AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెచ్చిపోయిన పిచ్చికుక్క.. దాడిలో పారా అథ్లెట్ సహా ఇద్దరు మృతి..

జోగేంద్ర ఛత్రియా శారీరక వైకల్యం ఉన్నప్పటికీ, కష్టపడి, ధైర్యంతో పారా అథ్లెటిక్స్‌లో జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు. అంతర్జాతీయ ఫ్లోర్‌బాల్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణం గ్రామానికే కాకుండా క్రీడా రంగానికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు, హృషీకేశ్ రాణా అనే రైతు కూడా మరణించాడు. వీరిద్దరి మరణం గ్రామాన్ని శోకసంద్రంలోకి నెట్టింది.

రెచ్చిపోయిన పిచ్చికుక్క.. దాడిలో పారా అథ్లెట్ సహా ఇద్దరు మృతి..
Dog Bite
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 11, 2025 | 1:19 PM

Share

సాధారణంగా కుక్కలంటే చిన్నపిల్లలు విపరీతంగా భయపడతారు. కుక్కలు ఉన్నాయంటే ఆ దారిలో వెళ్ళడానికి కూడా జంకుతారు. అలాంటిది ఇప్పుడు పెద్దవాళ్లు కూడా గజగజ వణికిపోవాల్సిన ఘటనలు ఎదురవుతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడాల్సిన అవసరం ఏర్పడుతోంది. పిచ్చి కుక్కలతో ప్రమాదమని ఎప్పటికప్పుడు ముస్సిపల్ సిబ్బంది వాటిని చంపుతున్నా ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తాజాగా జరిగిన ఓ ఘటనలో పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అది కూడా చనిపోయింది జాతీయ స్థాయి పారా అథ్లెట్ కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఒడిశా రాష్ట్రం బోలాంగీర్ జిల్లా తుషురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని చించేరా గ్రామంలో పిచ్చికుక్క దాడి ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనతో మొత్తం గ్రామం దుఃఖంలో మునిగిపోయింది. మృతుల్లో 33 ఏళ్ల జోగేంద్ర ఛత్రియా (జాతీయ స్థాయి పారా అథ్లెట్), 48 ఏళ్ల రైతు హృషీకేశ్ రాణా ఉన్నారు. శనివారం అర్ధరాత్రి బుర్లాలోని విమ్సార్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఈ ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం విషాదంగా మిగిలింది. ఈ ఘటన జూలై 23న జరగగా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చించేరా గ్రామంలో ఓ పిచ్చికుక్క జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఒకే రోజు గ్రామంలోని వివిధ ప్రదేశాల్లో ఆరుగురు గ్రామస్థులపై దాడి చేసింది. ఈ ఘటనలో పాఠశాలలకు వెళ్తున్న చిన్నారులు కూడా ఉండడం మరింత భయాందోళన కలిగించింది. ఎటువంటి ప్రేరేపణ లేకుండా కుక్క దాడి చేయడంతో గ్రామంలో బయటికి వెళ్ళి ఏదైనా పనులు చేసుకోవాలన్నా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక చిన్నపిల్లల సంగతి సరేసరి.. కాగా, గ్రామంలో ఒకే రోజు ఆరు ప్రదేశాల్లో జరిగిన పిచ్చికుక్క దాడిలో గాయపడిన ఆరుగురిని తొలుత బోలాంగీర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వారిని బుర్లాకు రిఫర్ చేశారు. చికిత్స అనంతరం నలుగురు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. అయితే, జోగేంద్ర ఛత్రియా, హృషీకేశ్ రాణా పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కొనసాగించారు. అయినప్పటికీ వైద్యుల ప్రయత్నాలు ఫలించకపోగా, శనివారం అర్ధరాత్రి ఆ ఇద్దరూ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.

జోగేంద్ర ఛత్రియా శారీరక వైకల్యం ఉన్నప్పటికీ, కష్టపడి, ధైర్యంతో పారా అథ్లెటిక్స్‌లో జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు. అంతర్జాతీయ ఫ్లోర్‌బాల్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణం గ్రామానికే కాకుండా క్రీడా రంగానికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు, హృషీకేశ్ రాణా అనే రైతు గ్రామంలో ఒక మంచి మనసున్న మనిషిగా పేరుపొందారు. ఎల్లప్పుడూ అవసరమైన వారికి సహాయం చేయడంలో ముందుండేవారు. ఆయన అకస్మాత్తు మరణం గ్రామాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి చించేరా గ్రామ ప్రజలు షాక్‌లోనే ఉన్నారు. ఊరిలో విచ్చలవిడిగా తిరిగే పిచ్చి కుక్కలు, వీధి కుక్కలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..