Champions Trophy: కోహ్లీని ఊరిస్తున్న భారీ రికార్డు.. కొడితే నంబర్ వన్..! మిస్ అయితే ఈ జన్మలో అందుకోలేడు!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ఓ భారీ రికార్డు ఊరిస్తోంది. అది అలాంటి ఇలాంటి రికార్డు కాదు.. కొడితే మాత్రం ఇండియన్ క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాటర్‌గా నిలిచిపోతాడు. ఇప్పటికే కోహ్లీ పేరిట లెక్కలేనన్ని రికార్డులు ఉన్నప్పటికీ ఈ రికార్డు కూడా కోహ్లీ సాధించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆ రికార్డ్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్ లోకమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కోసమైతే ఇటు ఇండియన్ ఫ్యాన్స్, అటు పాక్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 19 నుంచి ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీకి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని ఓ భారీ రికార్డు ఊరిస్తోంది. అది అలాంటి ఇలాంటి రికార్డు కాదు.. కొడితే మాత్రం ఇండియన్ క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాటర్‌గా నిలిచిపోతాడు. ఇప్పటికే కోహ్లీ పేరిట లెక్కలేనన్ని రికార్డులు ఉన్నప్పటికీ ఈ రికార్డు కూడా కోహ్లీ సాధించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీతో విరాట్ కోహ్లీ తన నాలుగో ఛాంపియన్స్ ట్రోఫీని ఆడబోతున్నాడు. ఈ టోర్నీలో కోహ్లీ కేవలం 173 పరుగులు చేస్తే.. టీమిండియా తరఫున ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.
గతంలో ఆడిన మూడు ఛాంపియన్స్ ట్రోఫీల్లో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 529 పరుగులు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్ ది గబ్బర్ శిఖర్ ధావన్ మొదటి స్థానంలో ఉన్నాడు. కేవలం రెండు ఛాంపియన్స్ ట్రోఫీలు మాత్రమే ఆడిన ధావన్, రెండు ఎడిషన్స్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. రెండు ఎడిషన్స్‌లో కలిసి 10 మ్యాచ్‌లు ఆడిన ధావన్ 701 పరుగులు సాధించాడు. 2013లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన విషయం తెలిసిందే. 2017లో పాకిస్థాన్‌తో ఫైనల్ ఆడిన భారత్ ఓటమి పాలైంది. ఈ రెండు ఎడిషన్స్‌లో కూడా ధావనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇక ధావన్ తర్వాత రెండో స్థానంలో టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నాడు. గంగూలీ కెప్టెన్సీలో 2000వ సంవత్సరంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా ఓటమి పాలైంది. 2002లో శ్రీలంకతో జరిగిన ఫైనల్ రద్దు కావడంతో ఇరు జట్లను విజేతలుగా ప్రకటించింది ఐసీసీ. దీంతో ఆ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని లంకతో కలిసి పంచుకుంది భారత జట్టు. ఈ రెండు ఎడిషన్స్‌లోనూ భారత కెప్టెన్‌గా ఉన్న దాదా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. మొత్తం 13 మ్యాచ్‌ల్లో 665 పరుగులతో ఛాంపియన్స్ ట్రోఫీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక మూడో స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీస్‌లో మొత్తం 19 మ్యాచ్‌లు ఆడిన ద్రవిడ్ 627 పరుగులు చేశాడు. అతని తర్వాత కోహ్లీ 13 మ్యాచ్‌ల్లో 529 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇప్పుడు కోహ్లీ ముందు మరో అవకాశం ఉంది. మూడు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో కలిపి మరో 173 పరుగులు చేస్తే.. అతనే టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడు. ఇండియా సెమీస్, ఫైనల్స్‌కు వెళ్తే కోహ్లీకి మరో రెండు మ్యాచ్‌లు అదనంగా వస్తాయి. ఓవరాల్‌గా ఛాంపియన్స్ ట్రోఫీల్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 791 పరుగులతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఆ రికార్డు కొట్టాలంటే కోహ్లీ ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీలో 263 పరుగులు చేయాలి. ఒక వేళ కోహ్లీ ఈ రికార్డులు బ్రేక్ చేస్తే.. అతని రికార్డుల బుక్‌లో మరో పేజీ వచ్చి చేరుతుంది. ఒక వేళ కోహ్లీ అన్ని రన్స్ చేయలేకపోతే.. ఎలాగో కోహ్లీ మరో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడటం కష్టమే అనే అనుమానలు వ్యక్తం అవుతున్న క్రమంలో ఇదే కోహ్లీకి చివరి ఛాంపియన్స్ ట్రోఫీ అని మనం భావించవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.