D Gukesh: 11 ఏళ్లకు వాగ్ధానం.. 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్.. చెన్నై చిన్నోడి దెబ్బకు చైనా విలవిల

World Chess Championship: 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడం ద్వారా గుకేష్ ఈ టైటిల్‌ను గెలుచుకున్న ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ గ్రాండ్ మాస్టర్‌గా నిలిచాడు. విజయం తర్వాత, గుకేశ్ తన ప్రత్యర్థి చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను కూడా ప్రశంసించాడు మరియు అతన్ని ఛాంపియన్ అని పిలిచాడు.

D Gukesh: 11 ఏళ్లకు వాగ్ధానం.. 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్.. చెన్నై చిన్నోడి దెబ్బకు చైనా విలవిల
Gukesh D Winner
Follow us
Venkata Chari

|

Updated on: Dec 13, 2024 | 7:52 AM

World Chess Championship: వాగ్దానాలు చాలామంది చేస్తుంటారు. కలలు కూడా చాలామంది కంటుంటారు. కానీ, ప్రతి ఒక్కరూ ఆ కలలను, తాము చేసిన వాగ్దానాలను నెరవేర్చుకోలేకపోతుంటారు. ఈ క్రమంలో కేవలం 11 ఏళ్ల వయసులో చేసిన వాగ్దానాన్ని, తన కలను 18 ఏళ్లకే నెరవేర్చుకున్న ఓ భారత యువకుడు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. భారత్‌కు చెందిన యువ చెస్ గ్రాండ్ మాస్టర్ డి.గుకేష్ చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శనతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గుకేశ్.. ఇప్పుడు చెస్ చరిత్రలో చిరస్థాయిగా పేరు నమోదు చేసుకున్నాడు. 18 ఏళ్ల వయసులో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ గెలిచి చరిత్ర సృష్టించిన గుకేశ్‌ తన కలను నెరవేర్చుకున్నాడు. కానీ, ప్రపంచ ఛాంపియన్ అయిన తర్వాత కూడా, అతను తనను తాను ‘ఉత్తమ’ ఆటగాడిగా పరిగణించడానికి నిరాకరించాడు.

నెరవేరిన ఏడేళ్ల కల..

గురువారం డిసెంబర్ 12న చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. సింగపూర్‌లో జరిగిన 17 రోజుల సుదీర్ఘ ఛాంపియన్‌షిప్‌లో, 14 రౌండ్ల హోరాహోరీ పోరు తర్వాత, భారత స్టార్ డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఓడించాడు. 13 రౌండ్ల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు 6.5 పాయింట్లతో సమంగా నిలిచారు. ఇటువంటి పరిస్థితిలో 14 చివరి రౌండ్‌లో నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. గుకేశ్ తన కంటే అనుభవం ఉన్న ఆటగాడిని ఓడించి ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. ఈ విధంగా అతను అతి పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా కూడా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

కేవలం 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయసులో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని గుకేశ్ ఈ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డ్ ఏ ఆటగాడికైనా ఒక పెద్ద అచీవ్‌మెంట్. గుకేష్ కేవలం 11 సంవత్సరాల 6 నెలల వయస్సులో ఉన్నప్పుడు, అతను చేజ్ బేస్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కలను వెల్లడించాడు. తాను పెద్దయ్యాక అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా ఎదగాలనుకుంటున్నట్లు చెప్పాడు. సరిగ్గా 7 సంవత్సరాల 2 నెలల తర్వాత గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి తాను కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేస్తాశాని చూపించాడు.

వెక్కివెక్కి ఏడ్చిన గుకేష్..

సాధారణంగా, చెస్ ఆటగాళ్ళు ఎల్లప్పుడూ వారి భావోద్వేగాలను నియంత్రిస్తుంటారు. వారి ముఖ కవళికలను బట్టి గెలుపు లేదా ఓటమిని అంచనా వేయడం చాలా కష్టం. గుకేష్ కూడా వీరికి భిన్నం కాదు. చాలా తక్కువ మాట్లాడి ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకునే గుకేష్ కి ఈసారి అలా చేయడం కష్టమైంది. ప్రత్యర్థి డింగ్ గూకేష్‌తో కరచాలనం చేసి, మ్యాచ్ షీట్‌పై సంతకం చేయగానే, అతను తన సీటుపై కూర్చున్నాడు. ఈ సందర్భంలో గుకేష్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఈ భారతీయ స్టార్ తన భావోద్వేగాలను ఈ విధంగా బహిరంగంగా ప్రదర్శించడం మొదటిసారి చూసి జనాలు షాకయ్యారు.

ఈ విజయంతో గుకేష్ మాత్రమే కాదు, అతని తండ్రి కూడా భావోద్వేగానికి గురయ్యారు. అందుకే మ్యాచ్ హాల్ నుంచి బయటకు రాగానే గుకేష్ ముందుగా తండ్రిని గట్టిగా కౌగిలించుకుని చాలా సేపు ఒకరికొకరు భావోద్వేగంతో నిండిపోయారు. తండ్రి మొహంలో సంతోషమే కాకుండా తన కొడుకు గురించి గర్వంగా ఉంది. అదే గర్వంతో గుకేష్ వెన్ను తడుతూనే ఉన్నాడు.

నా జీవితంలో బెస్ట్ మూమెంట్: గుకేశ్

మ్యాచ్ అనంతరం గుకేశ్ మాట్లాడుతూ, ‘లిరెన్ చేసిన పొరపాటు నా జీవితంలో అత్యుత్తమ క్షణం. అతను తప్పు చేసినప్పుడు, నాకు అర్థం కాలేదు. నేను నా సాధారణ మూవ్ చేయబోతున్నాను. అతని ఏనుగు నా ఏనుగుపై గురి పెట్టడం అప్పుడు చూశాను. నా ఒంటెతో అతని ఒంటెను చంపాను. నాకు మరో బంటు మిగిలి ఉంది. చివరికి అది సేవ్ అయింది. దీంతో లిరెన్ ఓడిపోయాడు.

విశ్వనాథన్ ఆనంద్ తర్వాత రెండో భారత ఆటగాడిగా..

భారత్ నుంచి చెస్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెండో ఆటగాడిగా గుకేశ్ నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ 2012లో చెస్ ఛాంపియన్ అయ్యాడు. గుకేశ్ 17 ఏళ్ల వయసులో ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌ను కూడా గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఈ టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..