచన
సివిల్స్‌లో సత్తా చాటిన అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తోంది. సింగరేణి సంస్థ సహకారంతో ప్రతిభ కలిగిన పేద అభ్యర్థులకు వెలుగులు నింపే ప్రయత్నం చేసింది. సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్తున్న అభ్యర్థులకు ఆర్థిక సాయం చేస్తూ భరోసా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
సివిల్స్ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కులను సీఎం రేవంత్ అందించారు. 20 మంది అభ్యర్థులకు ఒక్కొకరికి లక్ష రూపాయల చెక్కును ఇచ్చారు. సింగరేణి సంస్థ నుంచి ఈ ఆర్థిక సాయం అందించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఆర్థిక సహాయం సివిల్స్ అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి అభిప్రాయపడ్డారు.
ఆర్థిక సాయం కాదు.. ప్రోత్సాహం
అత్యంత వెనుకబడిన బిహార్ నుంచి సివిల్స్‌కు అత్యధికంగా ఎంపికవుతున్నారు. బిహార్‌లో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఎక్కువ మంది సివిల్స్‌కు ఎంపికవుతున్నారని సీఎం రేవంత్ అన్నారు. అలాంటి సహకారం అందించాలనే ఆలోచనతోనే సివిల్స్ అభ్యర్థులకు ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. ఇది ఆర్ధిక సాయం కాదు. అభ్యర్థులకు అందిస్తున్న ప్రోత్సాహంగా భావించాలన్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా రాష్ట్రానికి సేవ చేయాలన్నారు.
ఏడాదిలోనే 55వేల 143 ఉద్యోగాలు ఇచ్చాం
గ్రూప్ 1 సహా అనేక ఉద్యోగాల భర్తీ చేస్తుంటే.. నిరుద్యోగులను రెచ్చగొట్టి కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55వేల 143 ఉద్యోగాలు ఇచ్చాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 563 గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. ఇన్ని ఉద్యోగాలు ఇస్తుంటే తట్టుకోలేక.. ప్రతిపక్షాలు అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. గ్రూప్ 1పై కుట్రలన్నీ ఛేదించి పరీక్షలు నిర్వహించాం. మార్చి 31 లోపు ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్.
ఎక్కువ మంది రాణించాలనే ఆలోచనతో ప్రోత్సాహం
గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసుకుంటూ వస్తోందన్నారు. సివిల్స్‌లో మన రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందన్నారు. ఏదైనా సాధించాలనే తపన, కష్టంతో కూడిన కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుందని ఈ సందర్భంగా అభ్యర్థులకు సూచించారు. ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతీ ఒక్కరూ సివిల్స్‌లో సెలెక్ట్ కావాలని ఆకాంక్షించారు.