Akash Deep: కొత్త కారుతో టీమిండియా ప్లేయర్‌కు చిక్కులు.. అసలు ఏం జరిగిందంటే..?
ఆకాష్ దీప్ ఇంగ్లాండ్ పర్యటనలో సూపర్‌గా రాణించాడు. ఈ టూర్ తర్వాత దేశానికి తిరిగి వచ్చిన వెంటనే.. అతడు కొత్త టయోటా ఫార్చ్యూనర్ కారును కొన్నాడు. కానీ ఇప్పుడు ఇది అతనికి సమస్యగా మారింది. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

టీమిండియా యువ సంచలనం ఆకాష్ దీప్ చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల అతడు కొనుగోలు చేసిన టయోటా ఫార్చ్యూనర్ ఈ సమస్యలు తెచ్చి పెట్టింది. ఆగస్టు 7న కొనుగోలు చేసిన ఈ లగ్జరీ కారుకు రిజిస్ట్రేషన్, హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేకపోవడంతో రవాణా శాఖ అధికారులు అతనికి నోటీసు జారీ చేశారు. మోటార్ వాహనాల చట్టం ప్రకారం, నంబర్ ప్లేట్ లేకుండా ఏ వాహనాన్ని రోడ్డుపై నడపకూడదు. అయితే ఆకాష్ దీప్ లక్నోలో కొనుగోలు చేసిన ఈ కారుకు ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి కాలేదు. దీంతో అధికారులు కారు రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు దానిని రోడ్డుపై నడపవద్దని ఆదేశించారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై నడిపితే కారును సీజ్ చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ లేకుండా కారును డెలివరీ చేసినందుకు, కారును విక్రయించిన షోరూమ్‌కు రవాణా శాఖ జరిమానా విధించి, డీలర్‌షిప్‌ను ఒక నెల పాటు సస్పెండ్ చేసింది.
ఆకాష్ దీప్ అద్భుత ప్రదర్శన
ఆకాష్ దీప్ తన అద్భుతమైన ఆటతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. గాయం కారణంగా మాంచెస్టర్‌లో జరిగిన నాల్గవ టెస్ట్‌కు దూరమైనప్పటికీ, ఓవల్‌లో జరిగిన 5వ టెస్ట్‌లో అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో 2 వికెట్లు తీయడంతో పాటు కీలకమైన 66 రన్స్ చేసి డి టీమ్ ఇండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆకాష్ దీప్ ఇప్పటివరకు 10 టెస్ట్ మ్యాచ్‌లలో 28 వికెట్లు తీశాడు.
దేశీయ క్రికెట్‌లో అత్యుత్తమ రికార్డు
దేశీయ క్రికెట్‌లో కూడా అతని రికార్డు అద్భుతంగా ఉంది. అతను 41 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 141 వికెట్లు, 28 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 42 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడి తన ప్రతిభను చాటుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




