పల్లెటూరి కబడ్డీ.. ప్రపంచ స్థాయి మార్కెట్‌గా ఎలా ఎదిగింది ? ద జర్నీ ఆఫ్ కబడ్డీ
మన దేశవాళీ క్రీడ కబడ్డీ దేశంలోని పలు రాష్ట్ర్లాలకు చెందిన గ్రామీణ యువతకు జీవనోపాధిగా మారి ఎందరికో కడుపు నింపుతోంది. పల్లెటూరి పిల్లలు సరదాగా ఆడుకున్న కబడ్డీ నేడు కొన్ని వర్గాలకు కాసుల పంటగా మారి సిరులు కుమ్మరిస్తోంది. IPL టైటిల్ స్పాన్సర్‌షిప్ తర్వాత భారతదేశంలో ఇదే రెండవ అత్యధిక స్పాన్సర్‌షిప్ ఒప్పందంగా నిలిచింది. ఇక అంతటితో కబడ్డీ కూత ఆగలేదు.. గుక్కతిప్పకుండా వేలం జోరు పుంజుకుంటూ వచ్చింది.
pro kabaddi league.. క్రికెట్ తప్ప వేరే ఆట తెలియదన్నట్లుగా వ్యవహరించే మన దేశంలో సంచలనాలు సృష్టిస్తున్న గేమ్ కబడ్డీ లీగ్. ఒక గ్రామీణ క్రీడకు కమర్షియల్ హంగులు అద్ది.. ఆ ప్లేయర్స్‌ను కూడా కోటీశ్వరులను చేస్తోంది. మంచి యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ మూవ్‌మెంట్స్‌తో క్రీడా ప్రపంచంలో కబడ్డీ మార్మోగిపోతోంది. రూరల్ ఇండియాలోనే కాదు.. అర్బన్ స్పోర్ట్స్ లవర్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది. 31కి పైగా దేశాల్లో ఆడుతున్న ఐపీఎల్ తర్వాత అత్యధిక మంది చూసే లీగ్‌గా పీకేఎల్ ఎదిగింది. ఇప్పటికే 10 సీజన్లు పూర్తి చేసుకొని 11వ సీజన్‌కు సిద్ధమవుతున్న ఈ పీకేఎల్.. ప్రతి సీజన్‌కూ తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంటూ వెళ్తోంది. 2014లో తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్ ప్లేయర్స్ వేలం జరిగింది. అప్పటి వరకూ క్రికెట్‌లో ఐపీఎల్ ప్లేయర్స్ వేలం చూసిన అభిమానులను ఈ కబడ్డీ వేలం పెద్దగా ఆకర్షించలేకపోయింది. ఐపీఎల్‌లో స్టార్ క్రికెటర్లను కోట్లు పెట్టి కొన్నాయి ఫ్రాంచైజీలు. అదే కబడ్డీ లీగ్ తొలి సీజన్‌లో ఓ ప్లేయర్ పలికిన అత్యధిక మొత్తం ఎంతో తెలుసా? కేవలం రూ. 12.8 లక్షలు. ఈ మొత్తమే అప్పట్లో కబడ్డీ ప్లేయర్స్‌కు చాలా ఎక్కువ. అప్పటి ఇండియన్ కబడ్డీ టీమ్ కెప్టెన్ రాకేశ్ కుమార్ ఈ ధర పలికాడు. కానీ, ప్రస్తుతం కబడ్డీ వేలం కోట్లలోకి చేరింది. PKL 10 వేలంలో మొత్తం ముగ్గురు రైడర్లు మిలియనీర్లు అయ్యారు. ఒక్కో ఆటగాడికి కోట్లలో ధరపెట్టి కొనుగోలు చేస్తున్నాయి ఫ్రాంచైజీలు. మారుమూల పల్లెలు, గ్రామీణ యువత ఆడుకునే కబడ్డీ ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌ను శాసించే దశకు ఎలా ఎదిగింది..?
భారతదేశ వీధుల్లో పుట్టిన కబడ్డీ ఆట నేడు ప్రపంచం మొత్తం మీద తనదైన ముద్ర వేస్తోంది. మన దేశ సంప్రదాయ క్రీడల్లో ఒకటైన కబడ్డీ ఆధునిక రూపంలో వాణిజ్య హంగులను అలుముకుంది. ప్రో కబడ్డీ లీగ్ పేరుతో భారీ బిజినెస్‌కు తెరలేపింది. PKLలో కొత్త ఫ్రాంచైజీని ఎంచుకోవడానికి సగటు ధర రూ. 100 కోట్లు దాటింది. ఈ లీగ్ కబడ్డీ ఆటను వ్యాపార పరంగానే కాకుండా యువ ఔత్సాహికులకు బెస్ట్ కెరీర్ అప్షన్‌గా మారింది. పల్లెటూరి పిల్లలు మట్టి నేలపై ఆడే అట్టడుగు స్థాయి ఆట నుండి, నిపుణుల పర్యవేక్షణలో కలర్‌ఫుల్ గ్రౌండ్స్, ఫైవ్‌స్టార్ లాబీ వరకు కబడ్డీ కూత సుదీర తీరాలను తాకింది. ప్రో-కబడ్డీలీగ్ తో ఎంతోమందిని రాత్రికి రాత్రే కోటీశ్వర్లుగా మార్చి దర్జాగా బతికేలా చేస్తోంది. 2014లో మొదటి వేలం జరిగినప్పుడు, ప్లేయర్ పర్స్ కేవలం 20 లక్షలు. అత్యంత ఖరీదైన కొనుగోలు 12 లక్షల రూపాయలు. 2023లో ప్లేయర్ పర్స్ రూ. 2.65 కోట్లతో అత్యధిక బిడ్‌తో ఐదు కోట్లకు పెరిగింది. అలాగే, ప్రో కబడ్డీ లీగ్ మొదటి సీజన్‌ను 435 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఆ సంవత్సరం ఇది IPL తర్వాత భారతీయ టెలివిజన్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన రెండవ క్రీడా టోర్నమెంట్‌గా నిలిచింది. ఇప్పుడు మన దేశవాళీ క్రీడ కబడ్డీ దేశంలోని పలు రాష్ట్ర్లాలకు చెందిన గ్రామీణ యువతకు జీవనోపాధిగా మారి ఎందరికో కడుపు నింపుతోంది. పల్లెటూరి పిల్లలు సరదాగా ఆడుకున్న కబడ్డీ నేడు కొన్ని వర్గాలకు కాసుల పంటగా మారి సిరులు కుమ్మరిస్తోంది.
ముంబై, ఢిల్లీ వంటి వివిధ మెట్రోపాలిటన్ నగరాలకు చెందిన విభిన్న సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలకు చెందిన 8 ఫ్రాంచైజీలతో ప్రారంభమైన ఈ కబడ్డీ లీగ్.. 2017 ఎడిషన్‌లో లక్నో, సోనిపట్, పాట్నా వంటి కబడ్డీ సంప్రదాయ ఫ్రెండ్లీ సిటీస్ సహా 12 జట్లు ఏర్పడ్డాయి. 2014లో ప్రారంభమైనప్పటి నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తర్వాత దేశంలో అత్యధికంగా వీక్షించబడిన రెండవ స్పోర్ట్స్ లీగ్‌గా PKL నిలిచింది. స్టార్ ఇండియా ప్రకారం, మొదటి నాలుగు సీజన్లలో లీగ్ వీక్షకుల సంఖ్య 50శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి 50 మిలియన్లకు పైగా వీక్షకులను ఆకర్షించింది. మార్కెట్ డిమాండ్‌కు ప్రతిస్పందించే సరఫరాను అందించింది. ప్రేక్షకులు, అభియానుల కోసం లీగ్‌ను మరాఠీ, తెలుగు, కన్నడ భాషల్లో ప్రసారం చేయాల్సి వచ్చింది. దాని ప్రసార హక్కుల ద్వారా స్టార్ ఇండియా 4వ ఎడిషన్ ముగిసే సమయానికి రూ.70 కోట్ల భారీ లాభాలను ఆర్జించింది. అలాగే, అదే సీజన్‌లో యాడ్స్ ద్వారా రూ.150 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. సీజన్ 1కు ప్రధాన స్పాన్సర్‌లంటూ లేరు. కానీ, సీజన్ 3 విడుదలయ్యే సమయానికి, లీగ్, ఫ్రాంచైజీలలో 68కి పైగా బ్రాండ్‌లు ప్రాతినిధ్యం వహించాయి. చైనీస్ ఫోన్ తయారీదారులు Vivo దాదాపు రూ.300 కోట్లకు తొలిసారిగా 2017 లీగ్ టైటిల్ స్పాన్సర్‌ను కైవసం చేసుకుంది. IPL టైటిల్ స్పాన్సర్‌షిప్ తర్వాత భారతదేశంలో ఇదే రెండవ అత్యధిక స్పాన్సర్‌షిప్ ఒప్పందంగా నిలిచింది. ఇక అంతటితో కబడ్డీ కూత ఆగలేదు.. గుక్కతిప్పకుండా వేలం జోరు పుంజుకుంటూ వచ్చింది.
ఒక్కొ సీజన్‌కు ఆటగాళ్ల ధర అమాంతంగా పెరుగుతూ వచ్చింది. ఇక ప్రో కబడ్డీ లీగ్ 10 సీజన్ వేలంలో ఇరాన్‌కు చెందిన మొహమ్మద్‌రెజా షాద్‌లూయీ చియానేహ్ రికార్డు ధర పలికాడు. ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఈ వేలంలో రైడర్, డిఫెండర్ అయిన షాద్‌లూయూని పుణేరి పల్టన్ రూ.2.35 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో, PKL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఈ ఇరానీయన్ నిలిచాడు. భారత స్టార్ మనీందర్ సింగ్‌ను రూ. 2.12 కోట్లకు బెంగాల్ వారియర్స్ దక్కించుకుంది. ప్రో కబడ్డీ 2023లో అత్యంత ఖరీదైన రైడర్ పవన్ కుమార్ సెహ్రావత్. అతను ఈ సీజన్‌లో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. షాడ్లౌయ్ దేశస్థుడు ఫాజెల్ అత్రాచలి రెండవ అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. రూ. 1.60 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. మొత్తం 23 మంది అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం 12 ఫ్రాంచైజీలు పోటీకి దిగాయి. మొత్తానికి క్రికెటర్లకు ధీటుగా కబడ్డీ ప్లేయర్లు సైతం లక్షల రూపాయల ధర నుంచి కోట్ల రూపాయల ధరకు చేరుకోగలగడం మన దేశానికే గర్వకారణంగా నిలిచింది.
ఇకపోతే, కబడ్డీ క్రీడ చాలా పురాతనమైనది. కబడ్డీకి, భారత ప్రజలకు మధ్య ఎన్నో ఏళ్ల నుంచి బలమైన అనుబంధం ఉంది. 4000 సంవత్సరాలకు పైగా మహాభారతం నుంచి భారతీయ సంస్కృతిలో ఈ ఆట ఒక భాగంగా ఉంది. మహారాష్ట్రలో కబడ్డీని హుటుతు అంటారు. బెంగాల్ లేదా భారతదేశంలోని తూర్పు భాగంలో దీనిని హదూడో అని పిలుస్తారు. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో దీనిని చెడుగుడు అని పిలిచేవారు. భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతాలలో దీనిని కబడ్డీ అని పిలుస్తారు. స్వాతంత్య్రానికి పూర్వం నుండి వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో ఆడిన కబడ్డీ ప్రయాణం ఊహించిన దానికంటే కఠినమైనది. క్రీడను ఒక నియమావళి కిందకు తీసుకురావడం, దాని సమాఖ్యను ఏర్పాటు చేయడం, దానిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం చాలా కష్టమైన పని. కబడ్డీ ఇప్పుడు దాని నిరాడంబరమైన మూలాల నుండి భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడే రెండవ క్రీడగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు కబడ్డీ కూడా ఆసియా క్రీడలు, ఆసియా ఇండోర్ గేమ్స్, ఆసియా బీచ్ గేమ్స్‌లో స్థానం దక్కించుకుంది. త్వరలో కామన్‌వెల్త్ క్రీడలు, ఆ తర్వాత ఒలింపిక్స్‌లో భాగం కానుంది. అయినప్పటికీ గ్రామీణ క్రీడ కబడ్డీకి, మహారాష్ట్ర్రకు అవినాభావ సంబంధమే ఉంది. నిరుద్యోగంతో అల్లాడుతున్న మరాఠీ యువతకు కబడ్డీ క్రీడే కడుపునింపుతోంది. కబడ్డీ మరాఠీ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవితంలో ఓ ప్రధానభాగంగా మారిపోయింది. 2014లో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ క్రీడకు ప్రాముఖ్యత పెరిగింది. భారీ ప్రజాదరణ లభించింది. లీగ్ రూపకర్త మాషల్ స్పోర్ట్స్ 30-సెకన్ల రైడ్స్, డూ-ఆర్-డై రైడ్స్, సూపర్ రైడ్స్, సూపర్ ట్యాకిల్స్ వంటి వినూత్న నియమాలను అమలు చేసి ఈ ఆటకు కొత్త ఊపు తీసుకొచ్చింది. దేశంలోని క్రీడాభిమానులకు సుపరిచితం అయిన ఆటను లీగ్ ప్రసారకర్తలు ప్రో కబడ్డీ లీగ్‌లో అద్భుతంగా చూపెట్టి దేశ, విదేశాల్లో కోట్లాది మందిని ఆకర్షించారు.
అయితే దేశీక్రీడ కబడ్డీకి సరైన ప్రామాణికత లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందినది. భారత కబడ్డీ సమాఖ్య 1950 సంవత్సరంలో స్థాపించబడింది. 1979లో ఈ ఆట జపాన్ దేశంలోకి ప్రవేశపెట్టారు. కబడ్డీ మొదటిసారిగా చైనాలో జరిగిన 1990 ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుండి 2006 వరకు మనదేశం కబడ్డీ క్రీడాకారులు ఈ ఆటలో ప్రపంచ విజేతలుగా నిలిచారు. ప్రముఖ కబడ్డీ క్రీడాకారులు రాహుల్ చౌదరి, అనూప్ కుమార్, ప్రదీప్ నర్వాల్, అజయ్ తకుర్, జాస్విర్ సింగ్, సందీప్ నర్వాల్, దీపక్ నివ్స్, హూడా, మన్జీత్ చిల్లర్, మోహిత్ చిల్లర్, సురేంద్ర నద, రాకేష్ కుమార్ వంటి వారు దేశవ్యాప్త క్రీడ అభిమానులను సంపాదించుకోగలిగారు. 1970లోనే మహారాష్ట్ర్ర కబడ్డీ జట్టు.. నేపాల్, జపాన్ దేశాలలో ఎగ్జిబిషన్ మ్యాచ్ లు ఆడటం ద్వారా ఈ గ్రామీణ క్రీడకు ఖ్యాతి తీసుకువచ్చింది. మహారాష్ట్ర్ర నుంచే అభిలాష్ మాత్రే, మాయా కాశీనాథ్, శాంతారామ్ జాదవ్, రాజు భవసార్ లాంటి పలువురు ప్రపంచ మేటి క్రీడాకారులు దూసుకు వచ్చారు.
మహాభారతంతో కబడ్డీకీ ఉన్న అనుబంధం…
భారతదేశంలో కబడ్డీ కథ శతాబ్దాల నాటిది. ఒక అంచనా ప్రకారం, ప్రమాదకర పరిస్థితుల్లో దాడిని ఎదుర్కోవడానికి పురాతన కాలంలో మనుషులు ఉపయోగించిన పద్ధతులతో కబడ్డీ పద్ధతులు సరిపోతాయి. ఇది మాత్రమే కాదు, కబడ్డీని పోలిన కథలు మహాభారతంలో కూడా పేర్కొనబడ్డాయి. శత్రుమూకలు చుట్టుముట్టినపుడు అర్జునుడి కుమారుడు అభిమన్యు కథ కబడ్డీ పందాలను గుర్తు చేస్తుంది. ఈ గేమ్‌లో చిన్న చిన్న మార్పులు చేసినప్పటికీ, లక్ష్యం అలాగే ఉంది. అంటే శత్రువుల భూభాగంపై దాడి చేయడం. కబడ్డీ ఆటలో 7 మంది ఆటగాళ్లతో కూడిన రెండు జట్లు ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరు, రైడర్స్ అని పిలువబడే రెండు జట్ల ఆటగాళ్ళు, కబడ్డీని నిరంతరం అనునయిస్తూనే మరొక జట్టు కోర్టులోకి అడుగు పెడతారు.. వీలైనంత ఎక్కువ మంది ఇతర జట్టు సభ్యులను తాకి ఔట్ చేస్తూ.. వారి సొంత కోర్టులోకి తిరిగి రావడం ఈ గేమ్ లక్ష్యం.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. టీవీ9 యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి