Subroto Cup: ప్రతిష్టాత్మకమైన సుబ్రోతో కప్ 64వ ఎడిషన్‌కు అంతా సంసిద్ధం
ప్రతిష్టాత్మకమైన సుబ్రోతో కప్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 64వ ఎడిషన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి టోర్నమెంట్‌లో 106 జట్లు పాల్గొంటున్నాయి. మంగళవారం దేశ రాజధానిలోని ఆకాశ్ ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన విలేకరుల కార్యక్రమంలో ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

ప్రతిష్టాత్మకమైన సుబ్రోతో కప్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 64వ ఎడిషన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. జూనియర్ బాలురు, బాలికలు, సబ్-జూనియర్ అనే మూడు విభాగాలలో సత్తా చాటేందుకు 106 జట్లు ఈసారి పోటీపడుతున్నాయి. ఈ టోర్నమెంట్ ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఢిల్లీ-ఎన్‌సిఆర్, బెంగళూరు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. మంగళవారం దేశ రాజధానిలోని ఆకాశ్ ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన విలేకరుల కార్యక్రమంలో ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎయిర్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ & సుబ్రోతో ముఖర్జీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సొసైటీ (SMSES) వైస్ చైర్మన్… ఎయిర్ మార్షల్ ఎస్. శివకుమార్ VSM సమక్షంలో ఈ అనౌన్స్‌మెంట్ వచ్చింది. భారత ఫుట్‌బాల్ క్రీడాకారిణి దలీమా చిబ్బర్ కూడా ఈ ఈవెంట్‌కు గౌరవ అతిథిగా హాజరయ్యారు.
ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో సుబ్రోతో ముఖర్జీ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహించే సుబ్రోతో కప్‌ను మొదట 1960లో నిర్వహించారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయడానికి.. అట్టడుగు స్థాయిలో ఆటను ప్రోత్సహించడానికి ఈ ఆలోచనను రూపొందించిన ఎయిర్ మార్షల్ సుబ్రోతో ముఖర్జీ పేరు మీదుగా ఈ టోర్నమెంట్‌కు పేరు పెట్టారు.
ఈ టోర్నమెంట్ ఆగస్టు 19న ఢిల్లీ-NCRలో జూనియర్ బాలికల (అండర్ 17) విభాగంలో స్టార్టవుతుంది. సబ్-జూనియర్ బాలుర (అండర్ 15) విభాగం మ్యాచ్‌లు సెప్టెంబర్ 2 నుంచి బెంగళూరులో జరుగుతాయి. టోర్నమెంట్ చివరి దశ జూనియర్ బాలుర (అండర్ 17) విభాగం సెప్టెంబర్ 16న ఢిల్లీ-NCRలో ప్రారంభమవుతుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎయిర్ ఆఫీసర్-ఇన్-చార్జ్ అడ్మినిస్ట్రేషన్ & వైస్ చైర్మన్ ఎయిర్ మార్షల్ ఎస్ శివకుమార్ విఎస్ఎమ్ మాట్లాడుతూ.. భారత వైమానిక దళం, ఎస్ఎంఎస్ఇల ఆధ్వర్యంలో.. ప్రతి సంవత్సరం టోర్నమెంట్‌ను మరింత మెరుగ్గా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. చిన్న పిల్లలు తమ కెరీర్‌లో తదుపరి అడుగు వేయడానికి ఇదే చక్కని వేడుక అని చెప్పారు. టోర్నమెంట్‌కు అర్హత సాధించిన అన్ని జట్లకు ఆయన కంగ్రాస్ చెప్పారు. టీమ్స్ అన్నీ నిజమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు.
భారత ఫుట్‌బాల్ క్రీడాకారిణి దలీమా చిబ్బర్ మాట్లాడుతూ.. సుబ్రోతో కప్‌లో తిరిగి పాల్గొనడం గౌరవంగా ఉందన్నారు. 2011లో తొలిసారిగా మహిళల అండర్-17 టోర్నమెంట్‌తో తన ప్రయాణం ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ టోర్నమెంట్ పాఠశాల స్థాయిలో కలలు కనే యువ బాలురు, బాలికలకు ఆశలకు రెక్కలు తొడుతుందన్నారు. వారు ప్రతిభను ప్రదర్శించడానికి.. తమ జీవితాన్ని మార్చుకోడానికి ఇదో చక్కని వేదికగా అభివర్ణించారు. ఈ టోర్నమెంట్‌లో ఆడిన చాలా మంది క్రీడాకారులు జాతీయ జట్లలో సత్తా చాటినట్లు చిబ్బర్ వివరించారు.
ఇండియన్ టైగర్; టైగ్రెస్ క్యాంపెయిన్‌లో భాగంగా జర్మనీలో అధునాతన ఫుట్‌బాల్ శిక్షణ కోసం స్కౌటింగ్ రౌండ్ నుంచి ఏడుగురు ఆటగాళ్లను ఈ టోర్నమెంట్ నుంచి ఎంపిక చేస్తారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో అంబేద్కర్ స్టేడియం, తేజస్ ఫుట్‌బాల్ మైదానంతో పాటు.. న్యూఢిల్లీలోని సుబ్రోతో పార్క్ ఫుట్‌బాల్ గ్రౌండ్, పింటో పార్క్ ఫుట్‌బాల్ మైదానం ఈ టోర్నమెంట్ కోసం వేదిక కానున్నాయి. బెంగళూరులో జలహల్లిలోని ఎయిర్ ఫోర్స్ స్కూల్, యలహంకలోని ఎయిర్ ఫోర్స్ స్కూల్, హెచ్‌క్యూ ట్రైనింగ్ కమాండ్ ఫుట్‌బాల్ మైదానంలో మ్యాచులు జరుగుతాయి.
మూడు విభాగాలలో పాల్గొనే మొత్తం 106 జట్లు దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వివిధ విద్యా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అలాగే నాలుగు విదేశీ దేశాల జట్లు కూడా పాల్గొంటాయి. మూడు విభాగాలలో మొత్తం 200 కి పైగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. పాల్గొనే అన్ని జట్లు న్యాయంగా ఆడేలా చూసేందుకు బెంగళూరులో సబ్-జూనియర్ బాలుర విభాగానికి వయస్సు నిర్ధారణ పరీక్ష నిర్వహించనున్నారు
జూనియర్ బాలుర విభాగంలో మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లోని టిజి ఇంగ్లీష్ స్కూల్ డిఫెండింగ్ ఛాంపియన్‌లుగా ఉండగా, జార్ఖండ్‌లోని రాంచీలోని మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ గత సంవత్సరం జూనియర్ బాలికల విభాగంలో తమ టైటిల్‌ను నిలబెట్టుకుంది. గత ఎడిషన్‌లో బెంగళూరులో జరిగిన సబ్-జూనియర్ బాలుర టైటిల్‌ను మేఘాలయలోని నోన్‌గిరి ప్రెస్బిటేరియన్ సెకండరీ స్కూల్ గెలుచుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




