AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Media : సోషల్ మీడియా ఎక్కువగా వాడతారా? ఫోమో జబ్బు ఉందేమో చూసుకోండి!

సోషల్ మీడియాలో ఎక్కువగా గడిపేవాళ్లకు ‘ఫోమో’ అనే కొత్తరకం ఫోబియా ఉంటున్నట్టు కొన్ని రీసెర్చ్‌ల్లో తేలింది. ఫోమో అంటే ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్’. అంటే ఏదో కోల్పోతున్నాం అనే భయం అన్నమాట. ఈ ఫోబియా ఎలా ఉంటుంది? దీన్నుంచి బయట పడడం ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం.

Social Media : సోషల్ మీడియా ఎక్కువగా వాడతారా? ఫోమో జబ్బు ఉందేమో చూసుకోండి!
Social Media Fomo
Nikhil
|

Updated on: Sep 16, 2025 | 6:29 PM

Share

సోషల్ మీడియాను గ్యాప్ లేకుండా వాడే వాళ్లలో ఫోమో అనే ఒక రకమైన మనస్తత్వం ఏర్పడుతుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఈ ఫోమో మాయలో పడ్డవాళ్ల మనస్తత్వం భిన్నంగా ఉంటుంది.

బిహేవియర్ ఇలా ఉంటుంది

తాము ఏదో మిస్ అవుతున్నాం అనే ఆతృత అనుక్షణం ఊహా ప్రపంచంలో విహరించేలా చేస్తుంది.  ఆన్‌లైనే లోకంగా గడిపేస్తుంటారు. నిమిషంలో ముప్ఫైసార్లు ఫోన్‌ని చెక్‌ చేసుకోవడం. భిన్నంగా ఉండాలనే తపనతో వెరైటీ కాన్సెప్ట్‌తో ఫొటోలు తీసి పోస్ట్ చేయడం. అత్యవసర పనులను కూడా లెక్కచేయకపోవడం. ఎప్పుడూ దిగాలుగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.  ఇది చాలా ప్రమాదకరమైన మానసిక సమస్య అంటున్నారు సైకాలజిస్టులు. దీన్నుంచి బయటపడకపోతే జీవితం అంతా బాధ పడాల్సివస్తుందట.

సోషల్ మీడియా చూడడం మానేస్తే ఏదో మిస్‌ అవుతాం అన్న భయం.  ఫ్రెండ్‌ ఫొటోకి లైక్‌లు వచ్చాయి, నాకు ఎందుకు రాట్లేదు? అన్న బెంగ,  అందరూ హ్యాపీగా ఉంటున్నారు నేను తప్ప అనే బాధ..  ఇలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నవాళ్లంతా ఫోమో సమస్యతో బాధ పడుతున్నట్టు అర్థం. ఈ ఫోబియా ఉన్నవాళ్లు పరిసరాలను పట్టించుకోరు. ఇంటికి సన్నిహితులొచ్చినా సమయాన్ని కేటాయించరు. చదువులో మార్కులు తగ్గుతున్నా పుస్తకం పట్టుకోరు. సందర్భం ఏదైనా చేతులు ఎప్పుడూ మొబైల్‌ను తడుముతూనే ఉంటాయి. ఇది మరింత ఎక్కువైతే యాంగ్జైటీ, డిప్రెషన్‌కు దారితీస్తాయి.

ఇలా బయటపడాలి

  • ఈ తరహా సోషల్ మీడియా ఫోబియా వల్ల బంధాలు, చదువు, ఉద్యోగం ఇలా.. అన్ని దెబ్బతింటాయి. జీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలియదు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నవాళ్లు వెంటనే దాన్నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.
  • స్నేహితుల పోస్ట్‌లు చూసి ఏదో మిస్‌ అయ్యాను అనే ఫీలింగ్‌ తెచ్చుకోకూడదు. సోషల్ మీడియాలో షేర్ చేసే ఫీలింగ్స్ నిజం కాదని తెలుసుకోవాలి.
  • పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టాలి. జీవితంలో మీరు ఎంచుకున్న గోల్స్‌పై దృష్టి పెట్టాలి.
  • రోజులో కొంత సమయం ఫోన్ పక్కన పెట్టేయాలి. ముఖ్యంగా సోషల్‌ మీడియా నోటిఫికేషన్లు ఆఫ్‌లో పెట్టుకోవాలి.
  • చేస్తున్న పనిలో పూర్తిగా నిమగమవ్వడం వల్ల సోషల్ మీడియా మీదకు మనసు పోకుండా ఉంటుంది.  ఏదో మిస్‌ అయ్యాననే భావన కలగదు.
  • ఊహల్లో కాకుండా వాస్తవంలో బ్రతకడం నేర్చుకోవాలి. జీవితంలో ఏది మిస్‌ అయినా పర్వాలేదు కానీ జీవితాన్నే మిస్‌ అయితే ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. కాబట్టి సోషల్ మీడియా కంటే రియల్ లైఫ్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోవాలి.
  • ఎంత ప్రయత్నించినా సోషల్ మీడియా లోకం నుంచి బయటపడలేకపోతుంటే సైకాలజిస్ట్ సాయం తీసుకోడానికి వెనుకాడొద్దు.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.